హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బండి ఇప్పుడు వద్దు. తరువాత కొందాం.. ఇదీ అత్యధికుల మాట. కోవిడ్–19 మహమ్మారి తదనంతర ప్రభావమే ఈ వాయిదా నిర్ణయానికి కారణం. కార్ ట్రేడ్ టెక్ మొబిలిటీ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం ఫోర్ వీలర్‌ను కొనుగోలు చేసే విషయంలో 80 శాతం మంది వాయిదాకే మొగ్గు చూపారట. అదే ద్విచక్ర వాహనాల విషయంలో ఈ సంఖ్య 82 శాతముంది. దేశవ్యాప్తంగా 2022 మార్చి 3–12 మధ్య ఇండియన్ ఆటోమోటివ్ కంజ్యూమర్ కాన్వాస్ పేరుతో 2,56,351 మంది వినియోగదార్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కార్ ట్రేడ్ టెక్ మొబిలిటీ ఔట్‌లుక్ విడుదల చేసింది. వాహన కొనుగోళ్లను వాయిదా వేసే వ్యక్తుల సంఖ్య 2022లో పెరిగింది. కోవిడ్–19 ప్రభావాల నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని నివేదిక వివరించింది.
ఈవీల విషయంలో ఇలా..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) డిమాండ్ ఊపందుకుంది. 40 శాతం ద్విచక్ర వాహనదార్లు ఈ ఏడాది ఈవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 2021లో ఈ సంఖ్య 37 శాతముంది. ఈవీ పట్ల ఆసక్తి చూపుతున్న ఫోర్ వీలర్ కస్టమర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 33 శాతముంది. సర్వే సానుకూల సెంటిమెంట్‌ను సూచిస్తోందని కార్ ట్రేడ్ టెక్ కంజ్యూమర్ బిజినెస్ సీఈవో బన్వారి లాల్ శర్మ తెలిపారు. ‘ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. కస్టమర్ల నిర్ణయాలను ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి పెట్టాలి’ అని వివరించారు.
ప్రీ–ఓన్డ్‌కు కస్టమర్ల సై..
పాత వాహనం (ప్రీ–ఓన్డ్) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2021లో వీరి సంఖ్య 14 శాతముంటే.. ఇప్పుడు 20 శాతానికి చేరింది. లీజింగ్, ప్రీ–ఓన్డ్, సబ్‌స్క్రిప్షన్ మోడల్ విధానాన్ని ఎంచుకోవాలని 26 శాతం మంది భావిస్తున్నారు. కొత్త వెహికిల్ కొనడం కోసం దాచుకున్న డబ్బులు, పాత వాహనం విక్రయంపైనే 18 శాతం మంది నమ్మకం పెట్టుకున్నారట. గతేడాది ఈ సంఖ్య 14 శాతముంది. ఆన్‌లైన్‌లో కొనుగోలుకు 49 శాతం మంది ఓకే ఆన్నారట. వాహనాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేనందున ఆన్‌లైన్ పట్ల ఆసక్తి లేకపోవడానికి కారణమని 28 శాతం మంది తెలిపారు’ అని నివేదిక వివరించింది. ప్రీ–ఓన్డ్‌ను ఎంచుకునే వారి సంఖ్య 20 రెట్లు పెరిగిందని ఎవర్ కార్స్ ఎండీ కృష్ణ తిరుగుడు వెల్లడించారు. అదనపు ఖర్చు లేకపోవడం, తక్కువ ధర, మంచి కండీషన్, మెరుగైన మోడల్ లభించడం ఈ స్థాయి డిమాండ్‌కు కారణమన్నారు.
బండి తరువాత కొందాం
Published Tue, Mar 29 2022 6:42 AM | Last Updated on Tue, Mar 29 2022 9:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment