నిర్బంధంలో ఉన్న ఐకేపీ కేంద్ర నిర్వాహకులు
- మహిళా సమాఖ్య ప్రతినిధుల నిర్బంధం
- రెండు గంటల పాటు నిరసన
- పజాప్రతినిధుల జోక్యంతో విడుదల
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం అన్నదాతకు ఆగ్రహం తెప్పించింది. రెండు రోజులుగా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిచిపోవడం, అధికారులు స్పందించకపోవడంతో రైతన్న కోపం కట్టలు తెంచుకుంది. అది కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న మహిళ సమాఖ్య ప్రతినిధులను రెండు గంటల పాటు గృహ నిర్భందించేంత వరకూ వెళ్లింది. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని పుల్లూరులో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 2వ తేదీన పుల్లూరులో ఐకేపీ అధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఇప్పటి వరకు సుమారు 4 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసిన కేంద్రం నిర్వాహకులు, అందులోని 2,500 క్వింటాళ్లను ఎగుమతి చేశారు. రవాణా సమస్య కారణంగా మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉంచారు. ఇదే సమయంలో గత రెండు రోజులుగా చిరుజల్లులు కురవడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో ఈ రెండు రోజుల్లో రైతులు తెచ్చిన ధాన్యం నిల్వలతో కొనుగోలు కేంద్రం నిండిపోయింది. బుధవారం నాటికి సుమారు 6 వేల క్వింటాళ్ల ధాన్యం పుల్లూరు కొనుగోలు కేంద్రానికి చేరుకుంది.
ధాన్యం నిల్వలు భారీగా చేరుకుంటున్నా, నిర్వాహకులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు నిలదీశారు. లారీల, వసతుల కొరత, తేమ శాతం లాంటి సమస్యలతో బుధవారం కూడా కొనుగోళ్లు చేపట్టలేమని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన అన్నదాత సంబంధిత మహిళా సమాఖ్య ప్రతినిధులను స్థానిక పాఠశాలలో సుమారు రెండు గంటల పాటు నిర్భందించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సరోజన అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. అనంతరం రైతులను సముదాయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు ఐకేపీ కేంద్ర నిర్వాహకులను విడుదల చేశారు