మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేయబోయే ‘జై సమైక్యాంధ్ర’ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
సాక్షి, రాజమండ్రి: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేయబోయే ‘జై సమైక్యాంధ్ర’ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 12న పార్టీ జెండా, ఎజెండాలను ప్రకటించే బహిరంగసభకు తొలుత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్ సన్నాహాలు ప్రారంభించారు.
అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో కళాశాల మైదానంలో సభ నిర్వహణకు అనుమతించబోమన్న కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సభ కోసం తరలించిన సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. దీంతో విధి లేక వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. లాలాచెరువు వద్ద ఉన్న ప్రైవేటు స్థలాన్ని ముందుగా పరిశీలించినా ఆ స్థలం సాంకేతికంగా అనుకూలంగా లేదని, చివరకు వి.ఎల్.పురం ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న జెమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు.