Jai Samikyandhra
-
కిరణ్ 'జై సమైక్యాంధ్ర' తొలి కార్యవర్గం భేటీ
రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆవిర్భవించిన జై సమైక్యాంధ్ర పార్టీ తొలి కార్యవర్గం బుధవారం సమావేశమైంది. కిరణ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. మరోవైపు జై సమైక్యాంధ్ర తొలిసభ స్థానిక జెమినీ గ్రౌండ్స్‌లో ఈరోజు సాయంత్రం జరగనుంది. ఈ సభలో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్ కీలకంగా నిలవనుండగా మాజీమంత్రి పితాని సత్యనారాయణ, దాసరి నారాయణరావు, ఎమ్మెల్సీ బలసాలి ఇందిర హాజరు కానున్నట్లు సమాచారం. -
కిరణ్ పార్టీకి ఆదిలోనే హంసపాదు
సాక్షి, రాజమండ్రి: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేయబోయే ‘జై సమైక్యాంధ్ర’ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 12న పార్టీ జెండా, ఎజెండాలను ప్రకటించే బహిరంగసభకు తొలుత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్ సన్నాహాలు ప్రారంభించారు. అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో కళాశాల మైదానంలో సభ నిర్వహణకు అనుమతించబోమన్న కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సభ కోసం తరలించిన సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. దీంతో విధి లేక వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. లాలాచెరువు వద్ద ఉన్న ప్రైవేటు స్థలాన్ని ముందుగా పరిశీలించినా ఆ స్థలం సాంకేతికంగా అనుకూలంగా లేదని, చివరకు వి.ఎల్.పురం ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న జెమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు. -
నిమిషంన్నతో సరి
అసెంబ్లీ మళ్లీ వాయిదా.. మండలిలోనూ అదే సీను సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్సీపీ తెలంగాణ బిల్లుపై చర్చకు టీ సభ్యుల పట్టు సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర.. జై తెలంగాణ నినాదాల మధ్య శాసనమండలి, అసెంబ్లీ రెండూ ఐదో రోజు బుధవారం కూడా ఎలాంటి ఎజెండా కార్యక్రమాలనూ చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో ఉభయ సభలూ హోరెత్తాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే వివిధ పక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ, తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చించి సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపాలంటూ సీపీఐ పక్ష నేత జి.మల్లేశ్, సమైక్యాంధ్ర-తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితిపై చర్చించాలని టీడీపీ ఇచ్చిన తీర్మానాలను తిరస్కరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులు పోడియం వద్ద నినాదాలకు దిగటంతో సభను స్పీకర్ గంట పాటు వాయిదా వేశారు. 10.15 తిరిగి ప్రారంభమైనా 15 సెకండ్లకే మళ్లీ వాయిదా పడింది. మధ్యాహ్నం 1.20కి మూడోసారి సమావేశం కాగానే మళ్లీ నినాదాలు హోరెత్తాయి. దాంతో మళ్లీ 15 సెకండ్లలోనే సభను గురువారానికి వాయిదావేశారు. బుధవారం ఒకటిన్నర నిమిషాల పాటే సభ సాగింది. మండలిలోనూ: ఉదయం 10 గంటలకు మండలి సమావేశం కాగానే వైఎస్సార్సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లి జై సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు. తెలంగాణ సభ్యులు కూడా జై తెలంగాణ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో కౌన్సిల్ హోరెత్తింది. ‘‘రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చిద్దాం. అందరి అభిప్రాయాలూ రికార్డు చేసి పంపుతాం. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు’’ అని మండలి చైర్మన్ సూచించారు. కానీ సమైక్యాంధ్ర తీర్మానం చేశాకే బిల్లుపై చర్చకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్సీపీ, సీమాంధ్ర టీడీపీ సభ్యులు మళ్లీ చైర్మన్ పోడియంలోకి వచ్చి నినాదాలు చేశారు. దాంతో 10.30కు సభ వాయిదా పడింది. 11.45కు సమావేశమైనా అదే గందరగోళం నెలకొనడంతో రెండు నిమిషాలకే డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు సభను గురువారానికి వాయిదా వేశారు. అందరి అభిప్రాయాలూ రికార్డు చేసి పంపుతాం: చక్రపాణి ‘‘రాష్ట్రపతి నుంచి వచ్చిన ఏ అంశానికైనా సభలో ప్రాధాన్యముంటుంది. చర్చకు సహకరించండి. అందరూ మాట్లాడవచ్చు. కావాల్సినంత సమయమిస్తా. అనుకూలంగా, వ్యతిరేకంగా, తటస్థంగా వచ్చే అన్ని అభిప్రాయాలనూ రికార్డు చేసి రాష్ట్రపతికి పంపుతాం. అఫిడవిట్లిచ్చినా స్వీకరిస్తాం. మనం పంపే ప్రతి అంశాన్నీ ఆయన పరిశీలిస్తారు’’ అని సభ్యులకు చక్రపాణి వివరించారు. అనంతరం తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. సభ్యులెవరైనా బిల్లుపై ఓటింగ్ కోరితే అనుమతిస్తారా అని ప్రశ్నించగా, ‘‘రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును తిరస్కరించడం, అంగీకరించడం ఉండవు. వాటన్నింటిపైనా పార్లమెంటుదే తుది నిర్ణయం’’ అని బదులిచ్చారు. -
హై కమాండ్‌ను తిడుతూ.. జై సమైక్యాంధ్ర మంత్రం
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : పార్టీ పుణ్యమాని తాము ప్రజలకు దూరమయ్యామనే విషయం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తెలిసొచ్చింది. రాజకీయ భవిష్యత్ చిత్రం 3డీ స్థాయిలో కళ్లెదుటే వీరిని కలవరపెడుతోంది. పార్టీని నమ్ముకుంటే నిండా మునిగినట్టేననే భయం పార్టీ కింది స్థాయి శ్రేణుల్లోనూ ఆవహించింది. ఈనేపథ్యంలో మండల, గ్రామ, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి? 2009 ఎన్నికల్లో గెలిచిన వారు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారందరి మనసులో ఈ ప్రశ్న అలజడి సృష్టిస్తోంది. ఆలస్యం చేస్తే మరింత నష్టపోతామని గ్రహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాను తిడుతూనే మరో వైపు జై సమైక్యాంధ్ర అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై సీమాంధ్ర ప్రజల్లో తిరుగుబాటు రాదనే అభిప్రాయంతో హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటామని వీరంతా వీర విధేయత ప్రకటించారు. ఒక వేళ జనం ఉద్యమించినా తీవ్ర స్థాయిలో వుండదని అంచనా వేశారు. అంచనాలు తల్లకిందులు అయ్యాయి. అన్ని వర్గాల వారు భాగస్వాములయ్యారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని జనం బాహాటంగానే చెబుతున్నారు. దీంతో చోటా నేతలు, కేడర్ కూడా సమైక్యాంధ్రకు కట్టుబడిన పార్టీవైపు పరుగులు తీసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు. కొందరైతే తమ నాయకులకు ఈ విషయం కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. దీంతో నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు దారులు వెదుక్కునే పనిలో పడ్డారు. ఆశించిన పార్టీలో బెర్తులు ఖరారు కాని వారు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం కేడర్‌కు చెబితే వారు చేజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో తొందరపడి పార్టీ మారొద్దనీ, సమష్టిగా నిర్ణయం తీసుకుందామంటూ బుజ్జగించే పనిలో పడ్డారు. యలమంచిలి శాసనసభ్యుడు రమణమూర్తి రాజు తొందరపడి పార్టీ మారవద్దనీ కలిసే నిర్ణయం తీసుకుందామని కార్యకర్తలను కోరారు. విశాఖ వెస్ట్ ఎమ్మె ల్యే మళ్ల విజయప్రసాద్ బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల అభీష్టం మేరకే నడుకుంటాననీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కేడర్‌కు విన్నవించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మశ్రీ కూడా చోడవరం, మాడుగుల నియోజక వర్గాల కేడర్‌తో సమావేశం జరిపి కాంగ్రెస్‌లో కొనసాగడం కష్టమేననే అభిప్రా యం వ్యక్తం చేసి అంతా ఒక తాటి మీదే నడుద్దామబని కేడ ర్ తనను వీడిపోకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తాను ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటానని ప్రకటించారు. భీమిలి శాసనసభ్యుడు అవంతి శ్రీనివాస్ కూడా కార్యకర్తల అభీష్టం మేరకే రాజకీయ అడుగులు వేస్తానని చెప్పారు. గాజువాక ఎమ్మెల్యే చింతల పూడికి ఒకవైపు సమైక్య సెగ తగలడంతో పాటు, మరో వైపు కేడర్ కూడా పక్క చూపులు చూస్తుండటంతో గురువారం తానే సమైక్యాంధ్ర దీక్షకు దిగారు. మంత్రి గంటాసైతం హై కమాండ్ మీద మెల్లగా విమర్శల బాణాలు వదులుతూ, తాను కూడా పార్టీ మారబోతున్నాననే సంకేతాలు ఇవ్వడం ద్వారా కేడర్‌ను నిలుపుకునే ప్రయత్నంలో పడ్డారు.