స్వప్న ‘సంబురం’ | Telangana celebrations in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

స్వప్న ‘సంబురం’

Published Wed, Feb 19 2014 4:25 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM

Telangana celebrations in Mahabubnagar district

ఇది అరవై ఏళ్ల ఆశ. సుదీర్ఘ పోరాటం. త్యాగాల సింధూరం. ఉద్యమ బాటన ఊరూ..వాడా నడిచాక ఇన్నేళ్లకు ఫలించిన స్వప్నం. పార్లమెంటు సాక్షిగా లోక్‌సభ ఆమోద ముద్రతో తెలంగాణ ఆవిర్భావం. ఈ వార్త తెల్సిన వెంటనే పాలమూరు జిల్లా ఆనంద డోలికల్లో ఊగిపోయింది. వయోబేధం లేకుండా అంతా ఎగిరి గెంతులేశారు. రంగులు చల్లుకున్నారు. ఆప్యాయంగా అలయ్ బలయ్ ఆడారు. నవలోకం మనకోసమే వెలిసిందని మురిసిపోయారు. తెలంగాణ తల్లిని ముద్దాడారు. జెండాలెత్తి జై కొట్టారు. విభేదాలు మరచి ఒక్కటై సంబురాలు జరుపుకున్నారు. బాజాలు మోగాయి. బాణసంచా పేలింది. వాహ్...అంతటా జోష్..జోష్.
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభలో రాష్ట్ర పునర్విభజ న బిల్లుకు ఆమోదం లభించడంతో తెలంగాణవాదుల సంబురాలతో ఊరూవాడా హోరెత్తింది. హోళీ, దీపావళి పండుగ ఒకేసారి కలిసి వచ్చిన రీతిలో తెలంగాణవాదులు ఆనందోత్సాహంలో తేలియాడారు. మిఠాయిలు పంచుతూ అలయ్‌బలయ్‌తో ఆనందం పంచుకున్నారు. రాజకీయ పక్షాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ఎవరికి వారుగా ర్యాలీలతో ముఖ్య కూడళ్లకు తరలివచ్చారు. బాణసంచా పేల్చుతూ ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. డప్పు చప్పుళ్లతో ముఖ్య కూడళ్లు మార్మోగాయి. డీజేలు ఏర్పాటు చేసి  ఉద్యమ గీతాలకు అనుగుణంగా ఆట పాటల్లో మునిగి తేలారు.
 
 అమరుల స్థూపాలకు నివాళి అర్పిస్తూ, తెలంగాణ తల్లి, అంబేద్కర్, గాంధీ తదితరుల విగ్రహాలను పూలమాలలతో ముంచెత్తారు. వివిధ పార్టీల ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేయడంతో కింది స్థాయి నేతలు పార్టీ పతాకాలతో హడావుడి చేశారు. ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయిన జన సామాన్యం ‘బిల్లు ఆమోదం’ వార్తతో రోడ్లపైకి రావడంతో జనసంద్రం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠ నడుమ రాష్ట్ర పునర్విభజన బిల్లుకు ఆమోదం లభించడంతో పాలమూరు అణువణువునా పులకరించింది.  మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో టీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ జిల్లా ఛైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.
 
 వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్, కుల సం ఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిం చారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులతో జెతైలంగాణ నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల పరిధుల్లో ప్రజలు ఆనందంతో ఊగిపోయారు.
  షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, టీజేఏసీ నేతలు ముఖ్య కూడలికి చేరుకుని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. డీజే ఏర్పాటు చేసి నృత్యాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించాయి.
 
  నాగర్‌కర్నూలులో టీఆర్‌ఎస్ ప్రచార రథంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సీ కాంప్లెక్స్ ముందు టెంట్ ఏర్పాటు చేసి అందరికీ తెలంగాణ శుభాకాంక్షలు తెలిపారు.  బీజేపీ నాయకులు ఎమ్మెల్యే నాగం ఇంటి ముందు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్దనున్న వనం ఝాన్సీ చిత్రపటానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. టీడీపీ నాయకులు ప్రధాన రహదారిపై రంగులు చల్లుకుంటూ సంబరాలు నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు.
 
  మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ వాదులు మిఠాయి పంచి బాణసంచా కాల్చారు.   
  కొల్లాపూర్  నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ,సీపీఐ,నాయకులు విజయోత్సవర్యాలీలు నిర్వహించారు. కొల్లాపూర్, వీపనగండ్ల మండలాల్లో విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే జూపల్లి కష్ణారావు తనయులు అరుణ్,వరుణ్‌లు పాల్గొన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
 
  కల్వకుర్తిలో ప్రధాన వీధుల గుండా ర్యాలీలు నిర్వహించారు. పట్టణంలోని జేఏసీ శిబిరం, బస్టాండ్, ఆర్టీసీ డిపో, హైదరాబాద్ చౌరస్తాల్లో బాణసంచాలు కాల్చుతూ, నత్యాలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సంబరాలు చేసుకున్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు సమీపంలో బాణాసంచా కాల్చారు.
 
  వనపర్తి లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు. వీధుల్లో బాణా సంచాకాల్చి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు.
 
  కొడంగల్‌లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీల ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలో సాయంత్రం సంబరాలు నిర్వహించారు.  
 
  అచ్చంపేట పట్టణంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు విద్యార్థి, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు రోడ్లపై ర్యాలీలు చేపట్టారు.

  టీబిల్లుపై లోక్ సభ ఆమోదాన్ని హ ర్షిస్తూ దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో ఆనందం తొణికిసలాడింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు ర్యాలీలు చేపట్టడంతోపాటు మిఠాయిలు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  గద్వాలలో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం సాయంత్రం వేరువేరుగా రహదారులపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు.
 
   అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఎర్రవల్లి చౌరస్తాలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ప్రజలతో కలిసి తెలంగాణ సంబరాలను పంచుకున్నారు.
 
  జడ్చర్లతోపాటు నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్, బాలనగర్, నవాబుపేట మండలాల్లో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి.
  నారాయణపేటలో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ర్యాలీలు, వేడుకలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement