కంపెనీల కొనుగోళ్ల రేసులోఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రోకి చెందిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీ ఇతర ఐటీ కంపెనీలను కొనుగోళ్లపై కన్నేసింది. ఎనలిటిక్స్, కన్సల్టింగ్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, క్లౌడ్ ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ తెలిపింది. ఈ కంపెనీ రూ.1,200 కోట్ల సమీకరణ నిమిత్తం ఈ నెల 11న(వచ్చే సోమవారం) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోంది. ఈ ఐపీఓలో ఎల్ అండ్ టీకి చెందిన 1.7 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేస్తారు. దీంతో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌కు ఎలాంటి నిధులు రావు.
ఐపీఓ నిధులన్నీ మాతృసంస్థ ఎల్ అండ్ టీకి వెళతాయి. తమకు 250 మందికి పైగా క్లయింట్లున్నారని, వీరికి సేవలందించడానికి భారత్, అమెరికా, యూరప్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఐటీ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సీఈఓ, ఎండీ సంజయ్ జలోన చెప్పారు. కంపెనీల కొనుగోళ్లకు కావలసిన నిధులను అంతర్గతంగా సమకూర్చుకుంటామని, లేదా మార్కెట్ నుంచి సమీకరిస్తామని, లేదా పబ్లిక్ ఇష్యూకు వస్తామని పేర్కొన్నారు. తమ ఆదాయంలో 69 శాతం అమెరికా నుంచి, 17 శాతం యూరప్ నుంచి, భారత్ నుంచి 5 శాతం చొప్పున లభిస్తాయని, మిగిలింది ఇతర దేశాల నుంచి వస్తోందని వివరించారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చేది 2 శాతమేనని, అందుకని బ్రెగ్జిట్ ప్రభావం తమపై ఉండదని పేర్కొన్నారు.
ఐపీఓ ధర శ్రేణి రూ.705-710
కాగా ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఐపీఓ)కు ధర శ్రేణిని రూ.705-710గా కంపెనీ నిర్ణయించింది. లిస్టయిన తర్వాత ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్ అండ్ టీ నుంచి స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ కోసం వస్తోన్న రెండో అనుబంధ కంపెనీ ఇది. ఐదేళ్ల క్రితం ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఐపీఓకు వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,000 కోట్లుగా ఉంది.