
డీటీహెచ్ బిజినెస్‌లను కలిపేందుకు చర్చలు
షేర్ల మార్పిడి ద్వారా డీల్!
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పోటీకి సై
ముంబై: ప్రయివేట్ రంగ కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్ చేతులు కలపనున్నాయి. తద్వారా నష్టాలలో ఉన్న డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్‌లను ఒకటి చేస్తున్నాయి. ఈ అంశంపై భారతీ ఎయిర్‌టెల్ తాజాగా స్టాక్ ఎక్సే్ఛంజీలకు సమాచారమిచ్చింది. శాటిలైట్, కేబుల్ టీవీ సర్వీసుల భారతీ టెలీమీడియా, టాటా ప్లే(గతంలో టాటా స్కై) విలీనానికి వీలుగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు వీలుగా షేర్ల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి.
ఇటీవల కొంతకాలంగా దేశీ వినియోగదారుల అభిరుచి కేబుళ్ల నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌వైపు మళ్లుతోంది. ఓటీటీల కారణంగా డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది. కొద్ది రోజులుగా లైసెన్స్ ఫీజు తగ్గింపునకు డీటీహెచ్ సంస్థలు అభ్యర్థిస్తున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రస్తుత 8 శాతం ఫీజును ఏజీఆర్‌లో 3 శాతానికి తగ్గించేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2027 చివరికల్లా ఫీజును ఎత్తివేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
డీటీహెచ్ యూజర్లు @ 6 కోట్లు
తాజా డీల్ నేపథ్యంలో టాటా ప్లేకున్న 1.9 కోట్ల గృహాలతో ఎయిర్‌టెల్ కనెక్ట్ అయ్యేందుకు వీలు చిక్కనుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ సైతం 1.58 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉంది. దీంతో టెలికం, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ సర్వీసులను కలిపి ట్రిపుల్ ప్లే వ్యూహాన్ని అమలు చేసేందుకు అవకాశముంటుంది. ఓవైపు రిలయన్స్ జియో టెలికం, బ్రాడ్‌బ్యాండ్, కంటెంట్‌లతో ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ సమీకృత సేవలవైపు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
దేశీయంగా ప్రస్తుతం డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు. ట్రాయ్ వివరాల ప్రకారం 2024 జూన్‌లో ఈ సంఖ్య 6.22 కోట్లుగా నమోదైంది. మొబైలేతర విభాగ ఆదాయాన్ని పెంచుకునే బాటలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కన్వర్జెన్స్‌పై దృష్టి పెట్టింది. దేశీయంగా డీటీహెచ్ సేవలలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న టాటా ప్లే గతంలో గ్లోబల్ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ న్యూస్ కార్ప్‌తో భాగస్వామ్య సంస్థ(టాటా స్కై)ను ఏర్పాటు చేసింది. అయితే 2019లో మర్డోక్ సంస్థ ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్‌ను వాల్ట్ డిస్నీ కొనుగోలు చేయడంతో భాగస్వామ్య వాటా చేతులు మారింది.
ఇతర డీల్స్...
ఎయిర్‌టెల్, టాటా ప్లే మధ్య డీల్ కుదిరితే డీటీహెచ్ రంగంలో రెండో అతిపెద్ద ఒప్పందంగా నిలవవచ్చు. ఇంతక్రితం 2016లో డిష్ టీవీ, వీడియోకాన్ డీ2హెచ్ విలీనమైన విషయం విదితమే. అయితే ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ ఇండియా, వయాకామ్18 విలీనమయ్యాయి. ఫలితంగా జియోస్టార్ బ్రాండుతో దేశీయంగా అతిపెద్ద మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ఆవిర్భవించింది. వీటి సంయుక్త ఆదాయం 2024లో రూ. 26,000 కోట్లుగా నమోదుకావడం గమనార్హం! 2023–24లో భారతీ టెలీమీడియా రూ. 3,045 కోట్ల టర్నోవర్, రూ. 76 కోట్ల నికర నష్టం ప్రకటించింది.
ఇదే సమయంలో టాటా ప్లే నిర్వహణ ఆదాయం రూ. 4,305 కోట్లను తాకగా.. కన్సాలిడేటెడ్ నష్టం రూ. 354 కోట్లకు చేరింది. కాగా.. ఇంతక్రితం ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే సమాచార శాఖ కంపెనీ ఈక్విటీ నిర్మాణంలో సవరణలకు ఆదేశించడంతో లిస్టింగ్ కార్యాచరణను ఆలస్యం చేసింది. కంపెనీ ఆర్‌వోసీకి దాఖలు చేసిన తాజా సమాచారం ప్రకారం టాటా సన్స్ తదుపరి నెట్‌వర్క్ డిజిటల్ డి్రస్టిబ్యూషన్ సర్వీసెస్ ఎఫ్‌జెడ్ ఎల్‌ఎల్‌సీ, టీఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్.. విడిగా 20 శాతం వాటాలతో రెండో పెద్ద వాటాదారులుగా నిలుస్తున్నాయి. టాటా ప్లేలో బేట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్(మారిషస్) పీటీఈ సైతం 10 శాతం వాటా కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment