జై తెలంగాణ అంటేనే కొడుతుండ్రు.. అట్లయితేసీఎంను ఎన్నిసార్లు కొట్టాలె?
కిరణ్ జై సమైక్యాంధ్ర అంటున్నాడుగా..
సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలి
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలి
‘చలో నకిరేకల్’ సభలో కోదండరాం
నల్లగొండ/నకిరేకల్, న్యూస్‌లైన్: ‘జై తెలంగాణ అన్నందుకే తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దూదిమెట్ల బాలరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్‌లను సీమాంధ్ర ఉద్యోగులు కొడుతుండ్రు.. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ జై సమైక్యాంధ్ర.. అంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని మనం ఎన్నిసార్లు కొట్టాలె?’ అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. ఏపీఎన్జీఓల సభ సందర్భంగా దూదిమెట్ల బాలరాజుపై సీమాంధ్ర గూండాలు, ఉద్యోగులు దాడి చేయడాన్ని ఖండిస్తూ టీవీఎన్‌ఎస్, టీఎస్‌జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో శుక్రవారం ‘చలో నకిరేకల్’ నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం ప్రసంగిస్తూ.. తెలంగాణ పేరెత్తితేనే దాడులకు దిగుతున్న సీమాంధ్రులు.. సమైక్యంగా ఉండాలని కోరుకోవడం సిగ్గుచేటన్నారు.
బాలరాజుపై దాడి యావత్ తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మాభిమానంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ‘ తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రులు చేస్తున్న కుట్రలు.. కుతంత్రాలను భగ్నం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపైనే ఉంది’ అన్నారు. కాగా, అంతకుముందు కోదండరాం నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎలాంటి హక్కు లేదని, యూటీ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలంతా మళ్లీ ఉవ్వెత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. బలవంతంగా కలిసి ఉండాలని ఉద్యమించడం నాగరికతకు విరుద్ధమన్నారు. ఈనెల 29న సకల జనభేరి సభను జయప్రదం చేయాలన్నారు.
‘భేరి’కి అనుమతి వస్తుందన్న ధీమా ఉంది
‘సకల జనభేరి’ సభకు పోలీసుల నుంచి అనుమతి వస్తుందన్న విశ్వాసం ఉందని టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లగొండలో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం పెన్షనర్స్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సకల జనభేరి నిర్వహణకు అనుమతి ఇస్తామని పోలీసులు గతంలోనూ చెప్పారు. తప్పనిసరిగా దీన్ని విశ్వసిస్తున్నాం. ఎటువంటి అవరోధాలు సృష్టించబోరని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యం ప్రజల మధ్య విద్వేషాలు ఉద్భవించి గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. ఇవన్నీ అంతం కావాలంటే శాంతియుత విభజన జరగాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ జిల్లాను ఆదర్శంగా తీసుకుని ఈనెల 22నుంచి అన్ని జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో లక్ష ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు తక్షణమే లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని కోదండరాం తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిరుద్యోగ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘భవిష్యత్ తెలంగాణలో విద్యార్థి, నిరుద్యోగుల పరిస్థితి’ అనే అంశంపై సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని కొందరు అసమర్ధ నేతల వల్లే మనకు దక్కాల్సిన ఉద్యోగాల్ని సీమాంధ్రులు కొల్లగొట్టారని అన్నారు.