‘నెట్‌వర్క్’ ప్రకటనలపై ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ‘అధికారికంగా’ అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్ ప్రకటనల విషయంలో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇవి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆస్కీ ఆక్షేపించింది. ఏప్రిల్ 11లో ఈ ప్రకటనలను మార్చాలని లేదా ఉపసంహరించాలని సూచించింది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ అత్యంత వేగవంతమైనదంటూ కన్సల్టెన్సీ సంస్థ ఊక్లా ఇచ్చిన సర్టిఫికెట్‌కు ఊతంగా సరైన ఆధారాలేమీ లేవని ఆస్కీ ఫాస్ట్ ట్రాక్ కంప్లయింట్స్ కమిటీ (ఎఫ్‌టీసీసీ) అభిప్రాయపడింది.
ఎయిర్‌టెల్ ప్రకటనలపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఫిర్యాదును సమర్ధిస్తూ ఎఫ్‌టీసీసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్‌టెల్ ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఎఫ్‌టీసీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. దీనిపై అప్పీలు చేయనున్నట్లు వివరించింది. మొబైల్ స్పీడ్ టెస్టులు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఊక్లా నిర్ధారించిన వాస్తవిక అంశాల అధారంగానే తమ ప్రకటనలు రూపొందించినట్లు, ఆ వివరాలు ఆస్కీకి కూడా సమర్పించినట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది.