four wheeler
-
ఆటో అవార్డ్స్ 2023 విన్నర్స్ జాబితా - పూర్తి వివరాలు
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడో ఎడిషన్ విజేతల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఆటోమొబైల్ నిపుణులు, పరిశ్రమ నాయకులు, ఉన్నతాధికారులు, ఆటోమోటివ్ తయారీదారుల సమక్షంలో అవార్డుల ప్రధానం జరిగింది. ఫోర్ వీలర్, టూ వీలర్ విభాగాల్లో జరిగిన నామినేషన్స్‌లో అవార్డులు సొంతం చేసుకున్న వాహనాల జాబితా ఇక్కడ చూడవచ్చు 👉బడ్జెట్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ - హోండా షైన్ 100 👉ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ - అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 👉స్కూటర్ ఆఫ్ ది ఇయర్ - హీరో జూమ్ 👉ప్రీమియం మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ - కేటీఎమ్ డ్యూక్ 390 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - టీవీఎస్ మోటార్ కంపెనీ ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! 👉ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ (మాస్ మార్కెట్) - టాటా నెక్సన్ 👉డిజైన్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ వెర్నా 👉ఎస్యూవీ ఆఫ్ ది ఇయర్ - మారుతి సుజుకి జిమ్నీ 👉ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉హై-టెక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ మోటార్ ఇండియా 👉మోస్ట్ ప్రామిసింగ్ కార్ ఆఫ్ ది ఇయర్ - ఎంజీ కామెట్ -
అలెర్ట్ : ఈ వెహికల్స్‌ను బ్యాన్ చేయండి.. కేంద్రం వద్దకు ప్రతిపాదనలు!
న్యూఢిల్లీ: పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఆధారిత ఫోర్ వీలర్లను 2027 నాటికి నిషేధించాలని చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలని చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ విన్నవించింది. ‘ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో తయారైన మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాల తయారీని 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలి. సుమారు 10 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో డీజిల్ సిటీ బస్సులను నూతనంగా జోడించకూడదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఆధారిత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ సరైన పరిష్కారంగా ప్రచారం చేయాలి. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! మధ్యంతర కాలంలో మిశ్రమ నిష్పత్తిని పెంచుతూ ఇథనాల్‌తో కూడిన ఇంధనానికి విధాన మద్దతు ఇవ్వాలి. డీజిల్‌తో నడిచే ఫోర్ వీలర్లను వీలైనంత త్వరగా తొలగించవచ్చు. అందువల్ల 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, అధిక కాలుష్యం ఉన్న అన్ని పట్టణాలలో డీజిల్‌తో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేధాన్ని ఐదేళ్లలో అమలు చేయాలి. ఫ్లెక్స్ ఫ్యూయల్, హైబ్రిడ్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించేలా స్వల్ప, మధ్యస్థ కాలంలో ప్రచారం చేయాలి. పన్నుల వంటి ఆర్థిక సాధనాల ద్వారా ఇది చేయవచ్చు. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ఫేమ్‌ను కొనసాగించాలి. నగరాల్లో సరుకు డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్లకు అనుమతించాలి. కార్గో తరలింపు కోసం రైల్వేలు, గ్యాస్‌తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలి. ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్ నెట్ జీరో స్థాయికి చేరుకుంటుంది’ అని నివేదిక పేర్కొంది. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్‌తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్‌తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ప్రతి సిరీస్‌లో ఎంతో డిమాండ్ ఉండే ఆల్‌నైన్ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్‌జడ్ 9999’ నెంబర్‌కు ప్రీమియర్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ‘టీఎస్ 09 జీఏ 0001’ నెంబర్ కోసం రాజేశ్వరి స్కిన్ అండ్ ఎయిర్క్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్09 జీఏ 0009’ నెంబర్ కోసం ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్09 జీఏ 0007’ నెంబర్ కోసం స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,35,007 చెల్లించి నెంబర్‌ను దక్కించుకుంది. ‘టీఎస్ 09 జీఏ 0003’ నెంబర్ కోసం ధని కన్సల్టేషన్స్ ఎల్ఎల్పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపైన శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ తెలిపారు. -
వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాలపై జీవితకాల పన్ను బాదుడు మొదలైంది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. మొదటి రోజు సుమారు రెండు వేల వాహనాలు నమోదు కాగా.. రెండో రోజు మంగళవారం మరో 1600 వాహనాలు కొత్తగా నమోదయ్యాయి. వీటిలో 75 శాతం వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. సోమవారం నుంచే పెరిగిన జీవితకాల పన్ను అమల్లోకి రానున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. మొదటి రోజు నమోదైన వాహనాలన్నీ పాత జీవితకాల పన్నుపైనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో వాహనదారుల నుంచి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం మిగతా డబ్బులు వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు స్లాబ్‌ల పద్ధతి ఉండగా, కొత్తగా 4 స్లాబుల్లో జీవిత కాల పన్నును విధించిన సంగతి తెలిసిందే. వాహనాల ఖరీదు ఆధారంగా పన్ను విధించినప్పటికీ సామాన్య, మధ్యతరగతి వర్గాలపై భారం అధికంగా పడనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలైన సగటుజీవిపై పన్ను బాదుడు పిడుగుపాటుగా మారింది. జీవిత కాల పన్ను రూపంలో నగరంలోని వాహనదారులుపై ఏటా రూ.500 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఆదాయంలోనూ ఆ మూడు జిల్లాలే.. ► రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 3500 వరకు కొత్త వాహనాలు నమోదవుతుండగా వీటిలో సగానికి పైగా గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఆదాయంలోనూ ఈ మూడు జిల్లాలే ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తంగా ప్రస్తుతం 1.34 కోట్ల వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 70 లక్షలు దాటింది. ► రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు, పర్మిట్లు, వివిధ రకాల పౌరసేవల పునరుద్ధరణపై వచ్చే ఆదాయం కంటే జీవితకాల పన్ను రూపంలోనే ఆర్టీఏకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖకు రూ.3,350 కోట్ల వరకు ఆదాయం లభించగా గ్రేటర్ పరిధిలోనే రూ.1600 కోట్లకు పైగా ఆదాయం నమోదు కావడం గమనార్హం. ► కొత్తగా పెంచిన జీవితకాల పన్ను ద్వారా మరో రూ.500 కోట్లకుపైగా గ్రేటర్ నుంచి లభించనుంది. ఇతర రాష్ట్రాలవాహనాల రీరిజిస్ట్రేషన్, హై ఎండ్, లగ్జరీ వాహనాల నమో దు, ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ వేలం తదితర రూపాల్లోనూ రవాణా శాఖకు హైదరాబాద్ నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది. ద్విచక్ర వాహనాలే టాప్... ► గ్రేటర్లో ప్రతి రోజు 1500 నుంచి 2000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిలో సుమారు వెయ్యి వరకు ద్విచక్ర వాహనాలే. కోవిడ్ కాలంలో సైతం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 శాతం చొప్పున పాత జీవితకాల పన్ను ప్రకారం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు బైక్‌లు లభించాయి. ప్రస్తుతం 12 శాతం లైఫ్‌ట్యాక్స్ పెరగడంతో వాహనాల ధర రూ.80 వేల నుంచి రూ.90 వేలు దాటనుంది. పెరిగిన పన్నుల మేరకు ద్విచక్ర వాహనాలపైనే గ్రేటర్లో రోజుకు రూ.50 లక్షల వరకు అదనపు ఆదాయం లభించనున్నట్లు అంచనా. (చదవండి: వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!) ► ఇక పాత పన్నుల ప్రకారం మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే రూ.10 లక్షల వరకు ఖరీదైన కార్లకు 12 శాతం ఉండగా, ఇప్పుడు 14 శాతానికి పెంచారు. ఈ మేరకు ఈ కేటగిరి వాహనాలపైనే రూ.కోటికిపైగా అదనపు భారం పడనుంది. అన్ని రకాల వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం అదనంగా లభించే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్!) -
కొత్త బండి వద్దు బాస్.. పాతదయితేనే మేలు !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బండి ఇప్పుడు వద్దు. తరువాత కొందాం.. ఇదీ అత్యధికుల మాట. కోవిడ్–19 మహమ్మారి తదనంతర ప్రభావమే ఈ వాయిదా నిర్ణయానికి కారణం. కార్ ట్రేడ్ టెక్ మొబిలిటీ ఔట్లుక్ నివేదిక ప్రకారం ఫోర్ వీలర్‌ను కొనుగోలు చేసే విషయంలో 80 శాతం మంది వాయిదాకే మొగ్గు చూపారట. అదే ద్విచక్ర వాహనాల విషయంలో ఈ సంఖ్య 82 శాతముంది. దేశవ్యాప్తంగా 2022 మార్చి 3–12 మధ్య ఇండియన్ ఆటోమోటివ్ కంజ్యూమర్ కాన్వాస్ పేరుతో 2,56,351 మంది వినియోగదార్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కార్ ట్రేడ్ టెక్ మొబిలిటీ ఔట్లుక్ విడుదల చేసింది. వాహన కొనుగోళ్లను వాయిదా వేసే వ్యక్తుల సంఖ్య 2022లో పెరిగింది. కోవిడ్–19 ప్రభావాల నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని నివేదిక వివరించింది. ఈవీల విషయంలో ఇలా.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) డిమాండ్ ఊపందుకుంది. 40 శాతం ద్విచక్ర వాహనదార్లు ఈ ఏడాది ఈవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 2021లో ఈ సంఖ్య 37 శాతముంది. ఈవీ పట్ల ఆసక్తి చూపుతున్న ఫోర్ వీలర్ కస్టమర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 33 శాతముంది. సర్వే సానుకూల సెంటిమెంట్‌ను సూచిస్తోందని కార్ ట్రేడ్ టెక్ కంజ్యూమర్ బిజినెస్ సీఈవో బన్వారి లాల్ శర్మ తెలిపారు. ‘ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. కస్టమర్ల నిర్ణయాలను ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెట్టాలి’ అని వివరించారు. ప్రీ–ఓన్డ్‌కు కస్టమర్ల సై.. పాత వాహనం (ప్రీ–ఓన్డ్) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2021లో వీరి సంఖ్య 14 శాతముంటే.. ఇప్పుడు 20 శాతానికి చేరింది. లీజింగ్, ప్రీ–ఓన్డ్, సబ్స్క్రిప్షన్ మోడల్ విధానాన్ని ఎంచుకోవాలని 26 శాతం మంది భావిస్తున్నారు. కొత్త వెహికిల్ కొనడం కోసం దాచుకున్న డబ్బులు, పాత వాహనం విక్రయంపైనే 18 శాతం మంది నమ్మకం పెట్టుకున్నారట. గతేడాది ఈ సంఖ్య 14 శాతముంది. ఆన్లైన్లో కొనుగోలుకు 49 శాతం మంది ఓకే ఆన్నారట. వాహనాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేనందున ఆన్లైన్ పట్ల ఆసక్తి లేకపోవడానికి కారణమని 28 శాతం మంది తెలిపారు’ అని నివేదిక వివరించింది. ప్రీ–ఓన్డ్‌ను ఎంచుకునే వారి సంఖ్య 20 రెట్లు పెరిగిందని ఎవర్ కార్స్ ఎండీ కృష్ణ తిరుగుడు వెల్లడించారు. అదనపు ఖర్చు లేకపోవడం, తక్కువ ధర, మంచి కండీషన్, మెరుగైన మోడల్ లభించడం ఈ స్థాయి డిమాండ్‌కు కారణమన్నారు. -
ఆనంద్ మహీంద్రా కోరిక నెరవేరింది
దేశం గర్వించదగ్గ వ్యాపారదిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడమే కాదు.. అవసరమైతే సాయానికి సైతం వెనకాడని నైజం వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాది. అలాంటిది మాట ఇచ్చాక ఊరుకుంటాడా? ఆ మధ్య మహారాష్ట్రకు చెందిన ఓ సామాన్యుడికి ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారుచేశాడు దత్తాత్రేయ లొహార్ అనే అతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. ఆ వాహనం ఇస్తే.. బదులుగా కొత్త బొలెరో వాహనం ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు మొత్తానికి ఆ పని చేసి చూపించారాయన. ‘‘కొత్త బొలెరో తీసుకుని తన వాహనాన్ని మార్చుకునే ప్రతిపాదనను అతను అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. నిన్న అతని కుటుంబం బొలెరోను అందుకుంది. మేము అతని సృష్టికి సగర్వంగా బాధ్యత వహిస్తాం. ఇది మా రీసెర్చ్ వ్యాలీలో మా అన్ని రకాల కార్ల కలెక్షన్లో భాగంగా ఉండనుంది ఇక. స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. Delighted that he accepted the offer to exchange his vehicle for a new Bolero. Yesterday his family received the Bolero & we proudly took charge of his creation. It will be part of our collection of cars of all types at our Research Valley & should inspire us to be resourceful. https://t.co/AswU4za6HT pic.twitter.com/xGtfDtl1K0 — anand mahindra (@anandmahindra) January 25, 2022 సంబంధిత వార్త: బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా! ప్రతిగా ఏం కోరాడంటే.. దత్తాత్రేయ లొహార్ స్వస్థలం మహారాష్ట్రలోని దేవ్రాష్ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! షోరూంలో దత్తాత్రేయ కుటుంబంతో సహా వాహనం అందుకున్న ఫొటోల్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt — anand mahindra (@anandmahindra) December 21, 2021 -
సామాన్యుడికి ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
Anand Mahindra Offers Bolero To This Man Who Made four wheeler With Scrap: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చర్యలు ఎప్పుడూ ఆకట్టుకునేలా ఉంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బిజినెస్ టైకూన్.. అప్పుడప్పుడు సర్ప్రైజ్లు కూడా ఇస్తుంటాడు. అలా ఇప్పుడు ఓ సామాన్యుడికి బంపరాఫర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మహీంద్రా ఆఫర్ ఇచ్చింది ఓ పేదకమ్మరికి!. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారుచేశాడతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. అందుకే ఆ వీడియోను షేర్ తన ట్విటర్లో షేర్ చేశారు. అందులో ఆ కారు ఎలా పని చేస్తుందో కూడా వివరంగా ఉంది. పనిలో పనిగా ఆ వ్యక్తి తయారు చేసిన వాహనం తీసుకుని.. తన కంపెనీ తరపున బొలెరో వాహనాన్ని ఇవ్వాలని ఫిక్సయ్యారు ఆనంద్ మహీంద్రా. This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt — anand mahindra (@anandmahindra) December 21, 2021 ‘‘ఇది నిబంధనలకు అనుగుణంగా లేకపోవచ్చు. కానీ తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని చూపెట్టే మన ప్రజల చాతుర్యాన్ని మెచ్చుకోకుండా నేను ఉండలేను’’.. అంటూ ట్విటర్ వేదికగా పెద్దగా చదువుకోని ఆ ‘ఇంజినీర్’పై ప్రశంసలు గుప్పించాడు. హిస్టోరికానో యూట్యూబ్ ఛానెల్ ప్రకారం.. ఆ ఆవిష్కరణ చేసిన వ్యక్తి పేరు దత్తాత్రేయ లొహార్. ఊరు మహారాష్ట్రలోని దేవ్రాష్ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! మరి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ఆఫర్‌ను దత్తూ స్వీకరిస్తాడా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: బాధ్యత కలిగిన పౌరులను చూశా! -
ఇక ఆ వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ: అన్ని కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ఫ్రంట్ ప్యాసింజర్ కు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న ఈ ఉత్తర్వులను కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. “వాహనం ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక ముఖ్యమైన రక్షణ చర్యగా పేర్కొంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ఆధారంగా ఈ నిబంధనలు తీసుకురావడం జరిగినట్లు" కేంద్రం పేర్కొంది. 2021 ఏప్రిల్ 1న నుంచి కొనుగోలు చేసే ప్రతి కొత్త వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటికే కొన్న వాహనాలకు ఆ వాహనదారులు ఆగస్టు 31లోపు తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో డిసెంబర్ 29, 2020న ఈ నిబంధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రతి వాహనంలోనూ ముందు సీట్ల కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. కొత్త వాహనాలకు ఏప్రిల్ 1, పాత వాహనాలకు జూన్ 1లోపు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. డ్రైవర్ సీట్ లో ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఉండాలని 2019 నుంచే నిబంధన ఉండగా.. ప్రస్తుతం డ్రైవర్ పక్క సీటుకు కూడా దీన్ని కొనసాగించారు. ఈ నిబంధన అన్ని ఎం1 కేటగిరి వాహనాలకు వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల కంటే తక్కువ సైజున్న ప్యాసెంజర్ వెహికిల్స్ అన్నీ ఈ కేటగిరిలోకి చేరతాయి. ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోని రోడ్ ప్రమాద బాధితుల్లో 10 శాతం మంది భారతదేశం నుంచి ఉన్నారు. డ్రైవర్ పక్క సీటుకు కూడా ఎయిర్‌బ్యాగ్ ఉండటం వల్ల ప్రమాదం వల్ల కలిగే తీవ్రతను కొంచెం తగ్గించవచ్చు. దీనివల్ల డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు అదనపు రక్షణ లభిస్తుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నాలుగు చక్రాల వాహన ధరలు రూ.5,000 నుంచి 8,000 పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్ వ్యక్తి ప్రాణాలను కాపాడే ఆస్కారం ఎక్కువ కాబట్టి ఇది అంత పెద్ద ధర కాకపోవచ్చు. చదవండి: ఆరు నెలలు నీటి అడుగున ఐఫోన్ 11, అయినా కూడా.. రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
షెడ్డుకు పోతేనే రోడ్డెక్కేది
సాక్షి, జనగామ: 58 రోజులుగా పార్కింగ్‌కే పరిమితమైన ఫోర్ వీలర్ వాహనాలు తిరిగి రోడ్లపైకి రావడానికి మొరాయిస్తున్నాయి. బ్యాటరీలు దెబ్బతినడంతో స్టార్టింగ్ ట్రబుల్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వ్యాపారాలు మూతపడడం.. పనులు లేక సతమతం అవుతున్న యాజమానులకు వాహనాలు రిపేర్‌కు రావడంతో ఇక్కట్లు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ కేటగిరీల్లో కలుపుకొని 82,791 వాహనాలున్నాయి. పార్కింగ్‌కే పరిమితం.. వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు మార్చి 23వ తేదీ నుంచి నిరవధికంగా లాక్డౌన్నువిధించాయి. అప్పటి నుంచి బైక్‌లు, అత్యవసర, రైతాంగానికి ఉపయోగించే వాహనాలు నడవడానికి మినహాయింపులు ఇచ్చారు. కార్లు, ఆటోలు, జీపులు, క్యాబ్‌లు, విద్యా సంస్థల బస్సులు ఎక్కడికక్కడే నిలిపేశారు. వాహనాలు బయట తిరగడానికి అనుమతి లేకపోవడంతో పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. దెబ్బతిన్న బ్యాటరీలు.. వాహనాలు ఎక్కువ రోజులు పార్కింగ్‌కు పరిమితం కావడంతో బ్యాటరీలు దెబ్బతిన్నాయి. సెల్ఫ్ మోటార్లు పని చేయకుండా పోయాయి. ఏకంగా 58 రోజులుగా వాహనాలు నడపకుండా నిలుపుదల చేయడంతో అసలు స్టార్ట్ కావడం లేదు. మెకానిక్ షెడ్డుకు తీసుకుపోయే వరకు వాహనాలు నడవడం లేదని పలువురు వాహనదారులు చెబుతున్నారు. కొత్త బ్యాటరీ కోసం రూ.4500 నుంచి రూ.7500 వరకు, ఇంజన్ ఆయిల్ మార్పు రూ.3000, కొత్త టైర్ల కోసం రూ. 5000 నుంచి రూ.8000 వరకు వెచ్చించాల్సి ఉంటుందని వాపోతున్నారు. కష్టకాలంలో తమపై రిపేరుతో వేలల్లో అదనపు ఖర్చు మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాటరీ పోయింది కరోనా లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా కారును బయటకు తీయలేదు. ఇంటి ముందరనే నిలిపేశాం. బయట తిప్పడానికి వీలు లేదు. కారు తీయకుండా ఉండడంతో అసలే స్టార్ట్ కాలేదు. బ్యాటరీ పోయింది. కొత్త బ్యాటరీ వేసే వరకు అసలు స్టార్ట్ కాలేదు. చేతుల్లో పైసలు లేకపోయినా బ్యాటరీ మార్చక తప్పలేదు.– కాసర్ల లక్ష్మారెడ్డి,వాహనదారుడు, జనగామ నడపకపోవడం వల్లనే సమస్య ఏ వాహనమైనా రోజుకు కొద్దిదూరం నడపాలి. కనీసం రెండుమూడు రోజులకు ఒకసారైనా తిప్పాలి. వరుసగా రెండు నెలలు తీయకుండా ఇళ్లకే పరిమితం అయ్యాయి. బ్యాటరీలు పని చేయడం లేదు. టైర్లలోకి ఎయిర్ వచ్చింది. ఆయిల్ గడ్డకట్టింది. అసలు స్టార్ట్ కావడం లేదు. చాలా మంది ఇవే సమస్యతో వస్తున్నారు. కనీసం మళ్లీ రిపేర్ చేయడానికి రూ.5 నుంచి 10వేలు కావాలి.– కావేటి రాజు, కారు మెకానిక్ , జనగామ -
కార్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
కోల్‌కతా: కోల్‌కతాలోని ప్రముఖ కార్ల కంపెనీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆనందపురాలోని కార్ల కంపెనీకి చెందిన వర్క్‌షాపులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అనేక వాహనాలను ప్రమాదస్థలంనుంచి పక్కకు తప్పించారు. 10 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి వుంది. మరోవైపు తూర్పు కోల్‌కతాలోని ఆనందపూర్ ప్రాంతంలో ఉన్న వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని, శీతలీకరణ ప్రక్రియ ప్రారంభమైందని అగ్నిమాపక, అత్యవసర సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. -
ఇక నెంబర్ ప్లేట్లతోనే కార్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఇక నెంబర్ ప్లేట్లు ఫిట్ చేసిన వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. వీటికి అయ్యే వ్యయాన్ని వాహన ధరలోనే కలుపుతారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వాహన రిజిస్ర్టేషన్ నెంబర్‌తో కూడిన నెంబర్ ప్లేట్లను ఆయా ప్రభుత్వ సంస్థల ద్వారా పొందే వెసులుబాటు ఉంది. అయితే ఇక నుంచీ వాహన తయారీ కంపెనీలు కార్లపై ప్లేట్లను అమరుస్తాయని, వాటిపై నెంబర్‌ను తర్వాత యంత్రంతో నమోదు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. కారు ధరలోనే నెంబర్ ప్లేట్ ధర కలిపి ఉంటుందని, దీంతో వినియోగదారులకు ఊరట లభిస్తుందని చెప్పారు. నూతన టెక్నాలజీ నెంబర్ ప్లేట్లతో ప్రజలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా వివిధ రాష్ట్రాలు వీటిని వేర్వేరుగా సమకూర్చుకునే క్రమంలో ఈ ఇబ్బందులను అధిగమించవచ్చని అన్నారు. భద్రత విషయంలో మాత్రం రాజీపడబోమని సాధారణ వాహనాలకు, లగ్జరీ వాహనాలకు భద్రతా ప్రమాణాల్లో మాత్రం ఎలాంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు. -
డ్రైవింగ్ లెసైన్స్
అనంతపురం టౌన్ : టూవీలర్, ఫోర్ వీలర్లు నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లెసైన్స్ ఉండాల్సిందే. దీనికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. 16 సంవత్సరాలు నిండిన వారు గేర్లు లేని (55 సీసీ లోపు సామర్థ్యం కలిగిన వాహనాలు) మోపెడ్లు నడిపేందుకు అర్హత ఉంటుంది. అయితే వీరికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఆర్ తీసుకోవాలంటే.. లెర్నింగ్ లెసైన్స్ కావాలనుకునే వారు .aptransport.gov.in బ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లెసైన్స్ ఎవరికి కావాలో వారి చిరునామాకు సమీపంలో మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ పొందే అనుమతి లభిస్తుంది. లేదంటే దాని పరిధిలోని కార్యాలయాల్లో తీసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో లేదా ఈ-సేవా కేంద్రంలో ఫీజు చెల్లించాలి. టూ వీలర్, ఫోర్ వీలర్లలో ఏదైనా ఒక దాని కోసం రూ.90, రెండూ కావాలనుకుంటే రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. స్లాట్ తీసుకున్న 24 గంటల్లోగా ఫీజు చెల్లించకపోతే అది రద్దయిపోతుంది. స్లాట్ బుక్ చేసుకున్న గడువు, సమయాన్ని అనుసరించి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాలి. ఇదే సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, చిరునామా పత్రాలు వెంట తీసుకెళ్లాలి. లెర్నింగ్ లెసైన్స్ పరీక్షలో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత నియమాలపై 20 ప్రశ్నలుంటాయి. వాటిలో కనీసం 16 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన సమాధానం గుర్తించాలి. పరీక్షలో పాస్ అయిన వారికి మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ ఇస్తారు. అయితే ఇది కేవలం ఆరు నెలల వరకే చెల్లుబాటు అవుతుంది. ఎల్ఎల్ఆర్ పొందిన 30 రోజుల తర్వాత, దాని గడువు ముగిసేలోగా శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందవచ్చు. నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లెసైన్స్ 18 ఏళ్లకే పొందినప్పటికీ, ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ పొందేందుకు కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి. అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నింగ్ లెసైన్స్ పొందవచ్చు. శాశ్వత లెసైన్స్ కోసం.. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందాలనుకునే వారు కూడా ఆర్టీఏ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. 24 గంటల్లో ఈ-సేవ, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో గానీ రూ.550 నుంచి రూ.650 ఫీజు చెల్లించాలి. ఆర్టీఏ కార్యాలయాల టెస్ట్ ట్రాక్‌లలో పరీక్ష నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం వాహనాలు నడపాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలో వాహనదారులు నైపుణ్యంతో వ్యవహరిస్తే శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ మంజూరవుతుంది. పోస్టు ద్వారా లెసైన్స్ మీ చిరునామాకు చేరుతుంది. పూర్తి వివరాల కోసం అనంతపురంలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.