
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసు విచారణ సందర్భంగా.. ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను మీడియా ముందుకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలని మార్గదర్శి భావించింది. అయితే.. అందుకు హైకోర్టు బ్రేకులు వేసింది.
మార్గదర్శి కేసులో వాదనలు వినిపిస్తున్న ఉండవల్లి.. తరచూ మీడియా ముందుకు వచ్చి మార్గదర్శి అవినీతి తుట్టెను కదిలిస్తున్నారు. దీంతో ఆయనను మీడియా ముందుకు రానివ్వకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసింది మార్గదర్శి. అయితే.. విచారణ చేపట్టకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం మార్గదర్శి లాయర్ సిద్ధార్థ లూథ్రాకు స్పష్టం చేసింది. ఈ తరుణంలో.. లూథ్రా తీరుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘‘సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ కేసులో హైకోర్టుకు సహకారం అందిస్తున్నా. నేను ఏ ఒక్కరి తరఫు లాయర్ కాదన్నది గుర్తుంచుకోవాలి. మీడియాతో నేను మాట్లాడి మూడు నెలలు దాటింది. మార్గదర్శి లాయర్ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.
అనంతరం.. ఉండవల్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణ జరపకుండా ఉండవల్లికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని మార్గదర్శి లాయర్‌కు తేల్చి చెప్పింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది.