న్యూఢిల్లీ: మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు రేసు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. థాయిలాండ్‌కు చెందిన చరోన్ పోక్‌పాండ్ (సీపీ) గ్రూపు సైతం రంగంలోకి వచ్చింది. అలాగే, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ (విప్రో ప్రేమ్‌జీ సొంత పెట్టుబడుల సంస్థ), ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ కూడా రేసులో ఉన్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ కూడా పోటీ పడుతున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి.
జర్మనీకి చెందిన రిటైలర్ మెట్రో ఏజీ.. భారత్‌లోని తన ఆస్తులను విక్రయానికి పెట్టడం తెలిసిందే. ఇక 1–1.5 బిలియన్ డాలర్లతో మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు అవకాశాలను టాటా గ్రూపు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ బెయిన్ క్యాపిటల్ మదింపు వేస్తున్నట్టు సమాచారం. ఫ్లిప్‌కార్ట్–వాల్‌మార్ట్, డీమార్ట్, అమెజాన్ ఈ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టేనని తాజా సమాచారం. ఈ వారంలోనే నాన్‌బైండింగ్ ఆఫర్లను సమర్పించాల్సి ఉంటుంది. నాన్ బైండింగ్ ఆఫర్లు వచ్చిన తర్వాత ఆయా సంస్థలతో మెట్రో ఏజీ చర్చలు నిర్వహించనుంది.
ఇందుకు రెండు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు అనుకున్నంత ఆశావహంగా లేకపోవడంతో మెట్రో ఏజీ తన ఆస్తులను విక్రయించి వెళ్లిపోవాలని అనుకుంటుండడం తెలిసిందే. పదికి పైగా సంస్థలు తొలుత ఆసక్తి చూపించగా.. అధిక పోటీ కారణంగా కొన్ని సంస్థలు ముందే తప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ సహా సుమారు పది సంస్థలు పోటీ పడుతున్నట్టు తొలుత పేర్లు వినిపించడం గమనార్హం. ‘‘మా విధానం ప్రకారం మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలపై స్పందించం. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను మదింపు వేస్తూనే ఉంటుంది’’అని రిలయన్స్ రిటైల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment