కల్లోలంలో కుదురుగా ఉంటేనే..! | Equity is a better tool that gives better returns with liquidity | Sakshi
Sakshi News home page

కల్లోలంలో కుదురుగా ఉంటేనే..!

Published Mon, May 16 2022 1:20 AM | Last Updated on Mon, May 16 2022 1:20 AM

Equity is a better tool that gives better returns with liquidity - Sakshi

పుష్కలమైన లిక్విడిటీతో మంచి రాబడులను ఇచ్చే మెరుగైన సాధనం ఏదైనా ఉందంటే అది ఈక్విటీయే. కానీ, ఈక్విటీలన్నవి అస్థిరతల నడుమ తిరుగుతుంటాయి. సానుకూల పరిణామాలకు పొంగిపోయినట్టే.. ప్రతికూలతల్లో పతనాలను చూస్తుంటాయి. ఇవన్నీ సర్వసాధారణం. ఈ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటున్నాం..? అన్నదే రాబడులను నిర్ణయిస్తుంటుంది. మార్కెట్లో మన స్థానాన్ని పరీక్షిస్తుంది. జనవరి 17న సెన్సెక్స్‌ 61,475. మే 9న 54,470కు దిగొచ్చింది.

మార్చి 8న 52,261 కనిష్ట స్థాయి వరకూ వెళ్లిన సెన్సెక్స్, అక్కడి నుంచి మార్చి 31 నాటికి 58,891కు చేరింది. మళ్లీ ఇప్పుడు వెనుక చూపులు చూస్తోంది. ఈ అస్థిరతలకు ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తున్నారన్నది ఈక్విటీ పెట్టుబడులకు కీలకం అవుతుంది. ఈ తరహా అశాంతి, ఆందోళనకు గురిచేసే ఈక్విటీ కల్లోల పరిణామాల్లో సాధారణ ఇన్వెస్టర్లు ఏం చేస్తే మెరుగ్గా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలియజేసే కథనమే ఇది.  

2020 మార్చిలో సెన్సెక్స్‌ 29,468 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఒక్క నెలలోనే 9,442 పాయింట్లు కోల్పోయింది. ఇది 24 శాతానికి సమానం. మార్కెట్లు పడినప్పుడే ఇన్వెస్ట్‌ చేద్దామని ఎదురు చూసే ఇన్వెస్టర్లు కొందరు ఉంటారు. వీరికి 2020 మార్చి–ఏప్రిల్‌ కరోనా క్రాష్‌ మంచి అవకాశం. తమ దగ్గరున్న మిగులు నిల్వలను పెట్టుబడిగా పెట్టుకున్నారు. అయితే, ప్రతీ మార్కెట్‌ పతనాన్ని పెట్టుబడులకు చక్కని అవకాశంగా తీసుకోవడం సాధ్యపడదు. అలాగే, మార్కెట్‌ గరిష్టాలను సరిగ్గా అంచనా వేసి అక్కడ విక్రయించడం కూడా ఎక్కువ సందర్భాల్లో అసాధ్యమే.

మంచి అవకాశం తలుపుతట్టినా ఆ సమయంలో ఇన్వెస్టర్‌ ఎలా స్పందించాడన్నది కీలకం అవుతుంది. 2020 మార్కెట్‌ పతనం సమయంలో మెజారిటీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.  మార్కెట్లు ఇంకా పడిపోతాయని అనుకున్నారు. మెజారిటీ విశ్లేషకులు కూడా ఇదే అంచనా వేశారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక దశ నుంచి మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అదే ఏడాది చివరికి దాదాపు నష్టాలన్నింటినీ భర్తీ చేసుకున్నాయి.

మార్కెట్లు అంచనాలకు భిన్నంగా అలా పెరిగేసరికి అక్కడి నుంచి మళ్లీ పడిపోతాయన్న అంచనాలు వినిపించాయి. దీంతో సెన్సెక్స్‌ 40వేల స్థాయికి చేరగానే కొందరు పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. కానీ, ఏమైంది..? మార్కెట్లు అక్కడి నుంచి పడిపోలేదు. మరో 50 శాతం పెరిగి 60,000కు చేరింది సెన్సెక్స్‌. ‘‘మార్కెట్లు ఎగిసిపడడం సర్వసాధారణం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా వాటిని చూసి అనవసరంగా మన పెట్టుబడులను విక్రయించడం లేదా కొనుగోలు చేస్తే గాయాలపాలు కావాల్సి వస్తుంది’’అన్నది నిపుణుల సూచన.  

మార్కెట్ల గరిష్ట స్థాయి ఇది, కనిష్ట స్థాయి ఇది.. మార్కెట్లు ఇక్కడి నుంచి పెరుగుతాయి.. ఇక్కడి నుంచి పడిపోతాయి.. ఈ తరహా అంచనాలు (మార్కెట్‌ టైమింగ్‌) వేసుకోవడం సరైన విధానం కానే కాదు. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇది అనుసరణీయం కాదు. ఎక్కువ సందర్భాల్లో అంచనాలు తప్పి, ర్యాలీలు మిస్‌ అయిపోవచ్చు. ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చేజార్చుకుని, ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద అడుగు పెట్టొచ్చు. అందుకని రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేసి కొనసాగడమే సరైన విధానం అవుతుంది.

తరచూ పెట్టుబడులను మార్చే విధానం వారికి పెద్దగా కలసి రాదు. క్రమం తప్పకుండా ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించాలి. ‘‘మార్కెట్లలో పతనాల కోసం వేచి చూస్తూ, ప్రస్తుతం మార్కెట్‌ పతనంలో పెట్టుబడి పెట్టాలని చూసే వారికి మేమిచ్చే సలహా ఒక్కటే. ఒకే విడత పెట్టుబడి పెట్టకుండా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడి చేసుకోవడమే మెరుగైన మార్గం. మీరు నిర్ణయించుకున్న అస్సెట్‌ అలోకేషన్‌ విధానానికి అనుగుణంగా నడుచుకోవాలి’’ అని ‘క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌’ ఈక్విటీ ఫండ్‌ మేనేజర్‌ సార్బ్‌ గుప్తా సూచించారు.   

అస్థిరతలు.. అవకాశాలు 
మార్కెట్లలో అస్థిరతలు నిజానికి ఇన్వెస్టర్లకు రాబడి తెచ్చి పెట్టే అవకాశాలుగా అర్థం చేసుకోవాలి. అందరూ ఎగబడి కొంటుంటే విక్రయించడం.. అందరూ ఆందోళనతో విక్రయిస్తుంటే కొనుగోలు చేయడం అన్న వారెన్‌ బఫెట్‌ సూత్రాన్ని గుర్తు చేసుకోవాలి. అస్సెట్‌ అలోకేషన్‌ కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మార్కెట్లు పడిపోతుంటే స్టాక్స్‌ చౌక ధరలకే లభిస్తాయి. లేదంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లు కూడా ఎక్కువ సొంతం చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది.

ఉదాహరణకు రూ.1,000ను ఒక పథకంలో రూ.11 ఎన్‌ఏవీ వద్ద ఇన్వెస్ట్‌ చేశారనుకుంటే.. అప్పుడు 90.90 యూనిట్లు వస్తాయి. ఏడాది చివరికి అదే ఎన్‌ఏవీ రూ.13కు వెళితే 18.18 శాతం రాబడి వచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఎన్‌ఏవీ రూ.9కు దిగిపోతే అప్పుడు మరో రూ.1,000 ఇన్వెస్ట్‌ చేస్తే 111.11 యూనిట్లు వస్తాయి. మొత్తం రూ.2,000 పెట్టుబడికి వచ్చిన యూనిట్లు 202. అప్పుడు ఎన్‌ఏవీ రూ.13కు చేరిందనుకోండి రాబడి రేటు 31.30 శాతంగా ఉంటుంది. అస్సెట్‌ అలోకేషన్‌ కానీ, సిప్‌ విధానంలో కానీ ఈ విధమైన ప్రయోజనాన్ని పొందొచ్చు.   

సమాచారం విషయంలో జాగ్రత్త
ఈక్విటీలకు సంబంధించి ఎంతో సమాచారం డిజిటల్‌ వేదికలపై ప్రసారమవుతుంటుంది. ఒకప్పటితో పోలిస్తే నేడు అధిక సమాచార వ్యాప్తి ఇన్వెస్టర్లను కుదురుగా ఉండనీయడం లేదు. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌లో సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం తప్పటడుగులకు దారితీయకుండా చూసుకోవాలి. అవసరమైన సమాచారానికే పరిమితం కావాలి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిందన్న సమాచారం వెలుగు చూడగానే కంగారుగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించేసిన ఇన్వెస్టర్లు ఉన్నారు. విక్రయించడం సులభమే. కానీ, ఈ పెట్టుబడిని మళ్లీ ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తామన్నది కూడా రాబడులను నిర్ణయిస్తుంటుంది.

యుద్ధం వల్ల మొత్తం మార్కెట్‌ కంటే కూడా విడిగా కొన్ని కంపెనీలపై ప్రభావం భిన్నంగా ఉంటుంది. ‘‘ఒక కంపెనీ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నప్పటికీ స్వల్ప కాలంలో ఆ కంపెనీ షేరు ధర పడిపోవచ్చు. కానీ, అది తాత్కాలికమే. దీర్ఘకాలంలో అదే తీరు కొనసాగదు. మార్కెట్లో ఉన్న సెంటిమెంట్, పరిశ్రమ భవిష్యత్తు అంచనాలు, యాజమాన్యం నాణ్యత, ప్రమోటర్, కార్పొరేట్‌ చర్యలు ఇలా ఎన్నో అంశాలు షేర్ల ధరలను, మార్కెట్‌ విలువను ప్రభావితం చేస్తుంటాయి’’అని స్మాల్‌కేస్‌ సీఈవో వసంత్‌కామత్‌ పేర్కొన్నారు. ఒక కంపెనీ షేరు ధర ఎప్పటికైనా దాని వ్యాపార, ఆర్థిక మూలాలకు తగ్గట్టు నడుచుకోవాల్సిందేనన్నారు.  

 దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు కంపెనీ ఆర్థిక, వ్యాపార బలాలు, ఇతర అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి తప్పించి, తాత్కాలికంగా వినిపించే వార్తలు, సమాచారంతో అయోమయానికి గురి కాకూడదు. పెట్టుబడి కాల వ్యవధి కూడా ఈ తరహా సమాచారంపై ఆధారపడాలా? లేదా అన్నది నిర్ణయించుకోవడానికి మార్గదర్శి అవుతుంది. ‘‘ఉదాహరణకు మూడేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేశారనుకోండి.

ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి వార్తలు రణగొణధ్వనే అవుతుంది. ఒకవేళ మూడు నెలల కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, అప్పుడు ప్రస్తుత యద్ధం సంక్షోభ పరిణామాలకు స్పందించాల్సి ఉంటుంది’’అని మోతీలాల్‌ ఓస్వాల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ పీఎంఎస్‌ ఫండ్‌ మేనేజర్‌ శ్రేయి లూంకర్‌ వివరించారు. యుద్ధం కంపెనీ వ్యాపార నమూనానే దెబ్బతీస్తుందా? లేక తాత్కాలిక ప్రభావం చూపిస్తుందా? అన్నది తేల్చుకున్న తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలి.  

కాల వ్యవధి కీలకం..
దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసినప్పుడు ఈక్విటీలు మంచి పనితీరు చూపించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే స్వల్పకాలంలో ఆటుపోట్ల కారణంగా పెట్టుబడికి నష్టం ఏర్పడవచ్చు. స్వల్పకాలంలో అస్థిరతలను ఎదుర్కొన్నా.. సుదీర్ఘ బాటసారిగా మార్కెట్లు ముందుకే ప్రయాణం చేస్తాయని చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020 కరోనా సంక్షోభ సమయాల్లో ఈక్విటీ మార్కెట్లు సగం మేర వాటి విలువను కోల్పోయాయి. కానీ, ఈ రెండు సందర్భాల తర్వాతి కాలంలో మార్కెట్లు మళ్లీ లేచి నిలబడ్డాయి.

స్వల్పకాలంలో గణాంకాలు నిరాశకు గురి చేయవచ్చు. దీర్ఘకాలంలో పనితీరు ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఈక్విటీల తీరు అలా ఉంటుంది. గడిచిన మూడు నెలల కాలంలో నిఫ్టీ 100, బీఎస్‌ఈ 500 సూచీల రాబడి 0.75 శాతం, 1.23 శాతం కాంపౌండెడ్‌ వార్షిక వృద్ధి రేటుగానే ఉంది. కానీ, గత ఐదేళ్ల కాలంలో చూస్తే వీటి కాంపౌండెడ్‌ వార్షిక వృద్ధి 15 శాతంగా ఉంది. ఈక్విటీ పెట్టుబడి అంటే.. ఏదో ఒక స్టాక్‌లో ఒక ధర వద్ద ఇన్వెస్ట్‌ చేసి, నిర్ణీత శాతం పెరిగిన తర్వాత విక్రయించడం అని కాదు.

ఒక వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నట్టు. ఆ వ్యాపారానికి దీర్ఘకాలంలో ఉన్న వృద్ధి అవకాశాలను చూడాలి. వాటి ఆధారంగా ఇన్వెస్ట్‌ చేయాలి. అప్పుడు ఆ వ్యాపారం వృద్ధి సాధిస్తున్న కొద్దీ అది షేరు ధరపై ప్రతిఫలిస్తుంది. అంతిమంగా పెట్టుబడి మంచి వృద్ధిని చూస్తుంది. కనుక ఈక్విటీలను ఎప్పుడూ దీర్ఘకాల పెట్టుబడి సాధనంగానే చూడాల్సి ఉంటుంది. స్వల్పకాల దృష్టితో చూసే వారికి డెట్‌ సాధనాలే మార్గం.  
 
రీబ్యాలెన్సింగ్‌  కీలకం...

అస్సెట్‌ అలోకేషన్‌ ప్రణాళికను మార్కెట్ల అస్థిరతల సమయాల్లో లేదా ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. దీన్నే రీబ్యాలెన్సింగ్‌ అంటారు. ఉదాహరణకు ఈక్విటీ వ్యాల్యూయేషన్‌ మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 50 శాతం ఉండాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. మార్కెట్ల అస్థిరతల్లో ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల విలువలో 40 శాతానికి పడిపోయిందనుకోండి. అప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ 50 శాతానికి వచ్చే విధంగా ఇతర విభాగాల నుంచి పెట్టుబడులను తీసుకొచ్చి ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

అస్సెట్‌ అలోకేషన్‌ పట్ల క్రమశిక్షణగా నడుచుకుంటే దీర్ఘకాలంలో ఆ ప్రయోజనం ఏంటో స్వయంగా కళ్లజూస్తారు. అంతేకాదు, మార్కెట్లు బాగా ర్యాలీ చేసిన సందర్భాల్లో ఈక్విటీల వ్యాల్యుయేషన్‌ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 70 శాతానికి చేరిందనుకుంటే.. అప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ 50 శాతానికి దిగి వచ్చే విధంగా కొంత పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి. వాటిని ఇతర సాధనాలకు కేటాయించుకోవాలి. దీన్నే రీబ్యాలెన్స్‌ అంటారు. దీనివల్ల ఒక విభాగంలో వచ్చే ఆటుపోట్లను అవకాశంగా తీసుకుని అదనపు పెట్టుబడులు పెట్టడం.. ఒక విభాగంలో అధిక వృద్ధి నుంచి లబ్ధి పొందడం ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. అస్సెట్‌ అలోకేషన్‌ అంటే వైవిధ్యం అని కూడా అర్థం చేసుకోవాలి.

ఒకే చోట పెట్టుబడులు అన్నింటినీ పెట్టకుండా వైవిధ్యం పాటించడం. అలాగే, విడిగా ఆయా విభాగాల్లోనూ వైవిధ్యాన్ని పాటించడం మంచిది. ఉదాహరణకు ఈక్విటీల్లో ఒకే రంగంలో, ఒకే విభాగంలో (లార్జ్‌/మిడ్‌/స్మాల్‌క్యాప్‌) కాకుండా వర్గీకరించుకోవాలి. ఈక్విటీ మార్కెట్ల సహజ తీరును అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో కోరుకుంటున్న రాబడి రేటు, కావాల్సిన నిధి, ఏ మేరకు పెట్టుబడులు పెట్టగలరు వీటన్నింటినీ విశ్లే షించుకుని చక్కని అస్సెట్‌ అలోకేషన్‌ ప్రణాళిక వేసుకుంటే.. ఇక మార్కెట్లు ఎలా స్పందించినా.. అది చూసి ఇన్వెస్టర్‌గా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పోర్ట్‌ఫోలియో మీరు ఆశించిన మేర ఫలితాలను ఇచ్చే విధంగా రక్షణ కల్పించుకున్నట్టు అవుతుంది.   

అస్సెట్‌ అలోకేషన్‌..
మార్కెట్లు ఏ స్థాయిలో ఉంటే మనకు ఎందుకు..? అస్సెట్‌ అలోకేషన్‌ ప్రణాళికకు అనుగుణంగా పెట్టుబడుల క్రమం కొనసాగాలన్నది నిపుణుల సూచన. అస్సెట్‌ అలోకేషన్‌ అన్నది వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. రిస్క్‌ తీసుకునే సామర్థ్యం, ఎంత కాలం పాటు పెట్టుబడులు పెట్టగలరు, కొనసాగించగలరు, ద్రవ్యోల్బణం, అస్థిరతలు ఇత్యాది అంశాల ఆధారంగా ఎవరికి వారే తమకు అనుకూలమైన అస్సెట్‌ అలోకేషన్‌ను నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఈక్విటీ పెట్టుబడులకు.. డెట్, బంగారంలోని పెట్టుబడులు అస్థితరలకు రక్షణగా నిలుస్తాయి. ఈక్విటీ మార్కెట్లు కుదేలైన సందర్భాల్లో పోర్ట్‌ఫోలియోలో వాటి విలువ సహజంగానే పడిపోతుంది.

అదే సమయంలో బంగారం, డెట్‌ ఫండ్స్‌లోని పెట్టుబడుల రూపంలో కొంత రక్షణ ఉంటుంది. ఈక్విటీల షాక్‌లను తట్టుకునేందుకు ఇలా భిన్న సాధానాలతో అస్సెట్‌ అలోకేషన్‌ ఉండాలి. గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే పెట్టెలో పెట్టకూడదన్నదే అస్సెట్‌ అలోకేషన్‌కు మూలం. ఈక్విటీ, డెట్, ఇతర సాధనాల మధ్య సమతూకం పాటించాలి. ఎక్కువ రాబడులను ఇస్తుంది కదా అని ఈక్విటీలపైనే పూర్తిగా ఆధారపడకూడదు. డెట్‌ ఫండ్స్‌లో రాబడులు చాలా తక్కువగా ఉన్నా సరే పెట్టుబడి కాపాడుకునే వ్యూహంలో భాగంగా కొంత మొత్తాన్ని డెట్‌ సాధనాలకూ కేటాయించుకోవాల్సిందే. ఈ విధమైన సమతూకం లేకపోతే మార్కెట్ల పతనాల్లో ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందన్న నిపుణుల హెచ్చరిక. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement