హైదరాబాద్, సాక్షి: సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్గదర్శి కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకోవాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దినపత్రికల్లో నోటీసులు ఇచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
మార్గదర్శి కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్ సుజోయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం వాదనలు వింది. ఉండవల్లి అరుణ్‌కుమార్, మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రా అన్‌లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆర్‌బీఐ దాఖలు చేసిన కౌంటర్‌పై స్పందన తెలిపేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు మార్గదర్శి లాయర్ లూద్రా. అయితే..
ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) ప్రకారం మార్గదర్శి చందాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆర్‌బీఐ కౌంటర్‌లో తేల్చిందన్న విషయాన్ని ఉండవల్లి బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని, బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చెప్పిందని గుర్తు చేశారు. అలాగే.. మొత్తం 70,000 చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే..
ఆ వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లికి హైకోర్టు సూచించింది. ఎగవేత దారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు.. రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ, తెలంగాణ సర్కారుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment