నిమిషంన్నతో సరి
అసెంబ్లీ మళ్లీ వాయిదా.. మండలిలోనూ అదే సీను
సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ
తెలంగాణ బిల్లుపై చర్చకు టీ సభ్యుల పట్టు
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర.. జై తెలంగాణ నినాదాల మధ్య శాసనమండలి, అసెంబ్లీ రెండూ ఐదో రోజు బుధవారం కూడా ఎలాంటి ఎజెండా కార్యక్రమాలనూ చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో ఉభయ సభలూ హోరెత్తాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే వివిధ పక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ, తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చించి సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపాలంటూ సీపీఐ పక్ష నేత జి.మల్లేశ్, సమైక్యాంధ్ర-తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితిపై చర్చించాలని టీడీపీ ఇచ్చిన తీర్మానాలను తిరస్కరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యులు పోడియం వద్ద నినాదాలకు దిగటంతో సభను స్పీకర్ గంట పాటు వాయిదా వేశారు. 10.15 తిరిగి ప్రారంభమైనా 15 సెకండ్లకే మళ్లీ వాయిదా పడింది. మధ్యాహ్నం 1.20కి మూడోసారి సమావేశం కాగానే మళ్లీ నినాదాలు హోరెత్తాయి. దాంతో మళ్లీ 15 సెకండ్లలోనే సభను గురువారానికి వాయిదావేశారు. బుధవారం ఒకటిన్నర నిమిషాల పాటే సభ సాగింది.
మండలిలోనూ: ఉదయం 10 గంటలకు మండలి సమావేశం కాగానే వైఎస్సార్‌సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లి జై సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు. తెలంగాణ సభ్యులు కూడా జై తెలంగాణ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో కౌన్సిల్ హోరెత్తింది. ‘‘రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చిద్దాం. అందరి అభిప్రాయాలూ రికార్డు చేసి పంపుతాం. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు’’ అని మండలి చైర్మన్ సూచించారు. కానీ సమైక్యాంధ్ర తీర్మానం చేశాకే బిల్లుపై చర్చకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్‌సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు మళ్లీ చైర్మన్ పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. దాంతో 10.30కు సభ వాయిదా పడింది. 11.45కు సమావేశమైనా అదే గందరగోళం నెలకొనడంతో రెండు నిమిషాలకే డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు సభను గురువారానికి వాయిదా వేశారు.
అందరి అభిప్రాయాలూ రికార్డు చేసి పంపుతాం: చక్రపాణి
‘‘రాష్ట్రపతి నుంచి వచ్చిన ఏ అంశానికైనా సభలో ప్రాధాన్యముంటుంది. చర్చకు సహకరించండి. అందరూ మాట్లాడవచ్చు. కావాల్సినంత సమయమిస్తా. అనుకూలంగా, వ్యతిరేకంగా, తటస్థంగా వచ్చే అన్ని అభిప్రాయాలనూ రికార్డు చేసి రాష్ట్రపతికి పంపుతాం. అఫిడవిట్లిచ్చినా స్వీకరిస్తాం. మనం పంపే ప్రతి అంశాన్నీ ఆయన పరిశీలిస్తారు’’ అని సభ్యులకు చక్రపాణి వివరించారు. అనంతరం తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. సభ్యులెవరైనా బిల్లుపై ఓటింగ్ కోరితే అనుమతిస్తారా అని ప్రశ్నించగా, ‘‘రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును తిరస్కరించడం, అంగీకరించడం ఉండవు. వాటన్నింటిపైనా పార్లమెంటుదే తుది నిర్ణయం’’ అని బదులిచ్చారు.