మెట్రో రైలు రూటు మారింది
- రెండు చోట్ల స్వల్ప మార్పులు
- కొత్త మార్గం అసెంబ్లీ వెనుక నుంచి
- భూగర్భ మెట్రో లేనట్టే
- సీఎం తాజా ప్రకటనతో చారిత్రక కట్టడాలు సేఫ్
- హర్షం వ్యక్తం చేస్తున్న సుల్తాన్‌బజార్ వ్యాపారులు
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక సుల్తాన్‌బజార్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో మెట్రో మార్గం (అలైన్‌మెంట్) మారుతుందని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించడంతో మెట్రో మార్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2) రూట్లో వచ్చే సుల్తాన్‌బజార్ మార్కెట్ మీదుగా కాకుండా.. దాని మీపంలోని కోఠి ఉమెన్స్ కళాశాల వెనకవైపు నుంచి బడిచౌడి, తిలక్‌పార్క్, వీరసావర్కార్ విగ్రహం, నారాయణగూడా ఫ్లైఓవర్ మీదుగా మెట్రో మార్గాన్ని మళ్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్-1) రూట్లో అసెంబ్లీ ప్రధాన రహదారి నుంచి కాకుండా నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్‌గార్డెన్, అసెంబ్లీ వెనుక నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో మార్గాన్ని మళ్లించే అవకాశాలున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం రెండు చోట్ల సుమారు వంద మీటర్ల మార్గంలో అలైన్‌మెంట్‌ను మార్చాల్సి ఉందని హెచ్‌ఎంఆర్ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు చోట్ల అలైన్‌మెంట్ మార్చిన పక్షంలో సుల్తాన్‌బజార్, అసెంబ్లీ, గన్‌పార్క్ అమరవీరుల స్తూపాలకు ఎలాంటి నష్టం జరగదని అధికారులు భావిస్తున్నారు.
నగరంలో మూడు కారిడార్ల పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మార్గంలో మెట్రో ప్రాజెక్టును చేపడుతున్న విషయం విదితమే. తాజాగా మారిన అలైన్‌మెంట్ ప్రకారం అధికారులు ఈ ప్రాంతాల్లో సర్వే చేయాల్సి ఉంది. భూగర్భ మెట్రో నిర్మాణం నగరంలో సాధ్యపడదని నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదించినందున ఎలివేటెడ్ మార్గంలోనే పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. సీఎం తాజా ప్రకటనపై సుల్తాన్‌బజార్ ట్రేడర్స్ అసోసియేషన్, హైదరాబాద్ హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ నాలుగేళ్ల పొరాటం ఫలించిందని వారు పేర్కొన్నారు.
నేడు మళ్లీ టెస్ట్ రన్..
నాగోల్-మెట్టుగూడా రూట్లో సోమవారం మెట్రో రైలుకు మరోసారి టెస్ట్ రన్ నిర్వహించనున్నట్టు ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. నాగోల్ మెట్రో డిపోలోని నాలుగు మెట్రో రైళ్లకు 18 రకాల పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సోమవారం కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో సదరు పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.