మొన్న తమ్ముడు.. నేడు అన్న | Wargal: Brothers Died In Road Accident Over In Five Days Period | Sakshi
Sakshi News home page

మొన్న తమ్ముడు.. నేడు అన్న

Published Tue, Dec 22 2020 8:45 AM | Last Updated on Tue, Dec 22 2020 8:46 AM

Wargal: Brothers Died In Road Accident Over In Five Days Period - Sakshi

కరుణాకర్‌(ఫైల్‌) , అరవింద్‌ కుమార్‌(ఫైల్‌)

సాక్షి, వర్గల్‌(గజ్వేల్‌): వారిద్దరు అన్నదమ్ముల పిల్లలు.. ఒకే ప్రమాదం.. ఒక విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం. మొన్న తమ్ముడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు అన్న.. అయిదురోజుల వ్యవధిలో సోదరుల దుర్మరణం.. రెండు కుటుంబాలకు కడుపుకోత మిగిల్చిన రోడ్డు ప్రమాదం. వర్గల్‌ మండలం అనంతగిరిపల్లిలో పెనువిషాదాన్ని మిగగిల్చింది. ఈ నెల 15న మంగళవారం ఉదయం తూప్రాన్‌ మండలం అల్లాపూర్‌ చౌరస్తావద్ద ఈ ప్రమాదం జరగగా అనంతగిరిపల్లికి చెందిన తుమ్మల అరవింద్‌ కుమార్‌ (15) అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తుమ్మల కరుణాకర్‌ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

అనంతగిరిపల్లిలో రైతు కుటుంబానికి చెందిన తుమ్మల రామకృష్ణ–లక్ష్మి దంపతుల కుమారుడు కరుణాకర్, అతడి చిన్నాన్న తుమ్మల లక్ష్మణ్‌–లత దంపతుల కుమారుడు(వరుసకు తమ్ముడు) అరవింద్‌ కుమార్‌లు  15న ఉదయం సమీప బంధువు కూతురును బైక్‌మీద తూప్రాన్‌ సమీప పరిశ్రమ వద్ద దింపేశారు.  అక్కడి నుంచి గ్రామానికి తిరిగొస్తుండగా అల్లాపూర్‌ చౌరస్తావద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో అక్కడికక్కడే అరవింద్‌ మృతి చెందగా, తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన కరుణాకర్‌ సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఇంటర్‌ చదివిన కరుణాకర్‌ అవివాహితుడు. చదువు కొనసాగిస్తున్న దశలోనే ఇద్దరు మృత్యుపాలవడం, ఎదిగిన కొడుకులు కానరాని తీరాలకు చేరడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు కరుణాకర్‌ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement