ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి.. అందుకే అన్ని రంగాల్లో వారికే అగ్రస్థానం
సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన వారిలో బీసీ మహిళలే అధికం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాళ్లు పోతుల సునీత, వరుదు కళ్యాణి
కుటుంబంలో ఎవరూ ఇవ్వని సమానత్వం సీఎం జగన్ ఇచ్చారు: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. జగనన్న గెలుపు.. ఈ రాష్ట్రంలోని మహిళల గెలుపు.. అని ఆమె అన్నారు. సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందిన వారిలో బీసీ మహిళలే అధికమని.. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ అగ్రస్థానం కల్పించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
తొలుత పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాళ్లు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కల్యాణి, పార్టీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ ‘అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీసు.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన పార్టీ అధ్యక్షుడు సీఎం అయ్యాకే తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రతి ఓటరుకు చెప్పాలి.’ అని పేర్కొన్నారు.
ప్రతీ మహిళా స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేయాలి: వరుదు కళ్యాణి
వరుదు కళ్యాణి మాట్లాడుతూ ‘ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జగన్ జమచేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎప్పుడైనా చేశారా? సీఎం జగన్ మహిళా పక్షపాతి. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఓ విలేజ్ సెక్రటేరియట్, విలేజ్ క్లినిక్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. వీటన్నింటిలో ఎక్కువ ఉద్యోగాలు పొందింది మహిళలే. నాడు–నేడుతో కొత్తరూపు సంతరించుకున్న బడులు, ఆస్పత్రులూ కనిపిస్తాయి. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే సీఎం వైఎస్ జగన్ చేశారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రతి మహిళ ఒక స్టార్ క్యాంపెయినర్ అయి వచ్చే ఎన్నికల్లో పనిచేయాలి.’ కోరారు.
ఎన్నికల్లో ప్రచారం కోసం రాజీనామా చేశా: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హారతి పడుతూ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ థాంక్స్ చెబుతున్నాం. కుటుంబంలో ఎవరూ ఇవ్వని సమానత్వం సీఎం జగన్ ఇచ్చారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇలా ప్రతి పథకంలోనూ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతతో వారికి గుర్తింపు, సమానత్వం వచ్చింది. ‘వై నాట్ 175’ అనే సీఎం జగన్ నినాదాన్ని నిజంచేసే శక్తి మహిళలకు ఉంది.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశాను.’ అని వివరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు అమ్మాజీ, బండి పుణ్యశీల, బెందాళం పద్మావతి, డాక్టర్ శశికళ, భవానీ, నాగమణి, సంపత్ విజితా, ఏబీ రాణి, రజనీ, డాక్టర్ షమా సుల్తానా, మాధవీ వర్మ, రాజేశ్వరి, పార్టీ ఉపాధ్యక్షులు, జోనల్ కమిటీ చైర్మన్లు, మహిళా అడ్వొకేట్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment