ఢిల్లీ: జాట్ల రిజర్వేషన్ విషయంలో సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జాట్లకు రిజర్వేషన్ కల్పించే అంశంపై బిల్లు ప్రవేశపెట్టడానికి హర్యానా ప్రభుత్వం అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుందని, జాట్ నాయకులతో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ప్రకటన చేయనున్నట్లు మంత్రి ఓపీ ధన్కర్ ఆదివారం తెలిపారు. ఎనిమిది రోజులుగా జాట్లు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడంతో మృతుల సంఖ్య 12 కు చేరింది.
ఉద్యమం రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాలలో సైతం ఉద్రిక్తతలకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ ఆదివారం హర్యానా మంత్రి ధన్కర్, ఢిల్లీ పోలీస్ చీఫ్ బీఎస్ బస్సీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్తో సమీక్ష నిర్వహించారు.
కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ.. జాట్ ల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపిన ఆయన జాట్ లను ఆందోళన విరమించాల్సిందిగా కోరారు.