విజయవాడ వన్‌టౌన్‌లో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది
కంటికి కనిపించని శత్రువు చాపకింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 52కి చేరింది. ఇందులో విజయవాడ నగరంతోపాటు, జగ్గయ్యపేట, పెనమలూరు మండలాలకు చెందిన వారున్నారు. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మరింత పకడ్బందీ చర్యలను తీసుకుంటోంది. బాధిత కుటుంబాలతోపాటు వారు కలిసిన వారెవరనే విషయమై మరోసారి ఆరా తీస్తోంది. విజయవాడలో ప్రతి డివిజన్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఆస్పత్రికి తరలిస్తోంది. ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
సాక్షి, విజయవాడ: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగరంలోని ఖుద్దూస్‌నగర్‌లో ఒకరికి, గుప్తాసెంటర్(విద్యాధరపురం)లో మరొకరికి, జగ్గయ్యపేట పట్టణంలో ఒకరికి, పెనమలూరు మండలం సనత్‌నగర్‌లో ఇంకొకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం.
నాలుగు రోజుల్లో 16 మంది..
క్వారంటైన్ కేంద్రాలకు వస్తున్న పాజిటివ్ సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగురోజుల్లో ఏకంగా 16 మంది విజయవాడ జీజీహెచ్, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఉన్న క్వారంటైన్ కేంద్రాలకు వచ్చారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా బాధితులకు, అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని, కొత్త కేసులు రాకుండా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. వైరస్ గొలుసును తెగ్గొట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు.
ప్రతి డివిజన్‌లో వైద్య శిబిరాలు..
విజయవాడలో 64 డివిజన్‌లు ఉండగా, ప్రతి డివిజన్‌లో నిత్యం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆ శిబిరాల్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారికి పరీక్షలు చేసి, కరోనా లక్షణాలు ఉంటే ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. ఇలా నిత్యం ప్రతి వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు అనుమానితులను పరీక్షల కోసం పంపుతుండగా, అలా వెళ్లిన వారిలో కొందరికి పాజిటివ్ వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇలా వారం రోజులుగా డివిజన్‌లలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తిస్తున్నారు. మరోవైపు రెడ్‌జోన్ ప్రాంతాల్లో స్వాబ్ కలెక్షన్ శిబిరాలు నిర్వహిస్తూ, అక్కడే నేరుగా అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి వెతుకులాట..
నగరంలో రెండు వేల బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. కాంటాక్టులను గుర్తించడం, వారిని రెవెన్యూ, పోలీసు సహకారంతో క్వారంటైన్‌కు , ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ సర్వేలో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలా మొత్తం నగరంలో రెండు వేల మంది వలంటీర్లు సర్వే చేస్తున్నారు. వారితో పాటు, ఆశా వర్కర్, ఏఎన్‌ఎంలు కూడా భాగస్వాములు అవుతున్నారు. నగరంలో ఎక్కువుగా కరోనా కేసులు నమోదవడంతో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సీఎంఓహెచ్ డాక్టర్ డి. షాలినీదేవిలు నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా కట్టడి చర్యలకు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు.
మాస్కులతో జాగ్రత్త!
పటమట(విజయవాడ తూర్పు): కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రజలు వినియోగిస్తున్న మాస్‌్కలను సురక్షితంగా డిస్పోజ్ చేయాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాస్కులను రోడ్లపై లేదా నివాసాలలోని చెత్త బుట్టలలో పడేయటం వల్ల వాటిని పెంపుడు/ వీధులలో సంచరించు పశువులు తాకితే వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర పరిస్థితిగా మారుతుందన్నారు.
నగవాసులందరూ వినియోగించిన మాస్‌్క, గ్లౌజ్‌లను ముక్కలు ముక్కలుగా చేసి తడి పొడి చెత్తతో కాకుండా విడిగా ఒక పేపర్ కవర్, ప్యాకెట్‌లో/కాగితంలో చుట్టి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని అన్నారు. ప్రజారోగ్య పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక సంచుల ద్వారా సేకరించిన మాస్‌్కలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment