సాక్షి, ముంబై: ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున విద్యార్థులకు బీమా సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గత సంవత్సరమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఆ వివరాల్లోకెళ్తే... సహజంగా లేదా ఏదైనా ప్రమాదం కారణంగా మరణిస్తే రూ.50,000 పరిహారాన్ని, గాయపడితే రూ. 30,000 పరిహారాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు లేదా సంరక్షకుడికి అందజేస్తుంది. మరణించిన సందర్భంలో పూర్తి పరిహారాన్ని, గాయపడిన సందర్భంలో గాయాల తీవ్రత ఆధారంగా పరిహారాన్ని అందజేస్తుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆత్మహత్య, హత్య వంటి కారణాలతో విద్యార్థి మరణిస్తే ఎటువంటి పరిహారానికి అర్హులు కారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తే 75 లక్షల మంది విద్యార్థులకు బీమా సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించాలి.
దరఖాస్తు చేసుకున్నవారికే...
పశ్చిమ కల్యాణ్‌లోని డాన్‌బాస్కో పాఠశాలలో విద్యనభ్యస్తున్న ఆరేళ్ల బాలుడు కృష్ణయాదవ్‌పై ఇటీవల తరగతి గదిలోని సీలింగ్ ఫ్యాన్ మీద పడింది. దీంతో అతని తలకు తీవ్ర గామైంది. ఆ సమయంలో తరగతి గదిలో 45 మంది విద్యార్థులున్నారని, మిగతావారికి ఎటువంటి గాయాలు కాలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. బీమా పథకం ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్నా బాలుడి తల్లిదండ్రులు ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో బాధిత విద్యార్థి ఎటువంటి పరిహారం పొందలేకపోయాడు.
నిజానికి ఇటువంటి పథకం ఒకటుందనే విషయం విద్యార్థుల తల్లిదండ్రులకే కాదు ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కూడా తెలిదనే విషయం ఈ ఘటనతో బయటపడింది. ఒకవేళ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఈ పథకం గురించి తెలిస్తే బీమా కోసం విద్యార్థి తల్లిదండ్రులతో దరఖాస్తు చేయించేవాడని, బాలుడికి పరిహారం అందేదని, పథకంపట్ల అవగాహన లేకే పరిహారాన్ని పొందలేకపోయాడని విద్యాశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరిహారం పొందే అవకాశముంటుందని చెప్పారు.
ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై అసంతృప్తి
రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేళ్లలో 793 మంది విద్యార్థులు మృత్యువాత పడడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఏటా దాదాపు 80 మంది మరణించడమంటే నిర్వహణ సరిగా లేదనే విషయం తేటతెల్లమవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాసిక్‌కు చెందిన సామాజిక కార్యకర్త రవీంద్ర తాల్పే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన పీవీ హరిప్రసాద్, పీఎన్ దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్రప్రభుత్వాన్ని మందలించింది. రాష్ట్రంలో 1,100 ఆశ్రమ పాఠశాలలుండగా 4,50,000 మంది విద్యార్థులు అందులో విద్యనభ్యసిస్తున్నారని, దశాబ్దకాలంలో 793 మంది విద్యార్థులు పాముకాటు, తేలుకాటు,
జ్వరం, చిన్నపాటి అనారోగ్యాల కారణంగానే మరణించారని తాల్పే తన పిటిషన్‌లో ఆరోపించారు. మరణించిన విద్యార్థుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిహారం కూడా చెల్లించలేదని ఆరోపించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తర ఫున అరుణ పాయి సమాధానమిస్తూ...
మరణించిన 793 మందిలో 453 విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేశామని, 340 మంది విద్యార్థుల కుటుంబాలకు ఇంకా అందజేయాల్సి ఉందని చెప్పారు. అయితే తగినన్ని నిధులు లేకే పరిహారం అందజేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఇక పాఠశాలల్లో సంభవిస్తున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రథమ చికిత్స డబ్బాను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ధర్మాసనానికి చెప్పారు. ఈ వివరణపై కోర్టు స్పందిస్తూ...
ఎంతో శ్రమకోర్చి గిరిజన బాలలు ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని, పాముకాటు, తేలు కాటుకు ప్రథ మ చికిత్స ఏమేరకు విద్యార్థులను కాపాడుతుందని ప్రశ్నించారు. దీనికి అరుణ సమాధానమిస్తూ... అత్యవసర సమయాల్లో విద్యార్థులను మెరుగైన వసతి కోసం ఇతర ప్రాంతాలకుతరలించేందుకు 35 జీపులను కొనుగోలు చేసిం దని, 185 మంది సిబ్బందిని కూడా నిజమించిందన్నారు. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది ఉదయ్ మాట్లాడుతూ కనీసం ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఓ వైద్యాధికారిని నియమించాలన్నారు. దీనికి కోర్టు స్పందిస్తూ... పిటిషనర్ చెప్పినదానిలో వాస్తవముందని, ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఓ వైద్యాధికారిని నియమించాల్సిన అవసరముందన్నారు. కేసు తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ధర్మాసనం పిటిషనర్ లేవనెత్తిన సమస్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
విద్యార్థులకు బీమా
Published Thu, Sep 5 2013 3:07 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement