మార్కెట్లకు కష్టకాలమా?
♦ ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీలో మందగమనం
♦ కొన్నాళ్లు కన్సాలిడేషన్ దశలోనే మార్కెట్లు
♦ ఇప్పటికిప్పుడైతే వడ్డీరేట్లు బాగా పెరగకపోవచ్చు
గత పదిరోజులుగా స్టాక్ సూచీలు అక్కడక్కడే తిరుగాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,969 పాయింట్ల గరిష్ట స్థాయి, 8,689 పాయింట్ల కనిష్ట స్థాయిల మధ్య కదలాడి ప్రస్తుతం 8,832 పాయింట్ల వద్ద ఉంది. వడ్డీరేట్లు పెరుగుతాయనే ఆందోళనతో ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్ల తీరూ గడిచిన వారం పదిరోజులుగా ఇలాగే ఉంది. స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వడ్డీరేట్లను ఫెడ్ పెంచుతుందనే అంచనాల నేపథ్యంలో వర్ధమాన దేశ స్టాక్ మార్కెట్ల లాభాల పరుగుకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు భావించారు. అయితే అంచనాలకు విరుద్ధంగా ఈ నెలలో రేట్లను అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పెంచలేదు. డిసెంబర్లో పెంచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగానే చెప్పింది.
కేంద్ర బ్యాంక్‌ల తీరు మారుతోంది...
యూరోపియన్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌ల నుంచి మరింతగా ఉద్దీపన ప్యాకేజీలు రావాలని, అలా వస్తే మరింత బలం పుంజుకోవచ్చని గ్లోబల్ మార్కెట్లు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుత కేంద్ర బ్యాంక్‌ల వరుస చూస్తే మాత్రం దీనికి భిన్నంగా ఉంది.
ఆందోళన అనవసరం...: అంతర్జాతీయ కారణాల వల్ల లిక్విడిటీ తగ్గుతున్నదన్న అంశాన్ని చూసి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అలాగని దాన్ని తేలికగా తీసుకోవటానికీ వీల్లేదు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని పొందుతున్న నేపథ్యంలో లిక్విడిటీ తగ్గడం తాత్కాలికమేనని చెప్పవచ్చు. ప్రపంచ వడ్డీరేట్ల ఈల్డ్‌లు ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నాయి. కానీ దీర్ఘకాలంలో నిర్మాణాత్మక విధానంలో వడ్డీరేట్ల ఈల్డ్‌లు పెరగాల్సి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే, వడ్డీరేట్లు కూడా పుంజుకుంటాయి. అమెరికాతో పాటు చైనా, యూరప్, జపాన్ ఆర్థిక వ్యవస్థలు కూడా పుంజుకోవాల్సి ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి వడ్డీ రేట్లు పెరిగిపోతాయని ఇప్పటి కిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు.
లిక్విడిటీ తగ్గుతుందా ?
అయితే లిక్విడిటీ ఎంత వరకూ తగ్గుతుందనేది ప్రస్తుతం జవాబు దొరకని ప్రశ్నే. లిక్విడిటీ విషయమై వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎంతకాలం వరకూ అప్రమత్తంగా వ్యవహరిస్తాయనేది కూడా ఇపుడు ఇన్వెస్టర్లందరినీ తొలుస్తున్న ప్రశ్న. లిక్విడిటీ విషయమై కేంద్ర బ్యాంక్‌లు వెనక్కు తగ్గితే, ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై కొంత ప్రభావం ఉంటుంది. భవిష్యత్తు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని ఇంగ్లండ్, యూరోప్, జపాన్ కేంద్ర బ్యాంక్‌లు పేర్కొన్నాయి. అయితే సమీప కాలంలో లిక్విడిటీ పెంచే చర్యలేవీ తీసుకోలేమని ఈ బ్యాంక్‌లు సూచనప్రాయంగా వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాతనే కేంద్ర బ్యాంక్‌లు తమ ద్రవ్య విధానాలను సవరిస్తాయి. అప్పటివరకూ ఈక్విటీ మార్కెట్లు కన్సాలిడేషన్ దశలోనే ఉంటాయి. ఏడాది కనిష్ట స్థాయిల నుంచి చూస్తే ఎంఎస్‌సీఐ(మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్)-ప్రపంచ సూచీ 17 శాతం ఎంఎస్‌సీఐ-ఈఎం(ఎమర్జింగ్ మార్కెట్స్) 31 శాతం, ఎంఎస్‌సీఐ-ఇండియా సూచీ 26 శాతం చొప్పున రాబడులనిచ్చాయి. భారత్‌లో ఈ ఏడాది మార్చి నుంచి విదేశీ పెట్టుబడులు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ రూ.63,000 కోట్ల విదేశీ పెట్టుబడులొచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,500 కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి.