తొలి మహిళలుగా సత్తా : వీరి గురించి తెలిస్తే మీరు ఫిదానే! | International Womens Day 2024: Check Some Interesting Facts About These 8 Great Indian Women In Telugu - Sakshi
Sakshi News home page

తొలి మహిళలుగా సత్తా : వీరి గురించి తెలిస్తే మీరు ఫిదానే!

Published Tue, Mar 5 2024 1:17 PM | Last Updated on Fri, Mar 8 2024 4:22 PM

International Womens Day 2024 check these Indian Women Who Were First - Sakshi

#InternationalWomen’sDay2024: ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలెదుర్కొంటున్న సవాళ్లు, ఇబ్బందులపై చర్చించి,  మహిళా హక్కులు, సమాన్వతం తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ఈ మహిళా దినోత్సవ ఉద్దేశం. ఈ సందర్భంగా మహిళల త్యాగాల్ని స్మరించు కుంటూ, వారి విజయాలను గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి   పొందుతారు.  

స్త్రీ పురుష వివక్ష లేని సమసమాజమే ప్రపంచ మహిళల ఆకాంక్ష. ఈ లక్ష్యాన్ని ఏర్పరచుకుని శతాబ్దానికి పైగా దాటిపోయినా లింగ సమానత్వం, మహిళా సాధికారకత విషయంలో  సాధించింది (కొంత పురోగతి ఉన్నప్పటికీ) అంతంత మాత్రమే. కానీ మనలోని ఆశల్ని రగుల్కొల్పి, పురుషులతో సమానంగా ముందుకు సాగేలా ఆత్మస్థయిర్యాన్ని నింపుతున్న  ధీర వనితలు చాలా మందే ఉన్నారు. తమ రంగాలలో అగ్రస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. సంబంధిత రంగాలలో భావితరానికి మార్గదర్శకులుగా నిలిచారు. అలాంటి   గొప్ప  భారతీయ మహిళల్ని  గురించి తెలుసుకుందాం.

కల్పనా చావ్లా: అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి భారతీయ సంతతి మహిళగా కల్పనా చావ్లా దేశానికే గర్వకారణం. 1997లో, ఆమె మిషన్ స్పెషలిస్ట్‌గా రోబోటిక్ ఆర్మ్‌కి ప్రైమరీ ఆపరేటర్‌గా పని చేస్తూ, స్పేస్ షటిల్ కొలంబియాలో ప్రయాణాన్ని ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ 2003లో జరిగిన అంతరిక్ష ప్రమాదంలో కన్నుమూయడం అత్యంత విషాదం.

షీలా దావ్రే తొలి భారత మహిళా ఆటో-రిక్షా డ్రైవర్ కావాలనే ఆశయంతో పూణే పయమైన ధీరవనిత దావ్రే. చిన్నప్పటినుంచి కార్లు నడపడం అంటే  పిచ్చి.  పురుషుల ఆధిపత్యం కొనసాగే ఈ రంగంలో,  మహిళా డ్రైవర్లు లేని సమయంలో ఆటోనడిపిన సాహసి ఆమె. కష్టపడి పని చేసి సొంత ఆటోను కొనుగోలు చేశారు. ఈమె అద్భుతమైన ప్రయాణం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. 

అరుణిమా సిన్హా: జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి.  విచిత్రకర పరిస్థితుల్లో, చోరీకి ప్రయత్నించిన దొంగలు ఆమెను రైలునుంచి బయటకు నెట్టివేయడంతో ఎడమ కాలు కోల్పోయింది. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది.  కానీ ఈ విషాదంనుంచి తేరుకుంది.

దృఢ నిశ్చయంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విశేష ఘనతను సాధించింది. తొలి జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణిగా,ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి  తొలి భారతీయ వికలాంగురాలిగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో  అవార్డు దక్కింది. 

ఆనందీబాయి గోపాలరావు జోషి: డాక్టర్ ఆనందీబాయి జోషి తొలి భారతీయ మహిళా వైద్యురాలు, ఆమె గౌరవార్థం వీనస్ క్రేటర్ "జోషీ" అని పేరు పెట్టారు. తొమ్మిదేళ్ల వయసులో తన కంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైన గోపాల్‌రావ్ జోషిని వివాహం చేసుకున్నారు. డాక్టర్‌ చదివాలన్న కోరికకు భర్త సంపూర్ణ మద్దతు లభించడంతో   విజయం సాధించి, రికార్డు క్రియేట్‌ చేశాడు. పద్నాలుగు ఏళ్ళ వయసులో కొడుకుకు జన్మనివ్వడం, ఆ బిడ్డ చనిపోవడం, తన అనారోగ్యం, ఆమెను మెడిసిన్‌లో చేరేలా ప్రేరేపించాయి. పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజీలో  చదువుకున్నారు. తరువాత దేశానికి తిరిగొచ్చి ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్‌లో పనిచేశారు. 

సరళా థక్రాల్: 1914లో జన్మించిన సరళా  థక్రాల్‌ 1936లో తన 21వ ఏట ఏవియేషన్ పైలట్ లైసెన్స్‌ని పొంది భారతదేశపు తొలి మహిళా పైలట్‌గా అవతరించారు. భారతదేశంలో చీర కట్టుకుని విమానం నడిపిన తొలి మహిళా పైలట్ థక్రాల్.  కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది పైలట్లు,  భర్త ఆమె కరియర్‌కు  తొలి ప్రేరణ. ఆమె ఫైలట్ మాత్రమే కాదు విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త కూడా, చిత్రకారుడు, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎన్నో అద్భుతాలు సృష్టించింది.  2008 మార్చి 15న మరణించారు. 

హరితా కౌర్ డియోల్: 1971లో జన్మించిన హరితా కౌర్ డియోల్, భారత వైమానిక దళం (IAF)లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళా పైలట్. 1992లో, రక్షణ మంత్రిత్వ శాఖ  నిబంధనల్లో మార్పులతో  మహిళలను పైలట్‌లుగా చేర్చుకోవడానికి వీలు కల్పించింది. 20వేల మందికి పోటీలో నిలబగా  ఎంపికైన 13 మందిలో  హరిత ఒకరు. ఆమె కర్ణాటకలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో , యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని ఎయిర్ లిఫ్ట్ ఫోర్సెస్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ALFTE)లో శిక్షణ పొందింది. సెప్టెంబర్ 2, 1994న, 22 సంవత్సరాల వయస్సులో, ఫ్లైట్ లెఫ్టినెంట్ హరితా కౌర్ డియోల్ అవ్రో HS-748లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది.

శాంతి టిగ్గా: పశ్చిమ బెంగాల్‌లోని  జల్‌పైగురి జిల్లాలో ఆదివాసీ వర్గానికి చెందిన శాంతి టిగ్గా, బాల్య వివాహాల బాధితురాలు. ఇద్దరు పిల్లల వితంతువు తల్లి, భారత సైన్యంలో తొలి మహిళా జవాన్‌గా అవతరించారు ఆర్మీలో చేరి, సైన్య దుస్తులు ధరించాలనేది ఆమె కల. సాయుధ దళాల రిక్రూట్‌మెంట్ శిక్షణా శిబిరంలో ఆమె తన పురుష సహచరులను అధిగమించి, 1.5 కి.మీ పరుగును ఐదు సెకన్ల వేగంతో, 50 మీటర్ల పరుగును 12 సెకన్లలో పూర్తి  చేసి పలువురి మన్ననలు పొందారు.

తుపాకీ నిర్వహణలో కూడా నైపుణ్యంతో ఆకట్టుకుంది . ఉత్తమ ట్రైనీ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె అసాధారణ విజయాలకు గానీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ఆమెను సత్కరించారు. కానీ దురదృష్టవశత్తూ    2013లో గుర్తుతెలియని  వ్యక్తులు ఆమె కిడ్నాప్‌ చేయడం టిగ్గా జీవితం విషాదకరమైన మలుపు తిరిగింది. ఆమె కళ్లకు గంతలు కట్టి, రైల్వే ట్రాక్‌కు కట్టిపడేశారు. ఆమెను గుర్తించి  ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆ తరువాత ఆమె ఉరివేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతారు. 

భావనా కాంత్ : భావానా కాంత్ విమానయాన రంగంలో గణనీయమైన పురోగతి సాధించిన గొప్ప భారతీయ మహిళ. డిసెంబర్ 1, 1987న బీహార్‌లోని దర్భంగాలో జన్మించిన ఈమె 2016లో భారత వైమానిక దళం (IAF)లో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా అవతరించింది. ఈమె జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఫైటర్ పైలట్‌గా మారేందుకు  అనేక సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొంది.అయినా లక్ష్యంపై దృష్టి. శిక్షణను పూర్తి చేసి తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. 

అడ్డంకులను, వివక్షల్ని ఎదుర్కొని, పట్టుదలతో విజయం సాధించిన ఇలాంటి మహిళలు కోకొల్లలు. అడ్డంకుల గోడల్న బద్దలుకొట్టి విజయపతాకాల్ని ఎగురవేసిన ఈ ధీర వనితలు మహిళా లోక బంగారు భవితకు బాటలు వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి విజయాలే యావత్‌ ప్రపంచ మహిళలకు స్పూర్తి,  ప్రేరణ.  దీన్ని అందిపుచ్చుకొని   సాగడమే నేటి తరం మహిళల బాధ్యత. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement