గజ్వేల్: మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన అక్కారం కిష్టయ్య (55), అక్కారం సాయమ్మ (60), అక్కారం పోచయ్య (35)తో పాటు మరో 24 మంది కలిసి చేర్యాల మండలం నాగపురిలో ఆత్మహత్యకు పాల్పడిన మల్లేశం అంత్యక్రియలకు వెళ్లేందుకు టాటా ఏస్ (ట్రాలీ ఆటో)లో బయలుదేరారు. కాగా, మృతుడు మల్లేశంకు పాములపర్తి గ్రామానికి చెందిన కనకమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇదే క్రమంలో మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో పుట్టిల్లు పాములపర్తి గ్రామంలో ఉన్న అతని భార్య కనకమ్మ వారితో కలిసి వెళ్లింది.
మార్గమధ్యంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే మసీదు మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఆపారు. మండలంలోని దాచారం గ్రామం నుంచి తమ బంధువొకరు వస్తారని చెప్పడంతో ఆయన కోసం ఎదురు చూసే క్రమంలో 10 నిమిషాల పాటు వాహనం నిలిపారు. వెనుక వైపు నుంచి బస్సును ఓవర్‌టేక్ చేసి దూసుకొచ్చిన లారీ.. ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఆటోను సుమారు 20 మీటర్ల దూరానికిపైగా ఈడ్చుకుపోయి రోడ్డు కిందకు పడిపోయింది. ప్రమాదంలో అక్కారం కిష్టయ్య, అక్కారం సాయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కారం పోచయ్య గజ్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో తుదిశ్వాస విడిచాడు. కిష్టయ్యపైకి లారీ దూసుకెళ్లడంతో అతని మెదడు, శరీరభాగాలన్నీ నుజ్జునుజ్జయి భీతావాహ వాతావరణం నెలకొంది.
హాహాకారాలు.. ఆర్తనాదాలు
ప్రమాదస్థలి వద్ద క్షతగాత్రుల హాహాకారాలు, ఆర్తనాదాలు, మృతుల బంధువుల రోదనలతో దద్దరిల్లింది. ఆటో వెనకాల బైక్‌పై వస్తున్న మృతుడు కిష్టయ్య కుమారుడు కనకయ్య తండ్రి తల చిద్రమై పడిఉండడం చూసి కుప్పకూలిపోయాడు. ‘మా నాయన సచ్చిపోయిండే దేవుడా..’ అంటూ గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. రిమ్మనగూడకు చెందిన పలువురు యువకులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో అప్పటికప్పుడు ఆటోల్లో వెంటవెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గజ్వేల్ సీఐ ప్రసాద్, గౌరారం, గజ్వేల్, కుకునూర్‌పల్లి ఎస్‌ఐలు ప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, పరమేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మృతుల కుటుంబీకులను గజ్వేల్ ఆస్పత్రి వద్ద ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణసంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పరామర్శించారు. సిద్దిపేట సీపీ జోయెల్ డేవిస్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహశీల్దార్ బాల్‌రెడ్డి సైతం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేపట్టారు.
ప్రమాదకరమైన మలుపే కారణం
రిమ్మనగూడలో శుక్రవారం చోటుచేసుకున్న విషాదానికి ప్రమాదకరమైన మలుపే కారణమని తెలుస్తోంది. మసీదు వద్ద ఉన్న ఈ మలుపు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలో ఈ మలుపును సరిచేసే విషయాన్ని సంబంధిత యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. వాహనాల వేగం మలుపుల వద్ద మరింత ప్రమాదకరంగా పరిణమించి ఇళ్లపైకి దూసుకొస్తున్నాయి.
ఈ ఘటనలో ఆటో రోడ్డు చివరన నిలిపి ఉండటం, పక్కన స్థలం లేక రోడ్డు ఎత్తుగా ఉండి కింది భాగమంతా గుంత మాదిరిగా ఉండడం వల్ల లారీ బస్సును ఓవర్‌టేక్ చేసి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో కిందికి వెళ్లిపోయి ప్రాణనష్టం జరిగింది. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం కూడా మరో కారణం. మే 26న ఇదే గ్రామంలోని ఫార్మసీ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సు క్వాలిస్ వాహనాన్ని ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందిన ఘటన చోటుచేసుకోవడం.. తాజాగా మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment