సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో మహిళలు కదంతొక్కారు. వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి స్ఫూర్తితో మేము సైతం.. అంటూ సమైక్య శంఖం పూరించారు. తాము తలచుకుంటే ఏమైనా సాధిస్తామని.. సత్తాచాటుతామని విభజనవాదులను హెచ్చరించారు. హనుమాన్‌జంక్షన్‌లో శుక్రవారం రెండువేల మందికి పైగా మహిళలు భారీ ర్యాలీ చేశారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. దాదాపు ప్రతి ఊళ్లోనూ నారీమణులు ముందువరుసలో నిలిచారు.. సమైక్య సమరభేరి మోగించారు.
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. మానవహారాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్యక్రమాలతో శుక్రవారం అన్ని ప్రాంతాలు అట్టుడికాయి. హనుమాన్‌జంక్షన్‌లో రెండు వేల మంది మహిళలు సమైక్య మహిళా శంఖారావం పేరిట భారీ ర్యాలీ చేశారు. కాకాని భవన్ నుంచి మొదలైన ర్యాలీ సెంటర్ వరకు సాగింది. అక్కడ భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మానవహారం నిర్మించారు. జగయ్యపేట నియోజకవర్గంలోని పేట, పెనుగంచిప్రోలు మండలాల్లో జేఏసీ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
పట్టణంలోని పాత మున్సిపల్ సెంటర్‌లో పండ్ల వ్యాపారులు రిలే నిరహారదీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడో రోజు కొనసాగాయి. మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో గ్రామస్తులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ సంఘీభావం తెలిపింది.
మైలవరం సెంటర్‌లో వంటావార్పు నిర్వహించారు. గుడివాడలో జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న రిలేదీక్షలో స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగులు, టీచర్లు వేర్వేరుగా రిలే దీక్షలు చేపట్టారు. పామర్రు నాలుగు రోడ్ల సెంటర్లో రాపర్ల గ్రామ సర్పంచి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 31వ రోజుకు చేరాయి.
తాలూకా సెంటర్‌లో ఎన్జీవోల దీక్షలు 24వ రోజుకు చేరాయి. వీరికి మద్దతుగా బార్ అసోసియేషన్ సభ్యులు రిలే దీక్షలు చేశారు. శిబిరం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూజివీడులో ఆర్టీసీ, గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లిలో జేఏసీ నేతలు రహదారులు శుభ్రం చేసి నిరసన తెలిపారు. చల్లపల్లిలో ఎయిడెడ్ పాఠశాల సిబ్బంది విధులు బహిష్కరించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలంటూ అవనిగడ్డలో జరిగిన సర్వమత ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. కోడూరులో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఘంటసాలలో డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు.
బెజవాడలో..
విజయవాడలోని కెనాల్ గెస్ట్‌హౌస్ సమీపంలో పలు ఉద్యోగ సంఘాలు సర్వమత ప్రార్థనలు నిర్వహించాయి. వన్‌టౌన్‌లో బీసీ సంఘాలు చేపట్టిన రిలే నిరహారదీక్షల్లో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. చిట్టినగర్‌లో రాజకీయ జేఏసీ తలపెట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వన్‌టౌన్ నెహ్రూబొమ్మ సెంటర్‌లో క్రీడాకారుడు రవికిరణ్, సింగ్‌నగర్‌లో వైఎస్సార్ సీపీ నాయకుడు సరగడ శ్రీనివాసరెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. పాత బస్టాండ్ వద్ద దేవాదాయ శాఖ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. శ్రీ దుర్గా మలేశ్వరస్వామి దేవస్థానం ఆల్‌క్యాడర్ ఎంప్లాయిస్ యూనియన్ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగాయి. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సబ్ కలెక్టర్ కార్యాలం వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
జంక్షన్‌లో ఉద్యమించిన మహిళాశక్తి
Published Sat, Sep 7 2013 3:22 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement