కొంటే 'కార్డు'తోనే కొనాలి | Buy with cards only | Sakshi
Sakshi News home page

కొంటే 'కార్డు'తోనే కొనాలి

Published Mon, Sep 21 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

కొంటే 'కార్డు'తోనే కొనాలి

కొంటే 'కార్డు'తోనే కొనాలి

కొనుగోళ్లకు కొత్త శక్తినిస్తున్న కో-బ్రాండెడ్   
భాగస్వామ్యాలతో క్రెడిట్ కార్డులు తెస్తున్న బ్యాంకులు

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల్లో ప్రధానంగా మూడు పక్షాలుంటాయి. ఒకటి... కార్డు ఇచ్చిన బ్యాంకు కాగా, రెండోది వీసా, మాస్టర్‌కార్డ్ లేదా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రాసెసింగ్ నెట్‌వర్క్, మూడోది ఎయిర్‌లైన్స్, రిటైల్ చైన్, చమురు కంపెనీలు, ఆన్‌లైన్ షాపింగ్ సైట్ వంటి వాల్యూ యాడింగ్ భాగస్వామి.

 
ఎయిర్ ట్రావెల్, ఇంధనం, ఈ-కామర్స్ రంగాల్లో వినియోగం
క్రెడిట్ కార్డులిపుడు తేలిగ్గానే దొరుకుతున్నాయి. దీంతో చాలామంది ఒకటికన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకోవటానికి మొగ్గు చూపుతున్నారు. కాకపోతే ఒక చిక్కుంది. ఎన్ని క్రెడిట్ కార్డులున్నా ఒక నెలలో ఒక కార్డు ఇస్తున్న లిమిట్‌ను మించి ఖర్చు చేయటం చాలామందికి కుదరదు. ఉదాహరణకు మహేష్ దగ్గర నాలుగు క్రెడిట్ కార్డులున్నాయి. ప్రతి కార్డు లిమిట్ కూడా లక్ష రూపాయల పైనే ఉంది. ఒక నెలలో లక్ష రూపాయలకు మించి క్రెడిట్ కార్డుపై కొనుగోళ్లు చేయటమనేది మహేష్‌కు అసాధ్యం. దాంతో... ‘ఇన్ని కార్డులెందుకు? ఒకటి సరిపోతుంది కదా!’ అనుకుని మూడు కార్డుల్ని వెనక్కిచ్చేశాడు కూడా. కాకపోతే ఇపుడా పరిస్థితి మారింది. ఎందుకంటే ఆకర్షణీయంగా ఉండటం కోసం దాదాపు ప్రతి బ్యాంకూ ఏదో ఒక సంస్థతోనో, బ్రాండ్‌తోనో ఒప్పందం పెట్టుకుని మరీ కో-బ్రాండెడ్ కార్డుల్ని తెస్తోంది. దీంతో పెట్రోల్‌కు, ఆన్‌లైన్ షాపింగ్‌కు, ట్రావెల్ అవసరాలకు... ఇలా అవసరాన్ని బట్టి ఎక్కువ కార్డులు తీసుకోవటం తప్పనిసరి అవుతోంది.
 
శేఖర్‌ది హైదరాబాద్. బిజినెస్ పనిమీద నెలకు కనీసం మూడు సార్లయినా ఢిల్లీ వెళ్లి వస్తుంటాడు. ప్రతిసారీ విమానం టిక్కెట్ల దగ్గర తిరకాసే. ట్రావెల్ ఏజెంట్లకు చెబితే రేటెక్కువ. ఆన్‌లైన్ బుకింగే నయం. కాకపోతే ప్రతి సారీ రెండుమూడు రోజుల ముందే షెడ్యూలు ఖరారవుతుంది. కాబట్టి టిక్కెట్ రేట్లు ఎక్కువ. అయితే... హెచ్‌డీఎఫ్‌సీలో ఖాతా ఉన్న శేఖర్‌కు ‘జెట్ ప్రివిలేజ్ హెచ్‌డీఎఫ్‌సీ ప్లాటినం’ క్రెడిట్ కార్డు ఇస్తామంటూ బ్యాంకు వాళ్లు ఫోన్ చేశారు. ఆ కార్డు గురించి అంతా తెలుసుకున్నాక... అదే తనకు సూటవుతుందనిపించింది. ఎందుకంటే ఏడాదికి దాదాపు రూ.3 లక్షలు విమానం టిక్కెట్లకే ఖర్చు చేస్తున్నాడు. ఈ కార్డు తీసుకుంటే జెట్ ఎయిర్‌వేస్ టిక్కెట్లలో 5 శాతం డిస్కౌంట్ వస్తుంది. దానికితోడు ట్రావెల్ మైల్స్ జతవుతుంటాయి. వీటిని టిక్కెట్లుగా మార్చుకోవచ్చు కూడా. ఇంకేం! కార్డు తీసుకున్నాడు. ఆ నిర్ణయం శేఖర్ జేబుకు బాగానే ఆదా చేసింది.
 
సుధీర్‌కు కారు వాడకం ఎక్కువ. నెలకు కనీసం 3వేల కిలోమీటర్లు తిరుగుతుంటాడు. దీనికోసం నెలకు రూ.10వేల వరకూ పెట్రోల్‌పై వెచ్చిస్తుంటాడు. సుధీర్ భార్య కూడా కారు వాడుతుంది. ఆమెకూ ఒక మోస్తరుగా పెట్రోల్ ఖర్చవుతుంది. పెట్రోల్ బంకుల్లో డిస్కౌంట్ ఉండదు కదా!! కాకపోతే అనుకోని వరంలా సుధీర్‌కు సిటీ బ్యాంక్ ‘ఇండియన్ ఆయిల్’ క్రెడిట్ కార్డును ఆఫర్ చేసింది. ఐఓసీ బంకుల్లో పెట్రోలు కొట్టించినపుడల్లా ప్రతి రూ.150కి నాలుగు పాయింట్లు జమ కూడటం తనకు బాగానే కలిసొచ్చింది. ఎందుకంటే 4 పాయింట్లంటే 4 రూపాయలు. వెయ్యి పాయింట్లు దాటినపుడల్లా నేరుగా అంత మేర పెట్రోల్ కొట్టించటం మొదలెట్టాడు. పెపైచ్చు ఆ కార్డుపై ఇతరత్రా షాపింగ్ చేసినా కొన్ని పాయింట్లు జమవుతున్నాయి. అన్నీ కలిస్తే పెట్రోల్‌తో సహా సుధీర్ ఖర్చులపై కనీసం 3 శాతం వెనక్కు వస్తోంది. ఇదంతా... కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల పవర్
 
చాలా లాభాలు...  కానీ జాగ్రత్త!!

- మామూలు క్రెడిట్ కార్డును వినియోగించటం కన్నా... కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును వినియోగిస్తే లాభమే.
- ఇలాంటి కార్డును తీసుకునేముందు మన అవసరమేంటో చూడాలి. మనకు తగ్గ కార్డును మాత్రమే ఎంచుకోవాలి.
- తరచూ విమాన ప్రయాణాలు చేసేవారైతే ఎయిర్‌లైన్ కార్డును ఎంచుకోవచ్చు. కానీ ఏడాదికోసారి విమానంలో ప్రయాణించేటట్లయితే అలాంటి కార్డును ఎంచుకోవటం వల్ల లాభమేమీ ఉండదు. పెపైచ్చు వార్షిక చార్జీల మోత తప్పదు.
- ఒకే ఈ కామర్స్ సంస్థతో ఒప్పందం ఉన్న కార్డుకన్నా... ఎక్కువ సంస్థలతో ఒప్పందం ఉన్న కార్డులు ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే మన ముందు ఎక్కువ ఆప్షన్లుంటాయి.
- సిటీ బ్యాంక్ వంటి బ్యాంకులు కొందరు కస్టమర్లకు వార్షిక చార్జీలేవీ లేకుండానే కో-బ్రాండెడ్ కార్డులు అందిస్తున్నాయి. ఇవి మంచివే. ఎందుకంటే ఏ నిర్వహణ చార్జీలూ లేకపోవటంతో పాటు మనం చేసే ఖర్చులపై కొంత డబ్బు వెనక్కి వస్తుంటుంది.
- ఒకసారి గనక మీరు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌లోకి ప్రవేశిస్తే... మీ డేటా మొత్తం సదరు ప్లాట్‌ఫామ్‌పై ఇతర సంస్థలకు షేరింగ్ చెయ్యటం జరుగుతుంది. వాళ్లు టార్గెట్ అడ్వర్టయిజింగ్ పేరిట మీ అభిరుచులు, అలవాట్లకు తగ్గ ఉత్పత్తుల వివరాలను ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. ఇది కొంత మంచిదే అయినా... ఈ ప్రచారం విసిగించే స్థాయిలో కూడా ఉంటుంది.
- మామూలు కార్డులకన్నా కో-బ్రాండెడ్ కార్డులపై వడ్డీ రేటు, ఎంట్రీ ఫీజులు, లేటు ఫీజులు బాగా ఎక్కువగా ఉంటాయి. వీటి గురించి ముందే తెలుసుకోవాలి.
- కో-బ్రాండెడ్ బోనస్‌లు, పాయింట్లకు నిర్ణీత కాలం ఉంటుంది. ఆ లోగా రిడెంప్షన్ చేసుకోకుంటే మురిగిపోతాయి.
 
ఏముంటుంది ఈ కార్డుల్లో?
‘‘ఆన్‌లైన్ రిటెయిలింగ్ నుంచి ట్యాక్సీ అద్దెకు తీసుకోవటం, సినిమా టికెట్లు, ఎయిర్ టికెట్లు, ఫుడ్ డెలివరీ మార్కెట్ ప్లేస్ వంటి అన్నిటినీ కవర్ చేస్తూ ఒక కార్డు తేవాలన్న ఆలోచనే ఈ సింప్లీ క్లిక్ కార్డుకు పునాది’’ అనేది ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్ సీఈఓ విజయ్ జాషువా అభిప్రాయం. ఒకే కార్డుపై వినియోగదారుడికి అన్ని ఆప్షన్లూ ఇవ్వటమే తమ ఉద్దేశమంటారాయన. ఈ కార్డుకు రూ.499 ఎంట్రీ ఫీజుతో పాటు రూ.499 వార్షిక రుసుం కూడా ఉంది. అయితే ఏడాదికి రూ.లక్ష, లేదా అంతకు మించి కొనుగోళ్లు చేస్తే వార్షిక రుసుం ఉండదు. ఇక రివార్డు పాయింట్ల విషయానికొస్తే ఇతర ఆన్‌లైన్ సైట్లలో షాపింగ్ చేస్తే రూ.100కి 5 పాయింట్లు, ఈ భాగస్వామ్య సైట్లలో షాపింగ్ చేస్తే 10 పాయింట్లు వస్తాయని ఆయన తెలియజేశారు. ప్రతి పాయింట్ విలువ 25 పైసలు. అంటే 1.25 శాతం నగదు వెనక్కి వస్తున్నట్లే లెక్క!!.
 
ఈ-కామర్స్ జోరు..

కో-బ్రాండెడ్ కార్డులకిపుడు ఆన్‌లైన్ ప్రధాన వేదికగా మారుతోంది. బ్యాంకులు కూడా దీన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఉదాహరణకు ఈ నెల 15న ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏడు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం పెట్టుకుని ‘సింప్లీ క్లిక్’ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. అంటే ఆ ఏడు సైట్లలో ఈ కార్డుతో షాపింగ్ చేస్తే చక్కని డిస్కౌంట్లు సొంతమవుతాయన్న మాట. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా గత నెలలో స్నాప్‌డీల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం పెట్టుకుని కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది.
 
డిజిటల్ బ్యాంకింగ్‌పై ఇటీవల ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఒక నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం... మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవటానికి ఆన్‌లైన్ సైట్లతో ఒప్పందం పెట్టుకోవటమనేది బ్యాంకుల వ్యూహంగా మారింది. ‘‘ఇప్పుడు ఇండియాలో ఈ-కామర్స్ బూమ్ నడుస్తోంది. కాబట్టి కొత్త కస్టమర్లను చేరడానికి బ్యాంకులు దీన్నో మార్గంగా ఎంచుకుంటున్నాయి. దానివల్ల ఆ ఈ-కామర్స్ సైట్లలో సదరు బ్యాంకుకు సంబంధించిన ప్రకటనలు రెగ్యులర్‌గా వస్తుంటాయి. పెపైచ్చు ఉత్పత్తుల్ని కలిసి ఆఫర్ చేస్తారు. ఇది బ్యాంకులకు రెండు రకాలుగానూ లాభమే’’ అని నివేదికలో వివరించారు. స్నాప్‌డీల్-హెచ్‌డీఎఫ్‌సీ కార్డు చూస్తే... దీనికోసం స్నాప్‌డీల్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మూడేళ్ల ఒప్పందం చేసుకుంది. దీనివల్ల స్నాప్‌డీల్‌కు కస్టమర్లతో పాటు కొనుగోళ్లూ పెరుగుతాయి. హెచ్‌డీఎఫ్‌సీకి గ్రామీణ ప్రాంతాల్లో సైతం కార్డు వినియోగదారులు పెరుగుతారు. వారి కొనుగోళ్ల వల్ల బ్యాంకు లావాదేవీలూ పెరుగుతాయి’’ అని తెలియజేశారు.
 
ఇవీ... కొన్ని కో-బ్రాండెడ్ కార్డులు
ఎస్‌బీఐ సింప్లీ క్లిక్: అమెజాన్, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఫ్యాబ్ ఫర్నిష్, ఫుడ్ పాండా, లెన్స్‌కార్ట్, ఓలా క్యాబ్స్‌తో ఒప్పందం పెట్టుకుని ఎస్‌బీఐ ఈ కార్డును తెచ్చింది.
ఎస్‌బీఐ: ఐఆర్‌సీటీసీతో కలసి కార్డు తెచ్చింది. కాకపోతే కార్డుదారు స్వయంగా ప్రయాణించినపుడే ఈ బోనస్ పాయింట్లు లభిస్తాయి.
హెచ్‌డీఎఫ్‌సీ: జెట్ ప్రివిలేజ్ ప్లాటినం క్రెడిట్ కార్డును తెచ్చింది. దీంతో షాపింగ్ చేస్తే జేపీ మైల్స్ జతవుతాయి. జెట్‌ఎయిర్‌వేస్ సైట్లో టికెట్లు కొంటే ఎక్కువ పాయింట్లొస్తాయి. ఇంకా స్నాప్‌డీల్‌తో ఒప్పందం పెట్టుకుని ఈ బ్యాంకు మరో కార్డును కూడా మార్కెట్లోకి తెచ్చింది.
సిటీబ్యాంక్: ఇండియన్ ఆయిల్ పేరిట కార్డును తెచ్చింది. ఈ కార్డుతో ఐఓసీ ఔట్‌లెట్లలో పెట్రో లు, డీజిల్ పోయించుకుంటే ప్రతి రూ.150కి 4 పాయింట్లు వస్తాయి. పాయింట్ విలువ రూపాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్: జెట్ ఎయిర్‌వేస్ కో- బ్రాండెడ్ కార్డు. దీనిపై కొన్ని రకాల ఖర్చులు చేసినపుడు రూ.100కి గరిష్టంగా 16 జీపీ మైల్స్‌ను పొందవచ్చు.
ఇండస్ ఇండ్: ఒబెరాయ్ హోటల్స్, జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి పినాకిల్ కార్డు తెచ్చింది. దీని ప్రవేశ రుసుం రూ.లక్ష.
హెచ్‌ఎస్‌బీసీ: మేక్ మై ట్రిప్‌తో కలసి కార్డు తెచ్చింది. దీన్ని తీసుకునేటపుడు ఉచిత ఎయిర్ టికెట్లు బోనస్‌గా ఇస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement