బడ్జెట్ ఖర్చులపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలి : పొన్నాల
జోగిపేట : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సోమవారం ఆందోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పొన్నాల మాట్లాడుతూ ఇన్సూరెన్స్ విషయంలో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేసి ఉంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని అన్నారు.
ఈ విషయంలో విడుదల చేసిన 25 శాతం నిధులు వడ్డీ కిందకే పోతున్నాయన్నారు. బూటకపు మాటలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఉద్యమం ముసుగులో ప్రజలను మభ్యపెట్టి అరాచకాలు సృష్టిస్తోందన్నారు. రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చి 31న ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో టీవీల ముందు చర్చకు రావాలని ఆయన సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఎన్నికల హామీలో భాగంగా ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేసే వేల ఎకరాల భూమిని ఎక్కడి నుంచి తెచ్చి పంపిణీ చేస్తారన్నారు.
ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తే మిగతా సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ రామచంద్ర కుంతియా, మాజీ డిప్యూటీ సీఎం సీ.దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలకూ ఇన్సూరెన్స్
Published Tue, Dec 2 2014 1:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement