బంగారం బాండ్లు వస్తున్నాయ్ | Gold bonds are coming soon | Sakshi
Sakshi News home page

బంగారం బాండ్లు వస్తున్నాయ్

Published Sat, Jun 20 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

బంగారం బాండ్లు వస్తున్నాయ్

బంగారం బాండ్లు వస్తున్నాయ్

♦ గోల్డ్ బాండ్ల జారీకి ప్రభుత్వం చర్చాపత్రం
♦ పోస్టాఫీసులు, ఏజెంట్ల ద్వారా విక్రయం
♦ పసిడి కడ్డీలు, నాణేల డిమాండ్ కట్టడికి చర్యలు
 
 న్యూఢిల్లీ : నాణేలు, కడ్డీలు తదితర రూపాల్లో బంగారానికి డిమాండ్‌ను కట్టడి చేసే దిశగా కేంద్రం తాజాగా సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌బీజీ) జారీ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కమీషన్ ప్రాతిపదికన పోస్టాఫీసులు, ఇతరత్రా బ్రోకర్ల ద్వారా వీటిని జారీ చేయనుంది. ఏటా దాదాపు 300 టన్నుల మేర కడ్డీల రూపంలో జరుగుతున్న కొనుగోళ్లలో కొంత భాగాన్నైనా డీమ్యాట్ రూపంలోని బాండ్ల వైపు మళ్లించాలన్నది దీని వెనుక ఉద్దేశం. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు 50 టన్నుల పసిడికి సరిసమానమైన బాండ్ల జారీ ద్వారా రూ. 13,500 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో తలపెట్టిన నిధుల సమీకరణ లక్ష్యంలో దీన్ని కూడా భాగం చేయాలని భావిస్తోంది. కడ్డీల రూపంలో ఉండే బంగారంపై ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ దీనికి కూడా వర్తింపచేసే అవకాశాలున్నట్లు ఈ స్కీముకు సంబంధించి శుక్రవారం విడుదల చేసిన చర్చాపత్రంలో కేంద్రం పేర్కొంది. దీనిపై సంబంధిత వర్గాలు జూలై 2లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. మరోవైపు, సావరీన్ గోల్డ్ బాండ్ల ప్రతిపాదనను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్వాగతించింది. దీనితో పసిడి కొనుగోలుదారులకు మరో పెట్టుబడి సాధనం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది.

 భారత్ దిగుమతుల్లో ముడి చమురు తర్వాత అత్యధిక భాగం బంగారమే ఉంటోంది. దేశం ఏటా సుమారు 800-900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. 2014లో దిగుమతి చేసుకున్న దాంట్లో దాదాపు 180 టన్నుల పసిడి కేవలం పెట్టుబడి అవసరాలకే పరిమితమయ్యింది. దీని వల్ల విదేశీ మారక నిల్వలు గణనీయంగా కరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకే దేశీయంగా ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని చలామణీలోకి తెచ్చేందుకు, ప్రత్యామ్నాయ పసిడి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే, పసిడి కొనుగోళ్లను తగ్గించేందుకు సావరీన్ గోల్డ్ బాండ్ తరహా ప్రత్యామ్నాయ ఆర్థిక సాధనాన్ని అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

 దిగుమతి సమస్యలు తగ్గుతాయ్:ఇండియా రేటింగ్స్
 ప్రతిపాదిత గోల్డ్ బాండ్ల ప్రతిపాదన వల్ల .. ప్రత్యేకంగా పెట్టుబడి కోసమే కొనుక్కునే బంగారానికి డిమాండ్ తగ్గగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) పేర్కొంది. ఫలితంగా పసిడి దిగుమతులు, కరెంటు ఖాతా లోటు కూడా తగ్గొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, బంగారం కడ్డీలు తదితర సాధనాలతో పోలిస్తే సావరీన్ గోల్డ్ బాండ్లకు మంచి ఆదరణే ఉండగలదని ఇండ్-రా తెలిపింది. దీనితో ఆభరణాల తయారీ వంటి అవసరాల కోసమే పసిడి దిగుమతులు పరిమితమయ్యే అవకాశముందని వివరించింది. పేపర్ రూపంలో ఉంటుంది కనుక పసిడి నాణ్యతను పరీక్షించుకోవడం లాంటి సమస్యలు ఉండవని, ఒకవేళ తన ఖా పెట్టాల్సి వచ్చినా ప్రక్రియ సులభతరంగానే ఉంటుందని పేర్కొంది.

 మరోవైపు, ప్రతిపాదిత స్కీమును బట్టి చూస్తే.. 2014లో మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్‌లో దాదాపు 27 శాతానికి సరిసమానంగా ఎస్‌బీజీల జారీ ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ నొమురా పేర్కొంది. దీంతో, తొలి ఏడాదే పూర్తి స్థాయిలో సబ్‌స్క్రయిబ్ అయిన పక్షంలో పసిడి ప్రస్తుత ధరల ప్రకారం బంగారం దిగుమతులపై దాదాపు 2 బిలియన్ డాలర్లను ఆదా చేసినట్లవుతుందని అంచనా వేసింది.
 
 స్కీము ఇలా..
 ప్రతిపాదన ప్రకారం 2,5,10 గ్రాములు తదితర పరిమాణాల్లో పసిడికి సరిసమానంగా విలువ చేసే బాండ్లను ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. పసిడి ధరలు మధ్యకాలికంగా హెచ్చుతగ్గులకు లోనైనా ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలగకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికన 5-7 సంవత్సరాల కాల వ్యవధితో ఈ బాండ్లు ఉండనున్నాయి. వీటిపై రాబడికి సంబంధించి నామమాత్ర వడ్డీ రేటు (బంగారంపై రుణాలకు అంతర్జాతీయంగా ఉన్న రేటుకు అనుసంధానమై) ఉంటుంది.

కనిష్టంగా 2 శాతం లేదా 3శాతంగా వడ్డీ రేటు ఉండగదని అంచనా. మెచ్యూరిటీ తర్వాత అప్పటి పసిడి ముఖ విలువకు సరిసమానంగా రూపాయి మారకంలో చెల్లింపు జరుగుతుంది. బాండ్లపై వచ్చే వడ్డీ మాత్రం పసిడి గ్రాముల రూపంలో ఉండవచ్చని చర్చాపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. బంగారం రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయి కనుక.. ఇందులో ఉండే రిస్కుల గురించి ఇన్వెస్టరు అవగాహన ఉండాలి.

  ఇతరత్రా రుణాలు తీసుకునేందుకు వీటిని తనఖా కింద కూడా ఉపయోగించుకోవచ్చు. లోన్ టు వేల్యూ నిష్పత్తి ప్రస్తుతం బంగారం విషయంలో పాటిస్తున్నట్లే ఆర్‌బీఐ నిర్దేశించే విధంగా ఉంటుంది. పోస్టాఫీసుతో పాటు బ్రోకర్లు, ఏజెంట్ల ద్వారా వీటిని విక్రయించాలని, అందుకు తగిన కమీషన్ ఇవ్వాలన్నది ప్రతిపాదన. ప్రభుత్వ హామీ ఉండే ఈ బాండ్లను సులభంగా కమోడిటీ ఎక్స్చేంజీల్లో విక్రయించడానికి, ట్రేడింగ్ చేయడానికి వీలుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement