నమ్మకమే కొనిపిస్తోంది!
♦ జాతరలో మేలు జాతి పశువుల కొనుగోళ్లు
♦ లక్షలు పోసి కొనేందుకు పలు రాష్ట్రాల రైతులు ఆసక్తి
♦ అర్ధ శతాబ్దం నుంచి నమ్మకంతో సాగుతున్న తంతు
♦ తాండూరు ‘భద్రేశ్వర జాతర’లో స్పెషల్ ప్రదర్శన
యాభై ఏళ్ల నుంచి నడిపిస్తున్న నమ్మకం అది. ఇక్కడ పశువును కొంటే వ్యవసాయం సాఫీగా సాగుతుందని విశ్వాసం. అందుకే రాష్ట్ర సరిహద్దులు దాటి వస్తారు అన్నదాతలు. లక్ష, లక్షన్నర అయినా పర్వాలేదు.. మేలు జాతి కాడెడ్లయితే సరి.. కొనేయాల్సిందే. తాండూరులో యేటా జరిగే భద్రేశ్వర జాతర ప్రత్యేకత ఇది. మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు పక్కనే ఉన్న మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి దేవిని, ఔరాద్, హాల్లి, రేనాపూర్ తదితర రకాల మేలుజాతి పశువులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ధర కూడా దండిగా వస్తుంది. ఆ జాతర విశేషాలే నేటి సండే స్పెషల్..
తాండూరు: మేలు జాతి పశువులకు కేరాఫ్ తాండూరు. తింటే గారెలే తినాలి. కొంటే తాండూరు భద్రేశ్వర జాతరలో పాడి ఆవైనా...పోట్ల గిత్తై కొనాలి. అదీ భద్రేశ్వర జాతర ప్రత్యేకత. తాండూరులో శ్రీభావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాల సందర్భంగా ఎన్నోఏళ్లుగా పశుప్రదర్శన ఏర్పాటు చేయడం ఇక్కడి సంప్రదాయం. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతోపాటు పక్కనే ఉన్న మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పశువులు ప్రదర్శనకు వస్తాయి. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా తాండూరులో పశుప్రదర్శన కొనసాగుతుండడం విశేషం. పశుప్రదర్శనకు మేలు రకం జాతి పశువుల రాకతో ఉత్సవాలు సందడిగా మారుతాయి.
వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి పశువులను కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా జరిగే సంతలో కన్నా జాతరలో పశువులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ధరలు లక్షల్లో ఉంటాయి. వందల జతల పశువులు ప్రదర్శనకు వస్తాయి. జాతరలో ఏర్పాటు చేసే పశుప్రదర్శనలో మేలు జాతి పశువులు దొరుకుతాయని రైతులు నమ్ముతారు. దూర ప్రాంతాలకు వెళ్లి పశువులను కొనుగోలు చేయడం కష్టంగా ఉంటుం దని, రైతులకు వెసులుబాటుగా ఉంటుందని తాండూరులో పశుప్రదర్శన ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతుంటారు.
జెర్సీతోపాటు దేశవాళీ రకాలు..
దేవిని, ఔరాద్, హాల్లి, రేనాపూర్ తదితర మేలు జాతి పశువు లు ప్రదర్శనకు వస్తాయి. జెర్సీతోపాటు దేశవాళీ రకాలు ఇక్కడికి వస్తాయి. తాండూరు ప్రాంతంతోపాటు సరిహద్దు జిల్లాలైన మెదక్, మహబూబ్‌నగర్ నుంచి పలువురు రైతు లు తమ పశువులను ఇక్కడికి విక్రయానికి తరలిస్తారు. ఏటా ఐదారు రోజులపాటు పశుప్రదర్శన కొనసాగుతుంది. సుమారు 5వందల నుంచి వెయ్యి జతల మేలుజాతి పశువులు ప్రదర్శనలో పాల్గొంటాయి. ప్రస్తుతం పట్టణంలోని బస్వన్నకట్ట సమీపంలో ఉన్న శ్రీసరస్వతీ శిశుమందిర్‌లో పశుప్రదర్శన ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పశువులు ప్రదర్శనకు వస్తున్నాయి.