తెలంఘన సంబురం
- అర్ధరాత్రి ఆవిష్కృతమైన రాష్ట్రం
- ఉద్విగ్నభరితంగా ఆవిర్భావ వేడుకలు
- సబ్బండవర్ణాల జనజాతరల హోరు
వరంగల్, న్యూస్‌లైన్ : కళ్లెదుట ఆవిష్కృతమైన తెలంగాణ.. గుండెల్లో అమరుల జ్ఞాపకాలు.. ఆకాశమే హద్దుగా సాగిన జై తెలంగాణ నినాదాలహోరు మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆదివారం అర్ధరాత్రి పురుడుపోసుకున్నది. 60 యేళ్ల తం డ్లాట, 120మంది అమరవీరుల త్యాగాలఫలం సాక్షిగా ఓరుగల్లు జనం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో ఓలలాడారు.
జనజాతరలు
పల్లే పట్నం తేడాలేకుండా జిల్లా అంతటా జనజాతరలై సాగాయి. ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా ఏర్పాటు చేసిన కీర్తి స్థూపం ఉద్యమ చరిత్రలో నిలిచిపోయింది. కలెక్టర్ కిషన్ ఆధ్వర్యంలో కీర్తి స్థూపం ఆవిష్కరించారు. కళాకారుల ధూంధాం, కార్నివాల్ తో జాతరను తలపించింది. ఉద్యోగ, రాజకీయ ప్రతినిధులతోపాటు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పట్నంలో కలిసికట్టుగా..
ఎన్నికల జాతర ముగిసిన తర్వాత అన్ని వర్గాలు మరోసారి సమూహమై సాగారు. ఆర్తి, ఆవేదన, ఆకాంక్షను చాటిచెప్పేందుకు కడలి తరంగాల్లా కదిలివచ్చారు. ముందుగానే సన్నద్ధమై న విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువజను లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కార్మికులు, జర్నలిస్టులు సబ్బండవర్ణాల సకలజనులు పోరు వారసులై సాగివచ్చారు. జిల్లా కేంద్రమైన హన్మకొండలో చౌరస్తా, అశోకసెంటర్, అంబేద్కర్ సెంటర్, కాళోజీ సెంటర్, అమరవీరుల సెంటర్, కలెక్టరేట్ పరిసరాలు, నిట్ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది.
కాకతీయ యూని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పోరుజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వరంగల్ ఎంజీ ఎం సెంటర్, పోచమ్మమైదాన్, చౌరస్తా, ఖిలావరంగల్, రంగశాయిపేట సెంటర్‌లలో ప్రజ లు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. కోట జనసంద్రాన్ని తలపించింది. ఎంజీఎం సెంటర్ నుంచి కోట వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహిం చారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో వేడుకలు జరుపుకున్నారు.
కార్యక్రమా ల్లో టీజేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు కొవ్వత్తులతో ర్యాలీలు నిర్వహించి అమరుల కు నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ, టీడీపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పార్టీలన్నీ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యాయి. కొత్త రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పనిలో పనిగా నూతన ఎమ్మెల్యేలు, ఎంపీల స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
పల్లెల్లో జట్లుగా..
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, ములు గు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, తొర్రూరు, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ఆత్మకూరు తదితర సెంటర్‌లతోపాటు పల్లెపల్లెనా, ఇంటింటా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కనులపండువగా జరిగా యి. అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అమరవీరుల కుటుం బాలను గుండెలకు హత్తుకున్నారు.
పరకాల అమరధామం వద్ద నివాళులు అర్పించారు. దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కులం, మతం అనే తేడా లేకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కళాకారుల ధూంధాంలతో జిల్లాలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కన్పించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.