నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్‌ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్‌లో మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు.
టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్
డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్‌హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్‌లో ఎంఈ చేశారు.
టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు.
సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు
1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు.
సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్‌ఫిక్షన్ విభాగంలో క్రాస్‌వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్‌మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం.
రాజ్య సుధ
– ప్రత్యేక కథనం ఫ్యామిలీలో..
Comments
Please login to add a commentAdd a comment