కాసుల పేరు | Business organizations to reach the target audience through internet | Sakshi
Sakshi News home page

కాసుల పేరు

Published Thu, Sep 11 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

కాసుల పేరు

కాసుల పేరు

టెక్నాలజీతో పరుగులు పెడుతున్న జనాన్ని అందుకోవడానికి బడాచోటా వ్యాపార సంస్థలు కూడా ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దూసుకుపోతూ బిజినెస్ పెంచుకుంటున్నాయి. చెప్పుల నుంచి కేశతైలం వరకు అన్ని వస్తువులు సింగిల్ క్లిక్‌తో కస్టమర్లకు చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా పోర్టల్స్ క్రియేట్ చేసుకుని మరీ ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్నాయి. వెబ్‌లోకంలో వ్యాపారం చేయాలంటే పోర్టల్‌కు క్యాచీ నేమ్ ఉండాలి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ముందుగానే డొమైన్ నేమ్స్‌ను బ్లాక్ చేసి అట్టే పెట్టుకుంటున్నారు. పలు వ్యాపార సంస్థలు, సెలబ్రిటీలు, ట్రెండీ పేర్లతో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. సదరు డొమైన్‌నేమ్స్ అవసరం అయిన వారికి లక్షలు చెల్లిస్తే గానీ రైట్స్ ఇవ్వడం లేదు. సిటీలో ఈ తరహా నవతరం బిజినెస్ ఇపుడు ఊపందుకుంది.
 
 హైదరాబాద్ పేరుతో ఓ వెబ్ పోర్టల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా..? దానికి  డొమైన్‌నేమ్ ‘హైదరాబాద్.కామ్’అని పెట్టాలని మీరు ఫిక్సయితే మాత్రం కష్టమేనండోయ్. ఇదే డొమైన్ నేమ్‌తో మీరు వెబ్‌పేజ్ క్రియేట్ చేయాలంటే మాత్రం అక్షరాలా ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి డొమైన్‌నేమ్ రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు రూ.500 మించి ఉండదంటారా..! ఆ పేరుకున్న క్రేజ్ అలాంటిది మరి. ఎప్పుడో పదేళ్ల కిందట రిజిస్టర్ అయిన ఈ డొమైన్‌నేమ్ మీకు రూ.500కు దొరుకుతుందనుకుంటే పొరపాటే మరి. ఇదొక్కటే కాదు డొమైన్‌నేమ్స్ పేరిట కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. ఇటీవల నగరంలో ‘డొమైన్‌నేమ్ ఓనర్స్ అసోసియేషన్’ రెండు సార్లు సమావేశమైంది కూడా.
 
 ముందుచూపు ఉన్న వాడే మనిషోయ్! అని ఎవరన్నారో కానీ, ఫ్యూచర్ సెన్స్‌తో కోట్లు ఆర్జిస్తున్న వారు ఎందరో ఉన్నారు. సినిమా పేర్లు, రాజకీయ పార్టీల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే.. కొందరు కాస్త వెరైటీ పేర్లను డొమైన్‌నేమ్స్‌గా రిజిస్టర్ చేసుకుని పెట్టుకుంటున్నారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న పేరు ఎవరికైనా అవసరం వచ్చిందనుకోండి.. వారి పంట పండినట్టే. వెబ్‌సైట్ నిర్మాణం మొదలైనప్పుడే ఈ డొమైన్‌నేమ్స్ వ్యాపారం పురుడు పోసుకుంది. మన దేశంలో ఓ పదేళ్ల నుంచి డొమైన్‌నేమ్ బిజినెస్ ఊపందుకుంది. నగరాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో కొందరు బోలెడన్ని డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసేశారు. ‘చిరంజీవి.కామ్’ ఇలా రిజిస్టర్ అయ్యిందే. ఆ పేరుని చిరంజీవికి ఇవ్వడానికి సదరు డొమైన్‌నేమ్ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్టు చెబుతారు. సిటీలో డొమైన్‌నేమ్ బిజినెస్ చేసే వాళ్లు నగరాలు, ప్రముఖుల పేర్లే కాదు పత్రికల పేర్లు, పాపులర్ పదాలనూ వదలడం లేదు.
 
 ఇంతైతే ఓకే..
 డొమైన్‌నేమ్స్ క్యాష్ చేసుకుంటున్న వ్యక్తులు సిటీలో ఓ వంద మందికిపైగానే ఉన్నారు. వీరొక్కక్కరూ వందల్లో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. విదేశాలకు వెళ్లిన టెకీలు బుర్రకు పదనుపెట్టి మరీ డొమైన్‌నేమ్స్ బుక్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఉన్న వ్యాపారాలు, వ్యవహారాలను అప్‌డేట్ చేసుకుంటూ డొమైన్‌నేమ్స్ తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ పేర్లు కావాల్సిన వారికి చుక్కలు చూపెడుతున్నారు. ఎదుటివారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాఠశాలలకు సంబంధించి ఓ వెబ్‌సైట్ పెట్టి బిజినెస్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ‘స్కూల్‌ల్యాబ్. కామ్’ అనే వెబ్‌సైట్‌ని రిజిస్టర్ చేసుకుందామని  ప్రయత్నించగా.. అది రెండేళ్ల కిందటే బుక్ అయిపోయినట్టు తెలుసుకున్నాడు. ఆరా తీస్తే అమెరికాలోని ఓ తెలుగాయన ఆ పేరు రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుసుకున్నాడు.  ఏం చేస్తాడు.. ఆ అమెరికా బుల్లోడికి రూ.35 వేలు సమర్పించుకుని ఆ డొమైన్‌నేమ్ సొంతం చేసుకున్నాడు.
 
 జై తెలంగాణ..
 తెలంగాణ వచ్చాక ఆ పేరుకు ఎంత డిమాండ్ ఉంటుందో ముందో ఊహించిన కొందరు నాలుగైదేళ్ల కిందటే రకరకాల పేర్లతో డొమైన్‌నేమ్స్ రిజిస్టర్ చేసుకుని పెట్టుకున్నారు. తెలంగాణస్టేట్.కామ్, తెలంగాణఫుడీస్.కామ్, తెలంగాణ.జువెలరీస్.కామ్.. ఇలా ఓ పాతిక, యాభై పేర్లను బుక్ చేసేశారు. ఏ బడాబాబుకైనా వాటి అవసరం పడితే ఆ డొమైన్‌నేమ్ ఓనర్ పంట పండినట్టే.
 
 నేమ్ అండ్ డొమైన్‌నేమ్..
 ఈ ట్రెండ్ గురించి డొమైన్‌నేమ్ అండ్ వెబ్‌సైట్ బిజినెస్ చేస్తున్న బ్రియోఫ్యాక్టర్స్ ఎండీ రాజశేఖర్ ఏమంటారంటే.. ‘గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు మన నగరంలో డొమైన్‌నేమ్‌ల యజమానుల సంఖ్య బాగా వేగంగా పెరుగుతోంది. ఎంతలా అంటే.. బిడ్డకు పేరు పెట్టిన వెంటనే ఆ పేరుతో డొమైన్‌నేమ్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు కొందరు. అదేంటంటే.. ఏమో ఏం చెప్పగలం వీడు పెద్దయ్యాక సెలెబ్రిటీ అయితే వాడి పేరుతో వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలంటే ఎలా? అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. నిజానికి ఇది మంచి పరిణామమే. మన సెలిబ్రెటీలలో చాలామందికి వారి పేరుతో వారివద్ద డొమైన్‌నేమ్స్ లేవు. అలాగే ప్రస్తుతం ప్రతి వ్యాపారానికి వెబ్‌సైట్ కంపల్సరీ. అందుకే కొందరు ముందుగానే ఊహించి కొన్ని రకాల డొమైన్‌నేమ్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు’ అని చెప్పారు. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా డొమైన్‌నేమ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు తోచిన నాలుగు క్రియేటివ్ పదాలతో డొమైన్‌నేమ్‌లు రిజిస్టర్ చేసుకుని పెట్టుకోండి. డొమైన్‌నేమ్స్ రూపంలో మీ అదృష్టం మీ తలుపు తట్టొచ్చు.. ధనలక్ష్మి మీ నట్టింట్లో తిష్టవేయొచ్చు.
 - భువనేశ్వరి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement