చిన్న కంపెనీ కార్మికులకూ ఈపీఎఫ్
చట్టాన్ని సవరిస్తాం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: పది మంది ఉన్న చిన్న కంపెనీల్లో పని చేసే కార్మికులకూ భవిష్యనిధి(ఈపీఎఫ్) సౌకర్యం కల్పించేలా చట్టాన్ని సవరిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం 20 మందికిపైగా కార్మికులున్న కంపెనీల్లో పనిచేసే వారికే ఈపీఎఫ్ వర్తిస్తుందన్నారు. చట్టం సవరిస్తే కోట్లాది మంది కార్మికులకు పెన్షన్, పదవీవిరమణ ప్రయోజనం, మెడికల్, బీమా సౌకర్యం వంటివన్నీ వర్తిస్తాయని శనివారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో చెప్పారు. కనీస పరిమితి వంటివాటి అంశాల్లోనూ కార్మికులకు ఉపయోగపడే చాలా సవరణలు తెస్తామన్నారు.
అన్ని అలవెన్సులు కలిపి 7 వేలు జీతం దాటే ప్రతీ కాంట్రాక్టు ఉద్యోగికి పీఎఫ్ వర్తింపజేస్తామన్నారు. పత్తి కొనుగోలులో ప్రభుత్వం ఇచ్చే బోనస్, ధర వంటివాటిలో అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దళారుల పాలు కాకుండా రైతులకే నేరుగా ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమన్నారు.