సాక్షి, హైదరాబాద్: ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు జంతువులకు బీమా కల్పించడం ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగింది. ఆపదలో ఉన్న పెట్స్‌కు బీమా రూపంలో ఆపన్న హస్తం అందించేందుకు నగరవాసులు అమితాసక్తి చూపుతున్నారు. ఇటీవలికాలంలో సంపన్న వర్గాలతోపాటు ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతికి చెందిన వారు కూడా తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవడంపై మక్కువ చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ జాతులకు చెందిన కుక్కలు, పిల్లులు, పక్షులకు బీమా సౌకర్యం కల్పించేందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇటీవల వేలాది జంతువులకు ఇలాంటి భరోసా కల్పించినట్లు బీమా కంపెనీలు చెబుతున్నాయి. సాధారణ అనారోగ్యం మొదలు చిన్నపాటి సర్జరీలు, కేన్సర్, గుండెజబ్బుల వంటి ప్రమాదకర వ్యాధుల చికిత్సలకు సైతం డబ్బులు చెల్లిస్తారు. వ్యాక్సినేషన్, డీవార్మింగ్, టిక్‌ట్రీట్‌మెంట్, డాక్టర్ విజిట్ వంటివి కూడా బీమా పరిధిలోకి రావ డం విశేషం. ఒకవేళ ఆ పెట్ ఆకస్మికంగా మరణించినా యజమానికి బీమా మొ త్తాన్ని చెల్లించే కంపెనీలు కూడా ఉన్నాయి.
నెలకు రూ.122 నుంచి 500 వరకు..
సాధారణంగా ఇళ్లలో పెంచుకునే శునకాల జీవితకాలం సుమారు 12 ఏళ్లు ఉంటుంది. అయితే బీమా కంపెనీలు రెండు నెలల నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న కుక్కలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నాయి. ఇందుకోసం పెట్స్ యజమానులు నెలకు రూ.122 నుంచి 500 వరకు ప్రీమియంగా చెల్లిస్తున్నారు.
పెంపుడు జంతువులకు అనారోగ్యానికి నెలకు రూ.8 వేల నుంచి 10 వేల వరకు ఖర్చు చేస్తున్న వారికి ఈ బీమా ఆర్థికంగా బాగా కలిసివస్తుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. పెట్స్‌కు చికిత్సకయ్యే ఖర్చులో 80 శాతం వరకు కంపెనీ చెల్లిస్తుంది. కేన్సర్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు తదితర ప్రమాదకర వ్యాధుల సర్జరీలకు సుమారు రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ చికిత్సలు కూడా బీమా పరిధిలోకి వస్తాయి.
ముందుకొస్తున్న కంపెనీలు..
పెట్స్‌కు బీమా సౌకర్యం కల్పిస్తున్న వాటిలో పాటెక్టో వెటీనా హెల్త్‌కేర్ ఎల్‌ఎల్‌పీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, పావ్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ బీమా వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఇతర కంపెనీలు సైతం ఈ రంగంలోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో పెట్స్‌ను విక్రయించే దుకాణాలు, వాటికి అవసరమైన ఆహారం, మందులు అందించే సంస్థలు సైతం బాగా విస్తరించాయి. ఇదే క్రమంలో బీమా సదుపాయం రావడంతో పెంపుడు జంతువుల బతుకులకు భరోసా లభిస్తోందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.
పెట్స్ బీమా అత్యవసర జాబితాలోకి..
ఇçప్పుడు పెట్స్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసర జాబితాలోకి చేరింది. హెల్త్‌కేర్, సర్జరీ వంటివి యజమానికి భారం కాకుండా పలు బీమా కంపెనీలు పాలసీలు ఇస్తున్నాయి. ఎక్కువ మంది నగరవాసులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు.
–డాక్టర్ ఎం.అరుణ్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, సరూర్‌నగర్ ప్రైమరీ వెటర్నరీ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment