Advertising Standards Council Latest Report On Influencers In Social Media - Sakshi
Sakshi News home page

ఫాలోవర్లపై ప్రభావం చూపుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు.. 79 శాతం మంది కొనేందుకు రెడీ!

Published Tue, Feb 21 2023 3:27 AM | Last Updated on Tue, Feb 21 2023 3:52 PM

Advertising Standards Council Latest Report On Influencers In Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తమ కంటెంట్‌తో లక్షలాది మంది నెటిజన్లను ‘ఫాలోవర్లు’గా మార్చుకుంటున్న వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. విషయ పరిజ్ఞానం, చలాకీ మాటలతో విజ్ఞానం, వినోదం అందిస్తూనే వివిధ సంస్థల ఉత్పత్తులను ప్రచారం చేస్తూ వాటిని కొనేలా ‘ఫాలోవర్ల’ను ప్రభావితం చేస్తున్నారు. ఉత్పత్తుల తయారీ సంస్థలకు కొనుగోళ్లు పెంచడంలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్ర నిర్ణయాత్మకంగా మారుతోందని అడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 

79% మందిలో నమ్మకం... 
దేశంలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేస్తున్న వస్తువులను కొనేందుకు 70 శాతం మంది ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ ట్రస్ట్‌ రిపోర్ట్‌’పేరిట 18 ఏళ్లకు పైబడిన వారిపై నిర్వహించిన ఈ సర్వేలో తాము ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు చెబుతున్న విషయాలను విశ్వసిస్తున్నట్లు 79 శాతం మంది పేర్కొన్నారు. వారిలో 30 శాతమైతే సంపూర్ణంగా నమ్ముతున్నట్లు తెలపగా 49 శాతం మంది ఎంతో కొంత విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు. 

నివేదికలోని ముఖ్యాంశాలు... 
►సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎండార్స్‌ చేసిన వస్తువుల్లో కనీసం ఒకటైనా కొనుగోలు చేశామన్న 90 శాతం మంది నెటిజన్లు. 

►వారు సూచించిన లేదా పేర్కొన్న ఉత్పత్తుల్లో మూడుకన్నా ఎక్కువే కొంటున్నామన్న వారు 61 శాతం (25 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వారు). 

►ఇన్‌ఫ్లుయెన్సర్లు పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించడంతోపాటు ఆయా బ్రాండ్లతో తమకున్న సంబంధాల గురించి దాచకుండా బయటపెట్టినప్పుడే వినియోగదారులు వారిని విశ్వసిస్తున్నారు.

►సెలబ్రిటీలుగా, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా వారు గడిపే జీవనశైలి, వ్యక్తిగత జీవితం, అనుభవాలు కస్టమర్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. 

►ఒకవేళ ఇన్‌ఫ్లుయెన్సర్లలో విశ్వసనీయత కొరవడితే వారిని ‘ఫాలోవర్లు’నమ్మే పరిస్థితి లేదు. 

ఫిర్యాదులు సైతం ఉన్నాయి... 
వివిధ బ్రాండ్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు సంబంధించి ఆస్కికి 2,767 ఫిర్యాదులు (2021–22లో 1,592, 2021–22 ఏప్రిల్‌–డిసెంబర్‌ల మధ్య 1,175) అందాయి. ఇందులో వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్, పర్సన్‌కేర్‌ వంటి అంశాలపై వినియోగదారుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో ఆయా సంస్థలు, ఉత్పత్తులతో ఉన్న అనుబంధం, ఇతర అంశాలను తెలియజేయాలంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లను 2021 మేలో ఏఎస్‌సీఐ కోరింది. 

500 కోట్ల నెటిజన్లు..  
ప్రపంచంలోని సగం జనాభాకు పైగా... అంటే దాదాపు 500 కోట్ల మంది సోషల్‌ మీడియాలోని ఏదో ఒక వేదికపై యాక్టివ్‌గా ఉన్నారు. 2027కల్లా ఈ సంఖ్య 600 కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. 

పనిచేస్తున్న మార్కెటింగ్‌ వ్యూహాలు 
సోషల్‌ మీడియాలో ప్రముఖ వ్యక్తులు ఉపయోగిస్తున్న లేదా ప్రచారం చేస్తున్న వస్తువులను ‘ఫాలోవర్లు’కొనుగోలు చేసేలా చేయడంలో మార్కెటింగ్‌ వ్యూహాలు బాగా పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అందుబాటులోకి వచ్చాక ఎవరూ వ్యక్తిగతంగా షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నచ్చిన ఉత్పత్తులను ఉన్న చోటు నుంచే వెతికి కొనుగోలు చేయడం నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతోంది. 
– సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement