కాంతులీనని కిరణం
Published Thu, Mar 13 2014 12:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సాక్షి, రాజమండ్రి: ‘సమైక్య గర్జన’ వినిపిస్తుందనుకుంటే.. ‘పిల్లి కూత’ మాదిరి స్వరమే వినిపించింది. ‘కొత్త కాంతులు’ ప్రసరిస్తాయనుకుంటే.. కనీస భ్రాంతికి కూడా ఆస్కారం లేకపోయింది. ఆకట్టుకోని చొప్పదంటు ప్రసంగం, రక్తి కట్టని కృతకావేశ ప్రదర్శన.. జనం సభ ముగించేయాలని కేకలు పెట్టారు. రాజమండ్రిలోని జెమినీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం ఐదున్నరకు ప్రారంభమైన ‘జై సమైక్యాంధ్ర’ సభ 1.55 గంటల్లో ముగిసిపోయింది. పార్టీ అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం 35 నిముషాలకే ప్రసంగానికి స్వస్తి చెప్పారు. ‘తెలుగు ప్రజల ఆత్మగౌరవం’ పేరుతో ఆయన స్థాపించిన పార్టీ ఆవిర్భావ సభలో రాష్ట్ర విభజనను అడ్డుకునే కీలకమైన కార్యాచరణను ప్రకటిస్తారని కొసరు ఆశలు పెట్టుకున్న సమైక్యవాదులకు తీవ్ర ఆశాభంగం తప్పలేదు. సభలో సమైక్య నినాదం కన్నా కిరణ్ నామ జపమే మారుమోగింది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా ప్రతినిధులు, నేతలు తరలి వస్తారని భావించిన నిర్వాహకులు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
అధికారంలో ఉండి ఊడపొడిచారా..?
అధికారం ఇస్తే రాష్ట్రం ముక్కలు కానివ్వకుండా చేస్తామని కిరణ్ తన ప్రసంగంలో ఆవేశపడ్డారు. మూడున్నరేళ్లుగా అధికారంలో ఉండీ విభజనను అడ్డుకోలేని కిరణ్, రాష్ట్రపతి అపాయింటెడ్ డే కూడా ప్రకటించాక ఇంకెలా విభజనను అడ్డుకుంటారో తెలీక జనం విస్తుపోయారు. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆశలు పెట్టుకున్నామని చెబుతూనే 25 ఎంపీ సీట్లు గెలిపించినంత మాత్రాన విభజన ఎలా ఆపుతారని అయోమయానికి గురయ్యారు. ఇక.. తాను రాజకీయాల్లో ఉండనని వైరాగ్యం పలికిన ఉండవల్లి అరుణ్‌కుమార్ తన అధ్యక్షోపన్యాసంలో సింహభాగం కిరణ్‌ను కీర్తించడానికే కేటాయించారు. ఎంపీ హర్షకుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు కూడా ఆ తానులో ముక్కలమేననిపించారు. వారి భజన వినలేని జనం వెంటనే కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడాలంటూ గోల చేశారు. చేసేది లేక చాలా మంది ప్రసంగాలను రద్దుచేసి కిరణ్‌కు మైకు అందచేశారు.
కాగా ఆయన మాట్లాడిన 35 నిముషాలు పాతపాటనే ఆలపించారు. కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర రాజకీయ పక్షాలపై దుమ్మెత్తి పోశారు. తానొక్కడినే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొనేందుకు తాపత్రయపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణా ప్రాంతం 11 లక్షల ఎకరాలకు సాగునీరు కోల్పోతుందని, 50 శాతం విద్యుత్తు నష్టపోతుందని పేర్కొన్నారు. సభలో ముందుగా మట్టిరంగులో నిలువు పట్టీ, పైన లేత ఆకు పచ్చ, కింద ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పార్టీ పతాకాన్ని కిరణ్ ఆవిష్కరించారు. వెనువెంటనే వేదిక వెనుక ఉన్న భారీ బ్యానర్‌ను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం గాలిలోకి బెలూన్లను వదిలారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళా బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. టంగుటూరి ప్రకాశం పంతులు మనుమడు హనుమంతరావు సభకు వచ్చి కిరణ్‌ను కలిశారు.
నెపాలు వెతికిన నేతలు
సభకు జనం పల్చగా రావడం.. నిర్వాహక నేతలు, కాంగ్రెస్ బహిషృ్కత ఎంపీలు ఉండవల్లి, హర్షకుమార్‌ను కలవర పరిచింది. ‘రోడ్డుపై జనం ఉండి పోయారు. లోపలికి రావా’లంటూ కొంతసేపు, ‘సభలోని జనం వారిని లోపలికి రానివ్వా’లంటూ కాసేపు, ‘జనం వచ్చే బస్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయని, వాటిని ఆపేశా’ రని కాసేపు మైకుల్లో బిగ్గరగా చెపుతూ.. సభ పేలవంగా ఉందన్న వాస్తవాన్ని కప్పి పుచ్చబోయారు. జనం అంతంతమాత్రంగానే వచ్చారన్న విషయం నుంచి కిరణ్‌కుమార్ దృష్టిని మరల్చేందుకు విఫల యత్నం చేశారు. సభాస్థలికి చేరువలోనే జరుగుతున్న బైబిలు మిషను మహాసభలకు తరలి వచ్చే జనాన్ని తమ సభకు వచ్చిన జనంగా చిత్రించడానికి చూశారు.
సభలో ఎంపీలు సబ్బం హరి, లగడపాటి రాజ గోపాల్, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరి, పార్టీ అధికారప్రతినిధి తులసిరెడ్డి, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, ఎమ్మెల్సీలు బలశాలిఇందిర, రెడ్డప్పరెడ్డి, ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, కొర్లభారతి, రాష్ట్ర మాలమహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, సినీనటుడు నరసింహరాజు, మాజీఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, విద్యార్థి నాయకుడు కృష్ణాయాదవ్, పార్టీ నాయకులు ఆనం జయకుమార్‌రెడ్డి, వాసంశెట్టిసత్య, చిక్కాల ఉమామహేశ్వరరావు, డీసీఎంస్ చైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ మట్టా జయకర్, వరద రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లుబాబి, మందపాటిక ిరణ్, జి.వి.శ్రీరాజ్, రాజమండ్రి చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్, కొర్లశిరీష తదితరులు పాల్గొన్నారు.
Advertisement