విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : పార్టీ పుణ్యమాని తాము ప్రజలకు దూరమయ్యామనే విషయం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తెలిసొచ్చింది. రాజకీయ భవిష్యత్ చిత్రం 3డీ స్థాయిలో కళ్లెదుటే వీరిని కలవరపెడుతోంది. పార్టీని నమ్ముకుంటే నిండా మునిగినట్టేననే భయం పార్టీ కింది స్థాయి శ్రేణుల్లోనూ ఆవహించింది. ఈనేపథ్యంలో మండల, గ్రామ, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి? 2009 ఎన్నికల్లో గెలిచిన వారు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారందరి మనసులో ఈ ప్రశ్న అలజడి సృష్టిస్తోంది.
ఆలస్యం చేస్తే మరింత నష్టపోతామని గ్రహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాను తిడుతూనే మరో వైపు జై సమైక్యాంధ్ర అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై సీమాంధ్ర ప్రజల్లో తిరుగుబాటు రాదనే అభిప్రాయంతో హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటామని వీరంతా వీర విధేయత ప్రకటించారు. ఒక వేళ జనం ఉద్యమించినా తీవ్ర స్థాయిలో వుండదని అంచనా వేశారు. అంచనాలు తల్లకిందులు అయ్యాయి. అన్ని వర్గాల వారు భాగస్వాములయ్యారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని జనం బాహాటంగానే చెబుతున్నారు.
దీంతో చోటా నేతలు, కేడర్ కూడా సమైక్యాంధ్రకు కట్టుబడిన పార్టీవైపు పరుగులు తీసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు. కొందరైతే తమ నాయకులకు ఈ విషయం కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. దీంతో నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు దారులు వెదుక్కునే పనిలో పడ్డారు. ఆశించిన పార్టీలో బెర్తులు ఖరారు కాని వారు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
ఈ విషయం కేడర్‌కు చెబితే వారు చేజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో తొందరపడి పార్టీ మారొద్దనీ, సమష్టిగా నిర్ణయం తీసుకుందామంటూ బుజ్జగించే పనిలో పడ్డారు. యలమంచిలి శాసనసభ్యుడు రమణమూర్తి రాజు తొందరపడి పార్టీ మారవద్దనీ కలిసే నిర్ణయం తీసుకుందామని కార్యకర్తలను కోరారు. విశాఖ వెస్ట్ ఎమ్మె ల్యే మళ్ల విజయప్రసాద్ బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల అభీష్టం మేరకే నడుకుంటాననీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కేడర్‌కు విన్నవించుకున్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మశ్రీ కూడా చోడవరం, మాడుగుల నియోజక వర్గాల కేడర్‌తో సమావేశం జరిపి కాంగ్రెస్‌లో కొనసాగడం కష్టమేననే అభిప్రా యం వ్యక్తం చేసి అంతా ఒక తాటి మీదే నడుద్దామబని కేడ ర్ తనను వీడిపోకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తాను ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటానని ప్రకటించారు.
భీమిలి శాసనసభ్యుడు అవంతి శ్రీనివాస్ కూడా కార్యకర్తల అభీష్టం మేరకే రాజకీయ అడుగులు వేస్తానని చెప్పారు. గాజువాక ఎమ్మెల్యే చింతల పూడికి ఒకవైపు సమైక్య సెగ తగలడంతో పాటు, మరో వైపు కేడర్ కూడా పక్క చూపులు చూస్తుండటంతో గురువారం తానే సమైక్యాంధ్ర దీక్షకు దిగారు. మంత్రి గంటాసైతం హై కమాండ్ మీద మెల్లగా విమర్శల బాణాలు వదులుతూ, తాను కూడా పార్టీ మారబోతున్నాననే సంకేతాలు ఇవ్వడం ద్వారా కేడర్‌ను నిలుపుకునే ప్రయత్నంలో పడ్డారు.
హై కమాండ్‌ను తిడుతూ.. జై సమైక్యాంధ్ర మంత్రం
Published Fri, Oct 11 2013 2:37 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement