ప్రమాదానికి కారణమైన టైర్ ముక్క
సాక్షి, ములుగు(గజ్వేల్): టైర్ ముక్కను తాకి బైక్ అదుపుతప్పడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన లక్ష్మక్కపల్లి రాజీవ్ రహదారిపై జరిగింది. ఎస్‌ఐ రంగకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన మంకి సుధాకర్–స్వరూప (34) దంపతులు ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. వీరికి యశ్వంత్ (14), సాత్విక (12) ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సోమవారం తెల్లవారుజామున వంటిమామిడిలో కూరగాయలను కొనేందుకు దంపతులు బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్ష్మక్కపల్లి వద్ద రోడ్డుపై టైర్ ముక్క పడి ఉండటం వీరికి కనిపించలేదు. దీంతో దాని మీదుగా వెళ్లిన బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వరూప అక్కడిక్కడే మృతి చెందగా, సుధాకర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంగకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించామని పేర్కొన్నారు.
చదవండి: సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. గురుకులంలో 48 మందికి పాజిటివ్
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ రంగ కృష్ణ
రెడిమిక్స్ వాహనం ఢీకొని మరొకరు..
గజ్వేల్‌రూరల్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఎదురుగా వచ్చిన రెడిమిక్స్ వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ (పల్లెపహడ్)లో నివాసముంటున్న గుగులోత్ లక్ష్మి (52) తన కొడుకు మహేందర్, కూతురు శాంతి బెజుగామకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
ఈ క్రమంలో సంగాపూర్‌లో గల మజీద్ వద్దకు రాగానే గజ్వేల్ నుంచి వర్గల్ వైపు వెళ్తున్న రెడిమిక్స్ వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేందర్, భుక్య శాంతికి తీవ్ర గాయాలు కాగా.. లక్ష్మి తలపై నుంచి వాహనం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment