గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు బీమా | Greenhouse structures to be insured | Sakshi
Sakshi News home page

గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు బీమా

Published Sun, Jun 19 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు బీమా

గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు బీమా

- ఓరియంటల్, యూఐఐ బీమా కంపెనీలకు అప్పగింత
- ఏడాదికి ఎకరానికి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రీమియం నిర్ధారణ
- తొలి ఏడాది గ్రీన్‌హౌస్ నిర్మించిన కంపెనీలదే ప్రీమియం చెల్లింపు బాధ్యత
- ఈదురు గాలులు, అగ్ని ప్రమాదాల్లో నష్టపోతే రూ.24 లక్షల వరకు పరిహారం
 
 సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) నిర్మాణాలకు బీమా సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈదురు గాలులు, భారీ వర్షాలు, తుపాన్లు, వరదలు, భూకంపాలకు గ్రీన్‌హౌస్ నిర్మాణాలు ధ్వంసమైతే రైతులకు బీమా సొమ్ము లభిస్తుంది. గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు బీమా కల్పించేందుకు ఓరియంటల్ బీమా కంపెనీ, యునెటైడ్ ఇండియా బీమా (యూఐఐ) కంపెనీలు ముందుకొచ్చాయి. గత ఆరు నెలల్లో గ్రీన్‌హౌస్‌లు నిర్మించిన రైతులందరినీ తప్పనిసరిగా బీమా పరిధిలోకి తీసుకొస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో వారంతా తప్పనిసరిగా ప్రీమియం చెల్లించాలి. త్వరలో విధివిధానాలను ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

 రూ.34 లక్షల మొత్తానికి బీమా...
 తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎకరా గ్రీన్‌హౌస్ నిర్మాణానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు కానుంది. అందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇతర రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇంత భారీగా సొమ్ము ఇస్తున్న నేపథ్యంలో ఈదురు గాలులు, వరదలు, ఇతరత్రా నష్టం జరిగితే చెల్లించిన సొమ్మంతా నష్టపోయే పరిస్థితి రానుంది. అందుకోసం బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎకరాకు రూ. 34 లక్షల బీమా చేయించడానికి అవకాశం కల్పించింది. ఓరియంటల్ బీమా కంపెనీ ఏడాదికి రూ. 7,013 ప్రీమియంగా వసూలు చేస్తుంది. గ్రీన్‌హౌస్‌లో పాలీ షీట్లకు ఏడాదికి 50 శాతం, అలాగే నిర్మాణంపై 15 శాతం తరుగుదలగా లెక్కిస్తుంది. ఇక యునెటైడ్ ఇండియా బీమా కంపెనీ కూడా పాలీషీట్లపై 40 శాతం, నిర్మాణంపై 15 శాతం తరుగుదలను లెక్కించింది. ఈ కంపెనీ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రూ. 9,844 ప్రీమియంగా నిర్ణయించింది. ఈ జిల్లాలు భూకంప జోన్లు కాబట్టి అధిక ప్రీమియం చెల్లించాలని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో రూ. 9,649గా నిర్ధారించింది. గ్రీన్‌హౌస్ నిర్మాణం, పాలీషీట్లు, షేడ్‌నెట్లకు కూడా కవరేజీ ఉంటుంది. గ్రీన్‌హౌస్‌లో పండించే పంటలకు మాత్రం కవరేజీ ఉండదు.
 
 రూ. 23 లక్షల నుంచి రూ. 24.64 లక్షల వరకు క్లెయిమ్స్
 తరుగుదలను, ఇతరత్రా వాటిని లెక్కలోకి తీసుకుంటే గ్రీన్‌హౌస్ నిర్మాణం, పాలీషీట్లు పాడైపోతే ఓరియంటల్ బీమా కంపెనీ గరిష్టంగా రూ.24.64 లక్షల వరకు క్లెయిమ్ ఇవ్వనుంది. అందులో నిర్మాణంపై రూ. 23.27 లక్షలు, పాలీషీట్‌పై రూ.1.34 లక్షలు క్లెయిమ్స్ ఇవ్వనుంది. యునెటైడ్ ఇండియా బీమా కంపెనీ రూ.23.06 లక్షలు క్లెయిమ్స్ ఇవ్వనుంది. అందులో నిర్మాణంపై రూ.22.05 లక్షలు, పాలీషీట్లపై రూ.1.01 లక్షలు ఇవ్వనుంది. పాలీషీట్లపై రెండో ఏడాది 80 శాతం తరుగుదల చూపిస్తారు. దీనివల్ల రైతుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా పాలీషీట్లపై ఐదేళ్ల వారంటీని కూడా కంపెనీ కల్పించింది. కాబట్టి రెండో ఏడాది పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక ఈదురు గాలులతో పాలీషీట్లు ధ్వంసం అవుతాయే కానీ... గ్రీన్‌హౌస్ నిర్మాణానికి పెద్దగా జరిగే నష్టం ఏమీ ఉండదు. కాబట్టి కంపెనీలకు కూడా లాభదాయకమే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement