ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడినిచ్చే ఫండ్స్? | FDI policy to raise more funds | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడినిచ్చే ఫండ్స్?

Published Mon, Dec 9 2013 1:47 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

FDI policy to raise more funds

నేను రిటైర్ కావడానికి ఇంకా తొమ్మిదేళ్లు సమయముంది. నాకు సరిపోయినంతగా బీమా, పెన్షన్ ప్లాన్లున్నాయి. నేను వారానికి రూ.10,000 చొప్పున నెలకు రూ.40,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను.  నాకు 70 ఏళ్లు వచ్చేసరికి ద్రవ్యోల్బణాన్ని  తట్టుకోగల విధంగా నా ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. తగిన సూచనలివ్వండి.       
         - జి. సురేష్, అమలాపురం

 మీరు తెలివైన ఇన్వెస్టర్‌లాగా ఉన్నారు. రిటైర్మెంట్‌కు సమంజసమైన కార్పస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగల రాబడులను ఆర్జించవచ్చు. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ రిటైర్మెంట్ నాటికి చెప్పుకోదగ్గ సంపదను సృష్టించుకోవచ్చు. మంచి ట్రాక్ రికార్డ్, రేటింగ్ ఉన్న రెండు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్స్‌ల్లో ప్రతీ వారం ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ వల్ల పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ ఈక్విటీల్లో 65 శాతానికి పైగా పెట్టుబడులు పెడతాయి. ఈక్విటీల్లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్ చేస్తే వాటిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం  లేదు.
 
నెలవారీ వేతనాలొచ్చే వ్యక్తులకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్-ఎస్‌ఐపీ) చాలా బావుంటుంది. అయితే ప్రతినెలా ఒకే మొత్తంలో కాకుండా ఎక్కువ, తక్కువగా ఆదాయం లభించే  వ్యక్తులు ఏవిధంగా ఇన్వెస్ట్ చేయాలి? నేను ఇప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయగలను. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) విధానాన్ని అనుసరించవచ్చా?
 - ఇందర్‌జైన్, హైదరాబాద్

ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఒకేసారి కాకుండా కొంత కొంత మొత్తాల్లో దఫదఫాలుగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని తరుచూ సూచిస్తూ ఉంటాం. ఇలా చేస్తే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులను తట్టుకోవచ్చు.  ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేసిన రోజు స్టాక్స్/ ఫండ్స్ అధిక ధర ఉండి. ఆ మరుసటి రోజు తగ్గాయనుకోండి. మీ పెట్టుబడుల విలువ తగ్గుతుంది. ఇలా విలువ తగ్గినప్పటికీ, కొందరు తట్టుకోగలరు. కానీ కొత్త, చిన్న ఇన్వెస్టర్లు మాత్రం డీలాపడి, ఇన్వెస్ట్‌మెంట్ జోలికే రారు. అందుకే ఎప్పుడైనా సరే, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడులు పెట్టకుండా, అదే మొత్తాన్ని దఫదఫాలుగా క్రమం తప్పకుండా  ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ములు వచ్చినప్పుడు ముందుగా వాటిని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) విధానంలో మీ పెట్టుబడులను ఈక్విటీలోకి మళ్లించండి. ఫలితంగా మార్కెట్లు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో గరిష్ట, కనిష్ట స్థాయిలకు చేరినప్పుడు తగిన ప్రయోజనాలు ఈ విధానంలో మీకు లభిస్తాయి.
 
నా పెట్టుబడులపై సురక్షితమైన, స్థిరమైన రాబడులను ఆశిస్తున్నాను. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడినిచ్చే ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలను సూచించండి?                 
                    - ప్రత్యూష, విజయవాడ

 ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ) సమంజసమైన సురక్షితమైన రాబడులను అందిస్తాయి. అయితే లిక్విడిటీ విషయంలో కొంచెం రాజీపడాల్సి ఉం టుంది. మీరు ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే ఈ ఫండ్ ప్లాన్ మెచ్యూరిటీ వరకూ మీ పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలు లేదు. ఇవి ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులు అందిస్తాయి. 30 శాతం ఆదాయపు పన్ను బ్రాకెట్‌లో ఉన్నవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద గత ఏడాది కాలంలో పన్ను తర్వాత నికరంగా 6.3 శాతం రాబడులు వచ్చాయి. అదే ఎఫ్‌ఎంపీలు 9.51 శాతం రాబడిని ఇచ్చాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లలాగా ఎఫ్‌ఎంపీలను ముందుగా విత్‌డ్రా చేసుకునే వీలు లేదు. సాధారణంగా ఎఫ్‌ఎంపీల మెచ్యూరిటీ 12 నుంచి 36 నెలలుగా ఉంటుంది. ఈ కాలపరిమితి తీరేవరకూ మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలు లేదు.  ఎఫ్‌ఎంపీలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతాయి. మెచ్యురిటీకి ముందే మీ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలంటే ఈ ఎఫ్‌ఎంపీలను వేరే ఇన్వెస్టర్లకు అమ్ముకోవచ్చు. కానీ ఎఫ్‌ఎంపీల క్రయ, విక్రయ లావాదేవీలు చాలా చాలా స్వల్పంగా ఉంటాయి.  ఒక విధంగా చెప్పాలంటే వీటిని మీరు విక్రయించలేరు. ఏతావాతా తేలేదేమిటంటే మెచ్యూరిటీ కాలానికి తప్ప మధ్యలో ఎఫ్‌ఎంపీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలు లేదు. కాకుంటే ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడులనిస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement