కార్పొరేట్ స్థాయిలో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ల అమ్మకం, కొనుగోళ్లు
‘చాలా ఏళ్ల నుంచి ఫ్లాట్‌లో ఉండి బోర్ కొట్టిందా.. విల్లా, డూప్లేకు మారాలనుకుంటున్నారా?’
‘రెండు పడకగదుల ఫ్లాట్ సరిపోవట్లేదు.. మూడు, ఆపైన ఫ్లాట్‌కు మారాలనుకుంటున్నారా?’
కాలానికి అనుగుణంగా నగరవాసుల కోర్కెలు కూడా మారుతుంటాయనడానికివే ఉదాహరణలు. కోరికలు సరే మరి వాటిని సాకారం చేసుకోవడం ఎలా? నగరంలో ఒకసారి సొంతిల్లు సమకూర్చుకోవడం అంటేనే కష్టం. మరి అలాంటిది ఫ్లాట్ నుంచి విల్లాకు, డూప్లేలకు మారడం అంటే నిజంగా కలే. అయితే ఇంతకాలం అసంఘటిత రంగంగా ఉన్న సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ల అమ్మకం, కొనుగోళ్లను ‘ట్రూ వ్యాల్యూ ప్రాపర్టీ’ పేరిట సంఘటిత పరిశ్రమగా చేసేందుకు పలు నిర్మాణ సంస్థలు సిద్ధమయ్యాయి. - సాక్షి, హైదరాబాద్
ట్రూ వ్యాల్యూ ప్రాపర్టీ సర్వీస్ అంటే సెకండ్ హ్యాండ్ ఇల్లు. మన పాత ఫ్లాట్‌ను ఇచ్చి మనకు కావాల్సిన ప్రాంతంలో, అందుబాటు ధరల్లో కొత్త ఇల్లును సమకూర్చుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇంతకాలం సెకండ్ హ్యాండ్ ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు కార్పొరేట్ స్థాయిలో జరగట్లేదు. తెలిసిన వాళ్ల ద్వారానో, పరిచయం ఉన్న వాళ్ల ద్వారానో ఆయా ప్రాపర్టీల వ్యాపారం సాగుతుంది. భాగ్యనగరంలో నెలకు వెయ్యి కొత్త ఫ్లాట్లు అమ్ముడవుతుంటే, పాత ఫ్లాట్లు రెండు వేలకు పైగానే అమ్ముడవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
♦ అమీర్‌పేట, పంజగుట్ట వంటి ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొత్త ఇల్లు నిర్మించాలంటే స్థలం దొరకడం కష్టం. ఒకవేళ లభించినా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు కావడంతో నిర్మాణం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో సొంతిల్లు సొంతమవ్వాలంటే ట్రూ వ్యాల్యూ ప్రాపర్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పాత ఫ్లాట్ అమ్మకాల గురించి పెద్దగా ప్రచారం ఉండకపోవడంతో కొనుగోలుదారులు ఇటువైపు పెద్దగా దృష్టిసారించట్లేదు.
లెక్కేసుకోండి..
ట్రూ వ్యాల్యూ ప్రాపర్టీలతో కొనుగోలుదారులు ప్రభుత్వానికి చెల్లించే సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ భారం నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగంటే ఉదాహరణకు దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతంలో కొత్త ఇల్లు కొనాలంటే చ.అ. రూ. 3 వేలు ధర ఉందనుకుందాం. 2 బీహెచ్‌కే ఫ్లాట్ 1,100 చ.అ. అనుకుంటే.. ఫ్లాట్ ధర రూ. 33 లక్షలవుతుంది. లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతుల కోసం అదనపు సొమ్ము చెల్లించాలి. ఇక ప్రభుత్వానికి సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, రిజిస్ట్రేషన్ చార్జీలు తప్పవు. వీటి ఖర్చు రూ. 3 లక్షలపైనే. అదే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి చెల్లించే వ్యాట్, బిల్డర్‌కు ముందుగా చెల్లించే సొమ్ము భారాన్ని తప్పించుకోవచ్చుగా.
లాభాలెన్నో..
♦ కస్టమర్లకు నిర్మాణ రంగంపై నమ్మకాన్ని కలిగించడంతో పాటు సంస్థ బ్రాండ్ ఇమేజ్‌ను ఎల్లప్పుడూ కాపాడుకోవచ్చు.
♦ అనుకూలమైన ప్రాంతంలో, అనువైన ఇంటిని అందుబాటు ధరలో ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
♦ గృహ ప్రవేశం చేసేదాక బ్యాంక్‌కు చెల్లించాల్సిన ఈఎంఐ, ప్రభుత్వం విధించే సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ భారం తప్పుతుంది.
♦ బిల్డర్ కొత్త ఇంటిని నిర్మించాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అదే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అయితే రాత్రికి రాత్రే గృహప్రవేశం చేయవచ్చు.
♦ {బోకర్ల చేతిలో మోస పోయే అవకాశమే ఉండదు. మధ్యవర్తులకు ఇచ్చే కమీషనూ తగ్గుతుంది.
♦ అందుబాటు ధరలో కోరుకున్న ఫ్లాట్ దక్కుతుందని గుడ్డిగా కొనుగోలు చేయకూడదు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు ఈ విషయాలను పరిశీలించాలి..
♦ భవనానికి బీపీఎస్ క్లియర్‌గా ఉందా? ప్రభుత్వం విధించే అన్ని రకాల అనుమతులు తీసుకున్నారా లేదా పరిశీలించాలి.
♦ భవనాన్ని నిర్మించి ఎంత కాలం అయ్యింది? నిర్మించిన బిల్డర్ గత చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి.
♦ ఇంతకుముందు ఫ్లాట్‌లో నివాసమున్న వారు ఫ్లాట్‌ను అమ్మడానికి కారణాలు తెలుసుకోవాలి.
♦ ఫ్లాట్‌లో విద్యుత్, నీటి సరఫరా, పార్కింగ్ సౌకర్యం వంటి సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి.
♦ ఫ్లాట్‌లో ఫ్లోరింగ్, గోడలు, పెయింటింగ్ ఏమైనా దెబ్బతిన్నాయా? ఒకవేళ దెబ్బతింటే కొనుగోలు సొమ్ములో ఎంత తగ్గిస్తారు? లేకపోతే ఇంటిని రిపేర్ చేయించి ఇస్తారా? అనే విషయాన్ని ముందుగా బిల్డర్‌తో మాట్లాడుకోవాలి.
♦ నిర్వహణ సక్రమంగా నిర్వహించే అసోసియేషన్, వాటి బైలాస్ ఏమిటి అనే విషయాలను తెలుసుకోవాలి.
♦ డ్రైనేజీ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉందా?, ఫ్లాట్‌లో జనరేటర్, లిఫ్ట్, సెల్లార్ వంటి సౌకర్యాలున్నాయా?.. వంటి విషయాలను క్షుణ్నంగా పరిశీలించాలి.