అసలంత సీనుందా!
అసలంత సీనుందా!
Published Wed, Feb 26 2014 3:00 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సాక్షి, రాజమండ్రి :ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ విషయంలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక శేషయ్యమెట్ట ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం, తన అనుయాయులైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో ఆయన ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీలో ప్రధాన పాత్ర పోషించాలని ఉభయ గోదావరి జిల్లాల నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ఆద్యంతం గోప్యంగా సాగింది. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్ర విభజన బిల్లు పాసైన తీరు, ఎంపీల సస్పెన్షన్‌కు దారి తీసిన పరిస్థితులను తన నియోజకవర్గ శ్రేణులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఉండవల్లి ఈ సమావేశం నిర్వహించినట్టు నేతలు చెబుతున్నారు.
కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీయే అజెండాగా ఈ సమావేశం సాగింది. కిరణ్ పార్టీలో చేరడంపై అభిప్రాయ సేకరణ చేయగా, కొంతమంది సై అన్నప్పటికీ మరికొందరు ‘ఇది అవసరమా?’ అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా పాసైందని, దీనిని వ్యతిరేకించినందువల్లనే తమను సస్పెండ్ చేశారని, పథకం ప్రకారమే ముందు పార్టీ నుంచి, తర్వాత సభ నుంచి పంపించేశారని ఉండవల్లి చెప్పారు. ఈ విషయాలు ప్రస్తావించడం ద్వారా సానుభూతి పొంది, సాధ్యమైనంతమంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కిరణ్ పార్టీవైపు ఆకర్షితులను చేసేందుకు యత్నించారని సమావేశానికి హాజరైనవారు చెబుతున్నారు.
నాలుగు రోజుల్లో కార్యాచరణ
ఈ సమావేశానికి హాజరైన నేతల అభిప్రాయాలతో పాటు, హాజరు కాని, హాజరు కాలేనివారిని కూడా సమీకరించిన అనంతరం, నాలుగు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు.. సమావేశంలో కీలకంగా వ్యవహరించిన రాజమండ్రి నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నక్కా నగేష్ చెప్పారు. అయితే సమావేశం గురించి ఉండవల్లి మీడియాతో మాట్లాడలేదు. ఇటువంటి సమావేశాలను ఆయన మరో రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, రాజమండ్రి, గోపాలపురం, కొవ్వూరు మార్కెట్ కమిటీల అధ్యక్షులు చెరుకూరి వెంకటరావు, దుర్గారావు, రాఘవులు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు, ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన పలు విభాగాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
Advertisement