మరణంలోనూ వీడని స్నేహబంధం
గజ్వేల్ : ఆ ఇద్దరు స్నేహబంధం మరణంలోనూ వీడలేదు.. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒకరి తర్వాత మరొకరు మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో చోటుచేసుకుంది.. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఫిరంగి కవీందర్ (24), తలారి అశోక్ (25) చిన్నప్పటి నుంచి వీరి చదువులన్నీ ఒకే చోటా సాగాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్నేహం వారిది. ఈ క్రమంలోనే కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలోని వినాయక కళాశాలలో కవీందర్ బీపెడ్, అశోక్ ఏంబీఏ చదువుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం కళాశాలకు ఇద్దరు బైక్‌పై వెళ్తూ కుకునూర్‌పల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో కవీందర్ అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన అశోక్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. కవీందర్‌కు తల్లిదండ్రులు ఎల్లవ్వ, నర్సయ్య, అశోక్‌కు తల్లిదండ్రులు తిరుపతమ్మ, యాదయ్యలు ఉన్నారు. చిన్నపాటి వ్యవసాయం, కూలీ పనులే వీరికి జీవనాధారం.
ఇదిలా ఉంటే కవీందర్ ఎన్‌ఎస్‌యూఐలో పనిచేసేవాడు. మృతుల కుటుంబీకులను గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. పార్టీ తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం డీసీసీ అధ్యక్షుడు సునీతారెడ్డి సైతం మృతులిద్దరి కుటుంబీకులను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు.
వీరి వెంట కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ చాడ రామరాజు పంతులు, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ శాఖ అధ్యక్షుడు సర్దార్‌ఖాన్, గ్రామ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ అంజియాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుంటుకు మల్లేశం, నరసింహాచారి, యూత్ కాంగ్రెస్ నాయకులు గుంటుకు శ్రీను, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.