వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
ఖమ్మం: 2019లో జరిగే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రారంభించారు. పలువురు నాయకులకు సభ్యత్వ రశీదులు ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలను అందించింది కాంగ్రెసేనని అన్నారు.
ఆహార భద్రత, ఉపాధి హామీ తదితర పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కిందన్నారు. మాటల గారడీతో ప్రజల్లో ఆశలు పెంచి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వారిని ఇబ్బం దులపాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలకు ఆయన తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ పాలనతో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
* పార్టీ జిల్లా ఇన్‌చార్జి కుసుమకుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు సహజమని అన్నారు. నాయకులు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు.
* మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కేసీఆర్ ‘బంగారు తెలంగాణ’గా కాకుండా ‘ఆత్మహత్యల తెలంగాణ’గా మార్చారని ధ్వజమెత్తారు.
* పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డివెంకటరెడ్డి మాట్లాడుతూ..రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ చలించడం లేదని విమర్శించారు. తన పదవి ఎప్పుడు పోతుందోననే భయంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొంటున్నారని అన్నారు.
* ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. నాలుగు నెలల కేసీఆర్ పాలనలో ప్రజలు క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్నారని అన్నారు. విద్యుత్ కోతలు, తాగునీరు, సాగునీరు లేక అల్లాడుతున్నారని, సంక్షేమ పథకాలకు ఎప్పుడు కోత పెడతారోనని భయపడుతున్నారని అన్నారు.
* ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని విస్మరించడం కేసీఆర్‌కు తగదని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు వగ్గెల మిత్రసేన, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, డీసీసీ ఇన్‌చార్జిలు ఐతం సత్యం, శీలంశెట్టి వీరభద్రం, వీవీ అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ఖమ్మం టౌన్ అధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వర్లు, నాయకులు ఎడవల్లి కృష్ణ, బాలగంగాధర్ తిలక్, మహిళా కాంగ్రెస్ ఖమ్మం టౌన్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, అయూబ్, మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రాపర్తి రంగారావు కుటుంబానికి పరామర్శ
ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాపర్తి రంగారావు కుటుంబాన్ని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శనివారం పరామర్శించారు.