TPCC President Ponnala Lakshmaiah
-
మరణంలోనూ వీడని స్నేహబంధం
గజ్వేల్ : ఆ ఇద్దరు స్నేహబంధం మరణంలోనూ వీడలేదు.. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒకరి తర్వాత మరొకరు మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో చోటుచేసుకుంది.. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఫిరంగి కవీందర్ (24), తలారి అశోక్ (25) చిన్నప్పటి నుంచి వీరి చదువులన్నీ ఒకే చోటా సాగాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్నేహం వారిది. ఈ క్రమంలోనే కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలోని వినాయక కళాశాలలో కవీందర్ బీపెడ్, అశోక్ ఏంబీఏ చదువుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కళాశాలకు ఇద్దరు బైక్‌పై వెళ్తూ కుకునూర్‌పల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో కవీందర్ అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన అశోక్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. కవీందర్‌కు తల్లిదండ్రులు ఎల్లవ్వ, నర్సయ్య, అశోక్‌కు తల్లిదండ్రులు తిరుపతమ్మ, యాదయ్యలు ఉన్నారు. చిన్నపాటి వ్యవసాయం, కూలీ పనులే వీరికి జీవనాధారం. ఇదిలా ఉంటే కవీందర్ ఎన్ఎస్యూఐలో పనిచేసేవాడు. మృతుల కుటుంబీకులను గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. పార్టీ తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం డీసీసీ అధ్యక్షుడు సునీతారెడ్డి సైతం మృతులిద్దరి కుటుంబీకులను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. వీరి వెంట కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ చాడ రామరాజు పంతులు, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ శాఖ అధ్యక్షుడు సర్దార్‌ఖాన్, గ్రామ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ అంజియాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుంటుకు మల్లేశం, నరసింహాచారి, యూత్ కాంగ్రెస్ నాయకులు గుంటుకు శ్రీను, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తలకూ ఇన్సూరెన్స్
బడ్జెట్ ఖర్చులపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలి : పొన్నాల జోగిపేట : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సోమవారం ఆందోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పొన్నాల మాట్లాడుతూ ఇన్సూరెన్స్ విషయంలో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేసి ఉంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని అన్నారు. ఈ విషయంలో విడుదల చేసిన 25 శాతం నిధులు వడ్డీ కిందకే పోతున్నాయన్నారు. బూటకపు మాటలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఉద్యమం ముసుగులో ప్రజలను మభ్యపెట్టి అరాచకాలు సృష్టిస్తోందన్నారు. రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 31న ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో టీవీల ముందు చర్చకు రావాలని ఆయన సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఎన్నికల హామీలో భాగంగా ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేసే వేల ఎకరాల భూమిని ఎక్కడి నుంచి తెచ్చి పంపిణీ చేస్తారన్నారు. ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తే మిగతా సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ రామచంద్ర కుంతియా, మాజీ డిప్యూటీ సీఎం సీ.దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఖమ్మం: 2019లో జరిగే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రారంభించారు. పలువురు నాయకులకు సభ్యత్వ రశీదులు ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలను అందించింది కాంగ్రెసేనని అన్నారు. ఆహార భద్రత, ఉపాధి హామీ తదితర పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కిందన్నారు. మాటల గారడీతో ప్రజల్లో ఆశలు పెంచి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వారిని ఇబ్బం దులపాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలకు ఆయన తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ పాలనతో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. * పార్టీ జిల్లా ఇన్చార్జి కుసుమకుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు సహజమని అన్నారు. నాయకులు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు. * మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కేసీఆర్ ‘బంగారు తెలంగాణ’గా కాకుండా ‘ఆత్మహత్యల తెలంగాణ’గా మార్చారని ధ్వజమెత్తారు. * పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డివెంకటరెడ్డి మాట్లాడుతూ..రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ చలించడం లేదని విమర్శించారు. తన పదవి ఎప్పుడు పోతుందోననే భయంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొంటున్నారని అన్నారు. * ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. నాలుగు నెలల కేసీఆర్ పాలనలో ప్రజలు క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్నారని అన్నారు. విద్యుత్ కోతలు, తాగునీరు, సాగునీరు లేక అల్లాడుతున్నారని, సంక్షేమ పథకాలకు ఎప్పుడు కోత పెడతారోనని భయపడుతున్నారని అన్నారు. * ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని విస్మరించడం కేసీఆర్‌కు తగదని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు వగ్గెల మిత్రసేన, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, డీసీసీ ఇన్చార్జిలు ఐతం సత్యం, శీలంశెట్టి వీరభద్రం, వీవీ అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ఖమ్మం టౌన్ అధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వర్లు, నాయకులు ఎడవల్లి కృష్ణ, బాలగంగాధర్ తిలక్, మహిళా కాంగ్రెస్ ఖమ్మం టౌన్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, అయూబ్, మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాపర్తి రంగారావు కుటుంబానికి పరామర్శ ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాపర్తి రంగారావు కుటుంబాన్ని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శనివారం పరామర్శించారు. -
పీసీసీ కార్యదర్శి, మీడియా కన్వీనర్‌గా శ్రీనివాసరావు
వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యదర్శిగా, మీడియా కన్వీనర్‌గా ఈవీ శ్రీనివాసరావును నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శ్రీనివాసరావు హైదరాబాద్‌లో పొన్నాల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరావు 20 ఏళ్లుగా ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్తర్తించారు. పార్ట్లీ మీడియా బాధ్యతలు సైతం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ పదవిని కేటాయించినట్లు పొన్నాల తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని ఎప్పటికి గుర్తింపు ఉంటుందని, ఇందుకు నిదర్శనం తానేనని అన్నారు. పార్టీకి, మీడియాకు మధ్య సమన్వయం చేస్తూ కాంగ్రెస్ ప్రతిష్ట పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశమిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు జిల్లా, నగర కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు.