సాక్షి, హైదరాబాద్: పండుగల సీజన్ షాపింగ్ కళను సంతరించుకోనుంది. కరోనా భయంతో గత ఆరేడు నెలలుగా బయటకు వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు రానున్న పండుగల కోసం బయటకు వచ్చేందుకు ఉత్సుకతతో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్‌లాకింగ్ ప్రక్రియ మొదలై కొన్ని మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఆన్‌లైన్‌తో పాటు ప్రత్యక్షంగా షాపింగ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలోనే మొదలుకానున్న పండుగల సీజన్‌లో 80 శాతం భారతీయ వినియోగదారులు వివిధ వస్తువుల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్లు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్), లిట్మస్ వరల్డ్ (లిట్మస్ వరల్డ్ పీపుల్ పల్స్ ఇనిషియేటివ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అన్‌లాకింగ్ ఇండియన్ కన్జూమర్ సెంటిమెంట్ పోస్ట్ లాక్‌డౌన్’సర్వేలో వెల్లడైంది. సుదీర్ఘ కాలం పాటు ఇళ్లకే పరిమితం కావడంతో స్నేహితులు, బంధువులకు ఇచ్చేందుకు కానుకలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఉన్నా పండుగ కోసం వస్తువులు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. సర్వే చేసిన వారిలో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రథమ శ్రేణి (టైర్–1) నగరాల్లోని 80 శాతం మంది, ఆగ్రా, అమృత్‌సర్, చండీగఢ్ తదితర టైర్–2 సిటీల్లో 12 శాతం మందిని, ఔరంగాబాద్, జోధ్‌పూర్, గ్వాలియర్ తదితర టైర్–3 సిటీల్లో 8 శాతం మంది ఉన్నారు.
సర్వేలో ముఖ్యాంశాలు..
►3 నెలల్లోనే రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేసేందుకు 62 శాతం, ఆ తర్వాత కొనుగోలు చేసేందుకు 38 శాతం మొగ్గు
►టైర్–2, టైర్–3 సిటీల్లోని 75 శాతం మంది 3 నెలల్లోనే రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు.
ఏవి కొంటారు?
►53% మంది దుస్తులు, వస్త్రాలు, ఆహారపదార్థాలు, నిత్యావసరాల కొనుగోళ్లు
►31 శాతం మంది కన్జూమర్ డ్యూరబుల్స్/ఎలక్ట్రానిక్స్ కొనుగోలు
►25 శాతం మంది బ్యూటీ, వెల్‌నెస్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్
►24 శాతం మంది పాదరక్షలు, బూట్లు వంటివి కొనుగోలు
►18 శాతం స్పోర్ట్స్ గూడ్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్విప్‌మెంట్, బుక్స్
►17% ట్రావెల్/లీజర్/లైఫ్ స్టైల్ వస్తువులు
►12 శాతం ఫర్నిచర్, ఫర్నిషింగ్
►9 శాతం బంగారం, వాచ్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులు
కన్జూమర్ డ్యూరబుల్స్/ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు
►ఆన్‌లైన్‌లో కొనేందుకు 70 శాతం మంది మహిళల మొగ్గు
►స్వయంగా రిటైల్ స్టోర్లకు వెళ్లి కొంటా మంటున్న 60 శాతం పురుషులు
ఆన్‌లైన్ ప్రక్రియ మొదలయ్యాక షాపింగ్ ఇలా..
►45 ఏళ్లకు పైబడిన వారు 67 శాతం మంది ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు సిద్ధం
►64 శాతం పురుషులు ఆఫ్‌లైన్‌లో, 60 శాతం మహిళలు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు
►టైర్–2, టైర్–3 నగరాల్లో 75 శాతం మంది ఆఫ్‌లైన్‌లో కొనుగోలు
►టైర్–1 సిటీల్లోని వారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో సమానంగా షాపింగ్ చేస్తామని వెల్లడి
వివిధ వస్తువుల కొనుగోళ్లు ఇలా...
►జ్యూవెల్లరీ, వాచ్‌లు, ఇతర వస్తువులను రిటైల్ స్టోర్లలోనే కొనుగోలు చేస్తామన్న 70 శాతం మంది
►బ్యూటీ, వెల్‌నెస్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లను ఆన్‌లైన్‌లో కొంటామంటున్న 60 శాతం మహిళలు
►అన్ని నగరాలు, వయసుల వారు రిటైల్ స్టోర్లకే వెళ్లి బూట్లు, పాదరక్షలు కొనుగోలు చేస్తామన్న 70 శాతం
►స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్విప్‌మెంట్ ఆన్‌లైన్‌లో కొంటామన్న 67 శాతం మహిళలు, రిటైల్ స్టోర్లకు వెళ్తామన్న 62 శాతం పురుషులు
►ఫర్నిచర్, ఫర్నిషింగ్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలుకు 64 శాతం మహిళలు, రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు 61 శాతం పురుషులు సుముఖత.
Comments
Please login to add a commentAdd a comment