secondary
-
కరోనా: సెకండరీ కాంటాక్ట్‌లపై ప్రత్యేక దృష్టి
కంటికి కనిపించని శత్రువు చాపకింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 52కి చేరింది. ఇందులో విజయవాడ నగరంతోపాటు, జగ్గయ్యపేట, పెనమలూరు మండలాలకు చెందిన వారున్నారు. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మరింత పకడ్బందీ చర్యలను తీసుకుంటోంది. బాధిత కుటుంబాలతోపాటు వారు కలిసిన వారెవరనే విషయమై మరోసారి ఆరా తీస్తోంది. విజయవాడలో ప్రతి డివిజన్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఆస్పత్రికి తరలిస్తోంది. ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, విజయవాడ: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగరంలోని ఖుద్దూస్‌నగర్‌లో ఒకరికి, గుప్తాసెంటర్(విద్యాధరపురం)లో మరొకరికి, జగ్గయ్యపేట పట్టణంలో ఒకరికి, పెనమలూరు మండలం సనత్‌నగర్‌లో ఇంకొకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. నాలుగు రోజుల్లో 16 మంది.. క్వారంటైన్ కేంద్రాలకు వస్తున్న పాజిటివ్ సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగురోజుల్లో ఏకంగా 16 మంది విజయవాడ జీజీహెచ్, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఉన్న క్వారంటైన్ కేంద్రాలకు వచ్చారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా బాధితులకు, అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని, కొత్త కేసులు రాకుండా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. వైరస్ గొలుసును తెగ్గొట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రతి డివిజన్లో వైద్య శిబిరాలు.. విజయవాడలో 64 డివిజన్లు ఉండగా, ప్రతి డివిజన్లో నిత్యం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆ శిబిరాల్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారికి పరీక్షలు చేసి, కరోనా లక్షణాలు ఉంటే ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. ఇలా నిత్యం ప్రతి వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు అనుమానితులను పరీక్షల కోసం పంపుతుండగా, అలా వెళ్లిన వారిలో కొందరికి పాజిటివ్ వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇలా వారం రోజులుగా డివిజన్లలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తిస్తున్నారు. మరోవైపు రెడ్‌జోన్ ప్రాంతాల్లో స్వాబ్ కలెక్షన్ శిబిరాలు నిర్వహిస్తూ, అక్కడే నేరుగా అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వెతుకులాట.. నగరంలో రెండు వేల బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. కాంటాక్టులను గుర్తించడం, వారిని రెవెన్యూ, పోలీసు సహకారంతో క్వారంటైన్‌కు , ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ సర్వేలో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలా మొత్తం నగరంలో రెండు వేల మంది వలంటీర్లు సర్వే చేస్తున్నారు. వారితో పాటు, ఆశా వర్కర్, ఏఎన్ఎంలు కూడా భాగస్వాములు అవుతున్నారు. నగరంలో ఎక్కువుగా కరోనా కేసులు నమోదవడంతో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సీఎంఓహెచ్ డాక్టర్ డి. షాలినీదేవిలు నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా కట్టడి చర్యలకు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు. మాస్కులతో జాగ్రత్త! పటమట(విజయవాడ తూర్పు): కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రజలు వినియోగిస్తున్న మాస్‌్కలను సురక్షితంగా డిస్పోజ్ చేయాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాస్కులను రోడ్లపై లేదా నివాసాలలోని చెత్త బుట్టలలో పడేయటం వల్ల వాటిని పెంపుడు/ వీధులలో సంచరించు పశువులు తాకితే వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర పరిస్థితిగా మారుతుందన్నారు. నగవాసులందరూ వినియోగించిన మాస్్క, గ్లౌజ్‌లను ముక్కలు ముక్కలుగా చేసి తడి పొడి చెత్తతో కాకుండా విడిగా ఒక పేపర్ కవర్, ప్యాకెట్లో/కాగితంలో చుట్టి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని అన్నారు. ప్రజారోగ్య పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక సంచుల ద్వారా సేకరించిన మాస్‌్కలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
విద్యార్థులకు బీమా
సాక్షి, ముంబై: ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున విద్యార్థులకు బీమా సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గత సంవత్సరమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఆ వివరాల్లోకెళ్తే... సహజంగా లేదా ఏదైనా ప్రమాదం కారణంగా మరణిస్తే రూ.50,000 పరిహారాన్ని, గాయపడితే రూ. 30,000 పరిహారాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు లేదా సంరక్షకుడికి అందజేస్తుంది. మరణించిన సందర్భంలో పూర్తి పరిహారాన్ని, గాయపడిన సందర్భంలో గాయాల తీవ్రత ఆధారంగా పరిహారాన్ని అందజేస్తుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆత్మహత్య, హత్య వంటి కారణాలతో విద్యార్థి మరణిస్తే ఎటువంటి పరిహారానికి అర్హులు కారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తే 75 లక్షల మంది విద్యార్థులకు బీమా సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించాలి. దరఖాస్తు చేసుకున్నవారికే... పశ్చిమ కల్యాణ్‌లోని డాన్‌బాస్కో పాఠశాలలో విద్యనభ్యస్తున్న ఆరేళ్ల బాలుడు కృష్ణయాదవ్‌పై ఇటీవల తరగతి గదిలోని సీలింగ్ ఫ్యాన్ మీద పడింది. దీంతో అతని తలకు తీవ్ర గామైంది. ఆ సమయంలో తరగతి గదిలో 45 మంది విద్యార్థులున్నారని, మిగతావారికి ఎటువంటి గాయాలు కాలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. బీమా పథకం ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్నా బాలుడి తల్లిదండ్రులు ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో బాధిత విద్యార్థి ఎటువంటి పరిహారం పొందలేకపోయాడు. నిజానికి ఇటువంటి పథకం ఒకటుందనే విషయం విద్యార్థుల తల్లిదండ్రులకే కాదు ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కూడా తెలిదనే విషయం ఈ ఘటనతో బయటపడింది. ఒకవేళ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఈ పథకం గురించి తెలిస్తే బీమా కోసం విద్యార్థి తల్లిదండ్రులతో దరఖాస్తు చేయించేవాడని, బాలుడికి పరిహారం అందేదని, పథకంపట్ల అవగాహన లేకే పరిహారాన్ని పొందలేకపోయాడని విద్యాశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరిహారం పొందే అవకాశముంటుందని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై అసంతృప్తి రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేళ్లలో 793 మంది విద్యార్థులు మృత్యువాత పడడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఏటా దాదాపు 80 మంది మరణించడమంటే నిర్వహణ సరిగా లేదనే విషయం తేటతెల్లమవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాసిక్‌కు చెందిన సామాజిక కార్యకర్త రవీంద్ర తాల్పే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన పీవీ హరిప్రసాద్, పీఎన్ దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్రప్రభుత్వాన్ని మందలించింది. రాష్ట్రంలో 1,100 ఆశ్రమ పాఠశాలలుండగా 4,50,000 మంది విద్యార్థులు అందులో విద్యనభ్యసిస్తున్నారని, దశాబ్దకాలంలో 793 మంది విద్యార్థులు పాముకాటు, తేలుకాటు, జ్వరం, చిన్నపాటి అనారోగ్యాల కారణంగానే మరణించారని తాల్పే తన పిటిషన్లో ఆరోపించారు. మరణించిన విద్యార్థుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిహారం కూడా చెల్లించలేదని ఆరోపించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తర ఫున అరుణ పాయి సమాధానమిస్తూ... మరణించిన 793 మందిలో 453 విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేశామని, 340 మంది విద్యార్థుల కుటుంబాలకు ఇంకా అందజేయాల్సి ఉందని చెప్పారు. అయితే తగినన్ని నిధులు లేకే పరిహారం అందజేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఇక పాఠశాలల్లో సంభవిస్తున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రథమ చికిత్స డబ్బాను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ధర్మాసనానికి చెప్పారు. ఈ వివరణపై కోర్టు స్పందిస్తూ... ఎంతో శ్రమకోర్చి గిరిజన బాలలు ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని, పాముకాటు, తేలు కాటుకు ప్రథ మ చికిత్స ఏమేరకు విద్యార్థులను కాపాడుతుందని ప్రశ్నించారు. దీనికి అరుణ సమాధానమిస్తూ... అత్యవసర సమయాల్లో విద్యార్థులను మెరుగైన వసతి కోసం ఇతర ప్రాంతాలకుతరలించేందుకు 35 జీపులను కొనుగోలు చేసిం దని, 185 మంది సిబ్బందిని కూడా నిజమించిందన్నారు. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది ఉదయ్ మాట్లాడుతూ కనీసం ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఓ వైద్యాధికారిని నియమించాలన్నారు. దీనికి కోర్టు స్పందిస్తూ... పిటిషనర్ చెప్పినదానిలో వాస్తవముందని, ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఓ వైద్యాధికారిని నియమించాల్సిన అవసరముందన్నారు. కేసు తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ధర్మాసనం పిటిషనర్ లేవనెత్తిన సమస్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.