ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ (RMG) కంపెనీలకు పన్ను అధికారులు భారీ షాక్ ఇచ్చారు. రూ. 55 వేల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ పలు కంపెనీలకు ప్రీ-షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దేశంలో అత్యంత విలువైన పరోక్ష పన్ను నోటీసు అని భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.66,500 కోట్ల విలువైన ఫాంటసీ స్పోర్ట్స్ మేజర్ డ్రీమ్11కి రూ. 25 వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులు అందించడం కలకలం రేపింది. ఈ షో కాజ్ నోటీసు నేపథ్యంలో డ్రీమ్11 బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ అనేక ఇతర ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు సుమారు రూ. 55,000 కోట్ల పన్ను డిమాండ్‌ను పెంచుతూ ప్రీ-షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో, ముంబైకి చెందిన వ్యాపారవేత్త హర్ష్ జైన్, అతని స్నేహితుడు కో-ఫౌండర్ భవిత్ షేత్‌కు చెందిన డ్రీమ్11కి రూ. 25000 కోట్ల అతిపెద్ద నోటీసు ఇవ్వడం కలకలం రేపింది. వాస్తవానికి ఇది దాదాపు రూ. 40,000 కోట్లుకు పై మాటేనని పలు మీడియాలు నివేదించాయి. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి డ్రీమ్ స్పోర్ట్స్ నిరాకరించింది. డ్రీమ్ 11కు హర్ష్ సీఈవోగా, భవిత్ సీఓఓగా ఉన్నారు. ఇక ప్లే గేమ్స్24x7 రూ. 20,000 కోట్లు, హెడ్ డిజిటల్ వర్క్స్ రూ. 5,000 కోట్లు మేర ఎగవేసినట్టుగా నోటీసులందాయి.
తాజా పరిణామంతో డ్రీమ్ 11 (స్పోర్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్) మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ ఈ షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. డ్రీమ్11 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,841 కోట్ల నిర్వహణ ఆదాయంపై రూ.142 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
మరోవైపు రూ. 21,000 కోట్ల మేర పన్ను ఎగవేతకు ఆరోపణలెదుర్కొంటున్న గేమ్స్‌క్రాఫ్ట్ కేసులో జీఎస్టీ నోటీసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై రానున్న వారాల్లో సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. అంతేకాదు పన్ను ఎగవేత ఆరోపణలపై 40కి పైగా స్కిల్-గేమింగ్ కంపెనీలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ (CBIC) షోకాజ్ నోటీసులు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమీక్షలో ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్స్‌పై జీఎస్టీని18 శాతంనుంచి 28 శాతానికి పెంచింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని కౌన్సిల్, అక్టోబర్ 1, 2023 నాటికి కొత్త పన్ను రేట్లను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది. ఈ నిర్ణయాన్ని అమలును ఆరు నెలల తర్వాత సమీక్షించడానికి కూడా అంగీకరించింది.
అలాగే ఆగస్ట్ 11న వర్షాకాల సమావేశాల చివరి రోజు, ఆర్థిక మంత్రి సీతారామన్ సీజీఎస్‌టీ చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం తరువాత దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆగస్టు 19న సవరణలకు ఆమోదం తెలిపారు. తదనంతరం, హర్యానా, గోవా, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర GST చట్టాలకు ఇదే విధమైన సవరణలను ఆమోదించాయి.
Comments
Please login to add a commentAdd a comment