వ్యాపారాభివృద్ధికి... మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ | Management Consultant to helpful for development Business | Sakshi
Sakshi News home page

వ్యాపారాభివృద్ధికి... మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్

Published Thu, Oct 9 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

వ్యాపారాభివృద్ధికి... మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్

వ్యాపారాభివృద్ధికి... మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్

అట్టహాసంగా ప్రారంభించిన వ్యాపార సంస్థ ఆశించినంతగా విజయవంతం కావడం లేదు. కంపెనీ ఉత్పత్తులపై వినియోగదారులు ఆసక్తి చూపట్లేదు. సంస్థ ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అభివృద్ధి ఆగిపోయింది. నష్టాలే మిగులుతున్నాయి. లోపాలు ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోతున్నారు, వాటిని ఎలా సరిదిద్దాలో తెలియడం లేదు. ఈ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం.. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ను ఆశ్రయించడం. కంపెనీని గాడిన పెట్టి, లాభాల బాట పట్టించడం ఎలాగో కన్సల్టెంట్ విడమరిచి చెబుతాడు. వ్యూహాలు రూపొందిస్తాడు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆపద్బాంధవుడిలా ఆదుకుంటాడు. వ్యాపారంపై ఆసక్తి ఉన్న యువతకు సరిగ్గా నప్పే నయా కెరీర్... మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటుండడంతో కన్సల్టెంట్లకు చేతినిండా పని దొరుకుతోంది. అదేస్థాయిలో ఆదాయం ఖాతాలోకి చేరుతోంది.  
 
 కంపెనీ లాభాల్లో కన్సల్టెంట్‌కు వాటా
 కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాభివృద్ధి కోసం మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లను నియమించుకుంటున్నాయి. నిపుణులకు రూ.లక్షల వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇక కన్సల్టింగ్ సంస్థల్లో లెక్కలేనన్ని ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించబోయే ఎంటర్‌ప్రెన్యూర్స్ సైతం మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లను సంప్రదిస్తున్నారు. వ్యాపారంలో మెళకువలు తెలుసుకుంటున్నారు. సొంత బిజినెస్ ప్రారంభించి పది మందికి ఉపాధి చూపాలనే ఆశయం ఉన్నవారు మొదట మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేసి అనుభవం సంపాదించిన తర్వాత రంగంలోకి దిగితే విజయం సాధించడం ఖాయమని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. కన్సల్టెంట్లకు క్లయింట్లను బట్టి ఆదాయం ఉంటుంది. తమ సూచనలతో బిజినెస్ పెరిగితే వచ్చిన లాభాల్లో కొంత శాతాన్ని కమీషన్‌గా తీసుకుంటారు. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఆదాయం భారీగానే ఉంటుంది. ఈ వృత్తిలోకి ప్రవేశించడానికి ఎంబీఏ డిగ్రీ ఒక పాస్‌పోర్ట్ లాంటిది. అయితే, ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు కూడా ఇందులో రాణిస్తున్నారు.
 
 నైపుణ్యాలు
 మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లకు కంపెనీ డేటాను విశ్లేషించడానికి అనలిటికల్ నైపుణ్యాలు, క్లయింట్లను ఒప్పించడానికి మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవడానికి లెర్నింగ్ స్కిల్స్ అవసరం. కన్సల్టెంట్ సరైన సలహాలు ఇవ్వకుంటే కంపెనీ తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి నూటికి నూరు శాతం అంకితభావంతో పనిచేయాలి. ఇందులో పని ఒత్తిళ్లు, సవాళ్లు అధికంగా ఉంటాయి. వాటిని తట్టుకొనే నేర్పు చాలా ముఖ్యం.
 
 అర్హతలు
 కన్సల్టింగ్ జాబ్‌ను సొంతం చేసుకోవాలంటే ప్రముఖ విద్యాసంస్థ నుంచి మేనేజ్‌మెంట్ డిగ్రీని అందుకోవాలి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, ఎంబీఏలో చేరొచ్చు. ఈ కోర్సు చదివితే మేనేజ్‌మెంట్ అసోసియేట్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు.
 
 వేతనాలు
 అనుభవం, ప్రతిభ కలిగిన మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల ఆదాయాలకు ఆకాశమే హద్దు అని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వేతన ప్యాకేజీ అందుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత ఈ ప్యాకేజీ రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెరుగుతుంది. అనుభవం ఆధారంగా జీతభత్యాల్లో పెరుగుదల ఉంటుంది. పదేళ్ల అనుభవంతో లీడర్‌షిప్ హోదాకు చేరుకోవచ్చు.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
 1.    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)-అహ్మదాబాద్
     వెబ్‌సైట్: www.iimahd.ernet.in
 2.    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)-బెంగళూరు
     వెబ్‌సైట్: www.iimb.ernet.in
 3.    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)-కలకత్తా
     వెబ్‌సైట్: www.iimcal.ac.in
 4.    ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ఢిల్లీ
     వెబ్‌సైట్: http://fms.edu/
 5.    ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్
     వెబ్‌సైట్: http://imi.edu/
 6.    మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్    వెబ్‌సైట్: జ్ట్టిఞ://ఝఛీజీ.్చఛి.జీ/
 7.    ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-ఘజియాబాద్
     వెబ్‌సైట్: http://imt.edu/
 
 వ్యాపార వ్యూహాల్లో కీలకం
 
 మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్స్‌కు కెరీర్‌పరంగా ఉత్తమ మార్గం..కన్సల్టెంట్‌గా స్థిరపడడం. వ్యాపార, వాణిజ్య వ్యూహాల్లో వీరిది కీలకపాత్ర.  అకడమిక్, జాబ్ కన్సల్టెన్సీలకు ధీటుగా ప్రస్తుతం మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రతిభ, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే ఈ రంగంలో విజయవంతం కావచ్చు. వ్యాపార విస్తరణకు అనుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషించగలగడం, మార్కెట్ పరిస్థితులను అంచనా వేయగ లిగే సామర్థ్యం ఉండాలి. గ్లోబలైజేషన్‌తో వ్యాపార లావాదేవీల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, ఎనలిటికల్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే కెరీర్‌లో విజేతగా నిలవొచ్చు.
 
 - ప్రొఫెసర్ కల్యాణ్ సి.చేజర్ల, ప్లేస్‌మెంట్స్,
 ఫ్యాక ల్టీ ఇన్ ఆపరేషన్స్ ఏరియా, ఇన్‌స్టిట్యూట్
 ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ- హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement