మెకానిక్ షెడ్‌కు వచ్చిన కార్లు
సాక్షి, జనగామ: 58 రోజులుగా పార్కింగ్‌కే పరిమితమైన ఫోర్ వీలర్ వాహనాలు తిరిగి రోడ్లపైకి రావడానికి మొరాయిస్తున్నాయి. బ్యాటరీలు దెబ్బతినడంతో స్టార్టింగ్ ట్రబుల్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వ్యాపారాలు మూతపడడం.. పనులు లేక సతమతం అవుతున్న యాజమానులకు వాహనాలు రిపేర్‌కు రావడంతో ఇక్కట్లు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ కేటగిరీల్లో కలుపుకొని 82,791 వాహనాలున్నాయి.
పార్కింగ్‌కే పరిమితం..
వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు మార్చి 23వ తేదీ నుంచి నిరవధికంగా లాక్‌డౌన్‌నువిధించాయి. అప్పటి నుంచి బైక్‌లు, అత్యవసర, రైతాంగానికి ఉపయోగించే వాహనాలు నడవడానికి మినహాయింపులు ఇచ్చారు. కార్లు, ఆటోలు, జీపులు, క్యాబ్‌లు, విద్యా సంస్థల బస్సులు ఎక్కడికక్కడే నిలిపేశారు. వాహనాలు బయట తిరగడానికి అనుమతి లేకపోవడంతో పార్కింగ్‌కే పరిమితమయ్యాయి.
దెబ్బతిన్న బ్యాటరీలు..
వాహనాలు ఎక్కువ రోజులు పార్కింగ్‌కు పరిమితం కావడంతో బ్యాటరీలు దెబ్బతిన్నాయి. సెల్ఫ్ మోటార్లు పని చేయకుండా పోయాయి. ఏకంగా 58 రోజులుగా వాహనాలు నడపకుండా నిలుపుదల చేయడంతో అసలు స్టార్ట్ కావడం లేదు. మెకానిక్ షెడ్డుకు తీసుకుపోయే వరకు వాహనాలు నడవడం లేదని పలువురు వాహనదారులు చెబుతున్నారు. కొత్త బ్యాటరీ కోసం రూ.4500 నుంచి రూ.7500 వరకు, ఇంజన్ ఆయిల్ మార్పు రూ.3000, కొత్త టైర్ల కోసం రూ. 5000 నుంచి రూ.8000 వరకు వెచ్చించాల్సి ఉంటుందని వాపోతున్నారు. కష్టకాలంలో తమపై రిపేరుతో వేలల్లో అదనపు ఖర్చు మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాటరీ పోయింది
కరోనా లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా కారును బయటకు తీయలేదు. ఇంటి ముందరనే నిలిపేశాం. బయట తిప్పడానికి వీలు లేదు. కారు తీయకుండా ఉండడంతో అసలే స్టార్ట్ కాలేదు. బ్యాటరీ పోయింది. కొత్త బ్యాటరీ వేసే వరకు అసలు స్టార్ట్ కాలేదు. చేతుల్లో పైసలు లేకపోయినా బ్యాటరీ మార్చక తప్పలేదు.– కాసర్ల లక్ష్మారెడ్డి,వాహనదారుడు, జనగామ
నడపకపోవడం వల్లనే సమస్య
ఏ వాహనమైనా రోజుకు కొద్దిదూరం నడపాలి. కనీసం రెండుమూడు రోజులకు ఒకసారైనా తిప్పాలి. వరుసగా రెండు నెలలు తీయకుండా ఇళ్లకే పరిమితం అయ్యాయి. బ్యాటరీలు పని చేయడం లేదు. టైర్లలోకి ఎయిర్ వచ్చింది. ఆయిల్ గడ్డకట్టింది. అసలు స్టార్ట్ కావడం లేదు. చాలా మంది ఇవే సమస్యతో వస్తున్నారు. కనీసం మళ్లీ రిపేర్ చేయడానికి రూ.5 నుంచి 10వేలు కావాలి.– కావేటి రాజు, కారు మెకానిక్ , జనగామ
Comments
Please login to add a commentAdd a comment